మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు
‘విద్యుత్’ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ లేఖ
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ విచారణ కమిషన్
నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నాలు
వ్యతిరేక రిపోర్టు ఇవ్వాలన్నదే మీ అభిప్రాయం
పరిధి దాటి వ్యవహరిస్తూ బద్నాం చేస్తున్నారు
మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
15లోగా హాజరై సమాధానం ఇవ్వాలనుకున్నా
నిష్పక్షపాతంగా విచారణ జరగట్లేదని తేలిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు.
ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్‌గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది.
చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు..
విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది.
ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి.
అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్‌రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.
విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి
భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్‌ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్‌ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు.
దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్‌గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు.
భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.
గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణి
జస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment