‘మూత’పడిన బడి..!
♦ నలుగురు పిల్లలే చేరడంతో బడికి తాళం వేసిన అధికారులు
♦ ఉపాధ్యాయుడు, పిల్లలు కందూర్ పీఎస్‌లో చేరిక
అడ్డాకుల : కందూర్ పంచాయతీ పరిధిలోని వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాల మూత పడింది. ఈ ఏడాది బడిలో పిల్లలు తక్కువ సంఖ్యలో చేరడంతో విద్యాశాఖాధికారులు బడికి తాళం వేశారు. బడిలో చేరిన పిల్లలను కందూర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. వారితో పాటు ఇక్కడ పని చేసే ఉపాధ్యాయుడిని సైతం అదే బడికి పంపుతున్నారు. గతేడాది పదిమందిలోపే పిల్లలతో బడిని కొనసాగించారు.
ఈ సారి పది మందిలోపు పిల్లలున్న పాఠశాలలను మూసి వేసి వాటిని పక్క గ్రామాల్లోని బడుల్లో చేర్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది బడి ప్రారంభమైన తర్వాత కేవలం నలుగురు పిల్లలు మాత్రమే బడిలో చేరారు. బడిబాట సమయంలో తల్లిదండ్రులు తగినవిధంగా స్పందించలేదు.
దాదాపు గ్రామంలో 20 మంది వరకు చదువుకునే పిల్లలున్నప్పటికీ తల్లిదండ్రులు వారిని ఇతర పాఠశాలలకు పంపుతున్నారు. ఈసారి బడిలో నలుగురే చేరడంతో ఇటీవల అధికారులు బడిని మూసి వేశారు. ఇక్కడున్న పిల్లలను కందూర్ పీఎస్‌లో చేర్పించారు. ఈ సారి పిల్లల సంఖ్య పెరగకుంటే బడి మూసి వేస్తారని ముందే ప్రచారం జరిగినా గ్రామస్తులు స్పందించక పోవడంతో నలుగురు పిల్లలతో బడిని కొనసాగించ లేక తాళం వేశారు.
‘తండా’కు తప్పిన ముప్పు..!
కాటవరం తండా పాఠశాలలో గతేడాది తక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈసారి ఇక్కడ కూడా పిల్లల సంఖ్య పెరగకుంటే బడి కొనసాగడం కష్టమేనని అధికారులు ముందే హెచ్చరించారు. గతేడాది రెండు పాఠశాలల్లో తక్కువ మంది పిల్లలున్న కారణంతో ఈసారి వీటిని మూసి వేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది వడ్డెపల్లిలో పిల్లలు లేక ఇటీవల బడి మూతపడింది.
కాటవ రం తండాలో పిల్లలు బడిలో చేరకుంటే మూసి వేస్తారన్న విషయాన్ని గుర్తించిన గిరిజనులు మేల్కొన్నారు. ఈ ఏడాది బడిబాట సమయంలో ఉపా«ధ్యాయురాలితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రైవేటు బడికి వెళ్లే కొందరు పిల్లలను స్థానిక సర్కారు బడిలో చేర్పించారు. ప్రస్తుతం 17 మంది పిల్లలను బడి కొనసాగుతోంది.
తల్లిదండ్రులను చైతన్యం చేయాలి
పిల్లల సంఖ్య తక్కువగా ఉందని బడిని మూసి వేశారు. బడులు తెరిచేటప్పుడు అధి కారులు ప్రత్యేక శ్రద్ధవహించి తల్లిదండ్రులను చైతన్యం చేసి పిల్లలను సర్కారు బడిలో చేర్పించుకోవాలి.
– నాగిరెడ్డి, సర్పంచ్ కందూర్
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే..!
వడ్డెపల్లిలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బడిని మూసి వేయాల్సి వచ్చి ంది. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే పిల్లలు, ఉపాధ్యాయుడు కందూర్ పీఎస్‌కు వెళ్తున్నారు. కాటవరం తండాలో పిల్లల సంఖ్య పెరగడంతో అక్కడ బడి కొనసాగుతోంది.
–నాగయ్య, ఎంఈఓ, అడ్డాకుల