జీహెచ్ఎంసీ కమిషనర్కు కేసీఆర్ ఫోన్
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడ్డ పరిస్థితులపై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరం అయితే రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు.
అలాగే హుస్సేన్ సాగర్ ద్వారా నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, విద్యుత్, నీటి పారుదల శాఖ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచన చేశారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల్లోకి భారీ వరదనీరు వస్తున్నందున అవి తెగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కాగా నగరంలో చేపట్టిన పునరావాస, సహాయ చర్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.