కరువు కాటుకు.. నిలబడిలేక..
తల్లిదండ్రులతోనే పిల్లలూ వలస
విద్యార్థులు లేక 77 పాఠశాలల మూత
కరువు కసిరింది. మనసు చెదిరింది. భుక్తి లేకుండా పోయింది. జనం ఊరుగాని ఊరు.. కానరాని దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆలనాపాలనా లేక పిల్లలూ వారివెంటే వెళ్తున్నారు. ఊళ్లలో తాళం వేసిన ఇళ్లు.. ఉలుకూపలుకూ లేని బడులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఏ పల్లెను కదిలించినా కరువు కథలే వినిపిస్తున్నాయి. కష్టాలు వినండయ్యా అంటూ వేడుకుంటున్నాయి.
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరువు దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. పొట్టకూటి కోసం తల్లిదండ్రులు వలసబాట పడుతున్నారు. వారి వెంటే పిల్లలూ వెళ్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇప్పటికే 77 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఇదే జాబితాలో మరో పది పాఠశాలలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మూత ‘బడి’నవి ఇవే బి.కొత్తకోట మండలంలో..
చండ్రమాకులపల్లె, బాటవారకురవప ల్లె, పులుసుమానిపెంట, వడిగలవాండ్లపల్లె, మల్లూరివారిపల్లె, కోటావూరు, గుడిసివారిపల్లె, బి.కొత్తకోట దళితవాడ, ఊజార్లపల్లె, చిటిమిరెడ్డిగారిపల్లె, బండారువారిపల్లె, ఉలవలవారిపల్లె, దిన్నిమీదపల్లె, (హార్సిలీహిల్స్ పాఠశాల మూతపడినా దాని కారణాలు వేరు)
కురబలకోట మండలంలో..
అడవిపల్లె, రామిగానివారిపల్లె, అంగళ్లు ఉర్దూ, నల్లసానివారిపల్లె, రామిగానిపల్లె, బ్రాహ్మణ ఒడ్డిపల్లె, మద్దిరెడ్డిగారిపల్లె, తూగువారిపల్లె, జబ్బావారిపల్లె, మేకలవారిపల్లె.
తంబళ్లపల్లె మండలంలో..
జరిపిటిదిన్నె, బోరెడ్డిగారిపల్లె, డేగలవారిపల్లె, బురుజు, ఎద్దులవారిపల్లె, మూలపల్లె, గట్టుమీదపల్లె, కే.కొత్తవారిపల్లె, ఆర్.మేకలవారిపల్లె, ఆర్.కొత్తలవారిపల్లె, దేవరబురుజు.
ములకలచెరువు మండలంలో..
నీరుగట్టువారిపల్లె, ఉంగరాలవారిపల్లె, బిల్లూరివారిపల్లె, తంబళ్లవారిపల్లె, కనుగొండవారిపల్లె
పెద్దమండ్యం మండలంలో..
దండేవారిపల్లె, దిగువపల్లె, కేతిరెడ్డివారిపల్లె, బిక్కావాండ్లపల్లె, గోర్లవానికుంట, దాసరికుంట, ఎల్లంవారిపల్లె, కనుమలోపల్లె, గంగతాతనగారిపల్లె, కొలిమికాడపల్లె, సిద్దవరం, ఉప్పరపల్లె, తాటిమాకులపల్లె, సి.తురకపల్లె, కుడుములవారిపల్లె.
పెద్దతిప్పసముద్రం మండలంలో..
గుంటిపల్లె, రేకులగుంటిపల్లె, చిన్నపొంగుపల్లె, పెద్దపొంగుపల్లె, చెట్లవారిపల్లె, తాతవారిపల్లె, తడిగవాండ్లపల్లె, ఉప్పరవాండ్లపల్లె, డి.నారాయణపల్లె, గోళ్లపల్లె, కమ్మవారిపల్లె, బెట్టకొండ, సామాడపల్లె, పట్టెంవాండ్లపల్లె, కాప్పల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఇవన్నీ ప్రాథమిక పాఠశాలలే కావడం గమనించదగ్గ విషయం.
భవనం ప్రారంభించకనే మూత..
వలసల ప్రభావం ఎలా ఉందో చెప్పేందుకు పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లె పాఠశాలే ఉదాహరణ. ఇక్కడ రూ.5.3 లక్షలతో కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఒక్క విద్యార్థీ చేరలేదు. ఇందుకు ప్రధాన కారణం కరువు. పిల్లలు తల్లిదండ్రులతో వెళ్లడంతో గ్రామంలో ఒక్క బిడ్డా లేరు. కొత్త భవనం ప్రారంభించకనే మూతపడింది. ఈ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉంది.
అంగన్‌వాడీ కేంద్రాలదీ అదేదారి
అంగన్‌వాడీ కేంద్రాలపైనా కరువు ప్రభావం పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొత్తం 394 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య తగ్గిపోతోంది. పుట్టినబిడ్డల నుంచి పాఠశాల విద్య నేర్చుకోవాల్సిన పిల్లల వరకు తల్లిదండ్రులతో కలిసి వలసలు వెళ్లిపోతున్నారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందని ఇప్పటికే 16 కేంద్రాలను సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేశారు. పిల్లలు లేకపోవడంతో బి.కొత్తకోట మండలం కొత్తపల్లె అంగన్‌వాడీ కేంద్రాన్ని మూసివేశారు.