
సాక్షి, జైపూర్: ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ‍్నం మంచిర్యాల జిల్లా జైపూర్‌లో చోటుచేసుకుంది. మృతుడు సూర్యపేట జిల్లా హుజుర్‌నగర్‌కి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అనుమానాస్పద మృతితో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జైపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 4వ జోనల్ స్థాయి క్రీడ పోటీలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ ఈ పోటీల‍్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నేటి ఆదివారం అతడు హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి మృతిచెందాడు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.