1251 రోజులపాటు...రోజుకో కొత్త షూ తొడుక్కొని స్కూల్‌కు వెళ్లిందో విద్యార్థిని. ఆరేళ్లపాటు సాగిన ఈ సరదా రికార్డుకు చేరువైంది.
సాక్షి, సిటీబ్యూరో : ఓ తండ్రి రికార్డుల కల కన్నాడు.అందుకు చిన్నప్పటి నుంచి నాణేలుసేకరించాడు. అయితే ఇందులో కొత్తేం ఉంది? అందరూ సేకరిస్తారు కదా అనుకున్నాడు. ఏదైనా కొత్తగా చేయాలని తపించాడు.తాను సాధించలేనిది.. తన కూతురితోనైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు. కుమార్తెకు రోజుకో కొత్త షూ, సాక్సుల జతను కొనిచ్చి స్కూల్‌కు పంపించాడు. అలా 1997–2003 వరకు ఆరేళ్లు ఇలా చేశాడు. అయితే మధ్యలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మానేశాడు.ఆ షూలు, సాక్సుల జతలను భద్రపరిచి, వివిధ సంస్థలకు పంపించగా ఇన్నేళ్లకువరల్డ్ రికార్డులు వరించాయి. మొత్తానికిఆ తండ్రి కల ఫలించింది.
పాతబస్తీలోని శాలిబండకు చెందిన డాక్టర్ అలీం ఖాద్రి రికార్డు కథ ఇది. తన కుమార్తె అస్ఫియాను 1997లో గన్‌ఫౌండ్రీలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించాడు. ఆ రోజు జూన్ 16. అస్ఫియా తొలి రోజు స్కూల్‌కు వెళ్తోంది. కొత్త యూనిఫామ్, కొత్త షూలు ధరించింది. మరుసటి రోజు మరో కొత్త జత షూలు, సాక్సులతో వెళ్లింది.
ఇలా 1997లో ఎల్‌కేజీ నుంచి 2003లో నాలుగో తరగతి పూర్తి చేసే వరకు మొత్తం 1251 షూ, సాక్సుల జతలు ధరించింది. వాటన్నింటినీ భద్రపరిచిన అలీం ఖాద్రి... వాటి ఫొటోలను వివిధ సంస్థలకు పంపించగా రికార్డులు వచ్చాయి. గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి.
ఎంకరేజ్ చేశారు..
‘నేను ప్రతిరోజు స్కూల్‌కు కొత్త షూలు ధరించి వెళ్తే టీచర్లు, స్నేహితులు చాలా ఎంకరేజ్ చేసేవారు. అలా ఎల్‌కేజీ నుంచి నాల్గో తరగత వరకు కొత్త షూలు వేసుకున్నాను. ఆ షూస్, సాక్సులు, వాటిని తీసుకొచ్చిన కవర్లు, స్టికర్లు... ఇలా ప్రతిదీ షూ బాక్స్‌లో వేసి భద్రపరిచాం. మొత్తం 1251 షూ సహా 9,368 వస్తువులు ఉన్నాయ’ని అస్ఫియా తెలిపారు. తాను ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి, ఎంఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
అలా ఆలోచన...
‘నేను చిన్నప్పటి నుంచి వివిధ దేశాల, ప్రాంతాల్లోని నాణేలు సేకరించేవాడిని. కానీ ఎంతో మంది దేశవిదేశాల నాణేలు సేకరిస్తుంటారు. నాణేలకు హద్దు ఉండదు. నాణేలు సేకరించినా ఎలాంటి రికార్డులు సాధించలేమని, ఏదైనా కొత్తగా చేయాలని ఉండేది. మా అమ్మాయి అస్ఫియాను అప్పుడే స్కూల్‌లో చేర్పించాం. అమ్మాయి కోసం కొత్త పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, షూలు కొన్నాను. అస్ఫియా మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు నాకొక ఆలోచన తట్టింది. ప్రతిరోజు ఓ కొత్త షూ జతను మా అమ్మాయికి కొనివ్వాలని అనుకున్నాను. అలా 1997 జూన్ 16 నుంచి 2003 జూన్ 14 వరకు స్కూల్‌కు వెళ్లే ప్రతిరోజు ఓ కొత్త షూ జతను వేసుకునేద’ని వివరించారు అలీం ఖాద్రీ.
⇒ ఆరేళ్లు రోజుకో షూ, సాక్సుల జత
⇒ పాతబస్తీలోని డాక్టర్ అలీం ఖాద్రీ వినూత్న ప్రయత్నం
⇒ రికార్డు సాధించాలనే తపనతోకూతురికి కొనిచ్చిన తండ్రి
⇒ ప్రతిరోజు కొత్త షూలతో స్కూల్‌కువెళ్లిన కూతురు అస్ఫియా
⇒ మొత్తం 1251 షూలు, సాక్సులను భద్రంగా దాచిన వైనం
⇒ ఇది 1997–2003లో జరిగిన విషయం
⇒ ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసిన అస్ఫియా
⇒ ఇన్నేళ్లకు వరల్డ్ రికార్డులు సొంతం
⇒ ఈ నెల 20న అవార్డుల ప్రదానం
భార్య, కూతురుసహకారంతో...
‘నా భార్య, కూతరు సహకారంతో నా కల నెరవేరింది. అందరం కలిసి షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. కొన్ని సందర్భాల్లో మా అమ్మాయి షూ నంబర్ లభించేది కాదు. దీంతో ముందస్తుగానే షూలు కొనుగోలు చేశాం. షూల కోసం ఇంటిలోని ఓ గదిని కేటాయించాం. మొత్తం షూల కొనుగోలుకు దాదాపు రూ.2లక్షలు ఖర్చు అయ్యాయి. డబ్బు ఖర్చు అయినందుకు ఎలాంటి బాధ లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంద’ని చెప్పారు అలీం ఖాద్రి.
ఆలస్యానికి కారణమిదీ...
‘అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండడంతో సరదాగా ప్రతిరోజు కొత్త షూలు కొనిచ్చాను. అయితే అమ్మాయి ఐదో తరగతిలో రాగానే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో షూలు కొనలేకపోయాను. ఆ తర్వాత నేను భద్రపరిచిన షూల ఫొటోలతో రికార్డుల కోసం పలు సంస్థలకు పంపించాను. అయితే షూలు డిస్‌ప్లే చేస్తూ వీడియో రికార్డింగ్ పంపించుమన్నారు. తదితర కారణాలతో అది ఆగిపోయింది. 2016 నుంచి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాను. గతేడాది షూలు మొత్తం ఒకే దగ్గర డిస్‌ప్లే చేసి.. వీడియో రికార్డింగ్, ఫొటోలు పంపించాం. దీంతో గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి. అందరూ ఒకేసారి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించార’ని చెప్పారు అలీం ఖాద్రి. వీటిని ఈ నెల 20న నయాపూల్ మినార్ గార్డెన్స్‌లో ప్రదానం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment