వాయు 'గండం' | Heavy rains disrupt normal life in Chennai, schools shut | Sakshi
Sakshi News home page

వాయు 'గండం'

Published Fri, Nov 3 2017 7:14 AM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM

Heavy rains disrupt normal life in Chennai, schools shut - Sakshi

సాక్షి, చెన్నై : మూడు రోజుల పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం ప్రాంతాలను ముంచెత్తిన వాన గురువారం దక్షిణ తమిళనాడు వైపు మళ్లింది. బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలోని నెలకొన్న అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో గత మూడు రోజులుగా చైన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షంపడ్డ విషయం తెలిసిందే. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందలో చిక్కుకున్నాయి. అధికార వర్గాలు ఉరుకులు పరుగులతో సహాయక చర్యల్ని చేపట్టారు. బుధవారం రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందనే సమాచారంతో ముందుస్తుగా గురువారం ఈ మూడు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో వరదల ఆందోళన రెట్టింపు అయింది. అయితే, ఆ రాత్రి చిరు జల్లులతో గడిచింది. ఉదయాన్నే భానుడు ప్రత్యక్షం కావడంతో లోతట్టు వాసుల్లో ఆనందం చిగురించింది. అధికార వర్గాలు ఆగమేఘాలపై చర్యలు చేపట్టినా, అనేకచోట్ల వరద నీరు తొలగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

 

20 వేళ ఇళ్లలోకి వరద నీరు
చెన్నై, శివారుల్లో 20 వేల ఇళ్లల్లోకి వరద నీరు చేరినట్టు అధికార వర్గాల గణాంకాలు తేల్చాయి.  ప్రధానంగా శివారువాసులు నీళ్లు తొలగని దృష్యా, ముప్పు తిప్పలు పడాల్సిన పరిస్థితి. సాయంత్రం వరకు భానుడు కనిపించినా తదుపరి వాతావరణం మారింది. మళ్లీ వర్షం తెరపించి తెరపించి పడుతోంది. చెన్నై శివారు ప్రాంతాలు, కాంచీపురం జిల్లా పరిధిలోని అన్ని చెరువులు దాదాపుగా నిండాయి. ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. మళ్లీ కుండపోత వర్షం పడ్డ పక్షంలో చెరువులకు పూర్తిస్థాయిలో గండికొట్టేందుకు  ఆ పరిసర వాసులు సిద్ధం అవుతున్నారు. దీంతో అడయార్‌ తీరంలో ఉత్కంఠ తప్పడం లేదు. చెన్నైలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డీఎంకే ఎమ్మెల్యేలు ఆగమేఘాలపై పర్యటించారు. వరద నీరు తొలగించేందుకు తగ్గ చర్యల్లో నిమగ్నం అయ్యారు. కొన్నిచోట్ల బాధితులకు తమవంతు సాయం అందించారు.

ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం
గురువారం దక్షిణ తమిళనాడు వైపుగా వర్షం మళ్లినట్టు పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడమే. శ్రీలంకకు సమీపంలోని నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో  తెరపించి తెరపించి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక, డెల్టా జిల్లాలు తంజావూరు, నాగపట్నం, తిరువారూర్‌లలో వర్షాలు పడుతుండగా, తిరుచ్చి, అరియలూరు, పెరంబలురు జిల్లాల్లో చినుకు కరువైంది. తిరునల్వేలిలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అనేకం జలదిగ్భందంలో చిక్కాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి సైతం వరదనీరు చేరింది. కుట్రాలం జలపాతం పొంగి పొర్లుతోంది. గడిచిన 24 గంటల్లో తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలో 13 సెం.మీ, తూత్తుకుడి జిల్లా  తిరుచెందూరు 9 సె.మీ చిదంబరం 8. సె.మీ  నాగటప్నటం, వేధారణ్యం, తంరంగం బాడిలలో ఆరు సె.మీ వర్షం పడింది. చెన్నై పూందమల్లి నుంగంబాక్కం, చెంగల్పట్టుల్లో నాలుగు సె.మీ వర్షం పడగా, అక్కడక్కడ తెరపించి తెరపించి చిరు జల్లులు, ఓ మోస్తరుగా వర్షం పడుతున్నది. ద్రోణి బలపడేనా లేదా అన్నది శుక్ర, లేదా శనివారం తేలుతుందని, అయితే, దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు మరింతగా పడుతాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ బాలచంద్రన్‌ తెలిపారు. సముద్ర తీర జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

చిన్నారులకు నివాళి
చెన్నై కొడుంగయూరులో బుధవారం విద్యుదాఘాతానికి యువశ్రీ(9), భావన అలియాస్‌ మణిమేఘలై(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు అప్పగించారు. ముక్కుపచ్చలారని చిన్నారుల్ని అధికారుల నిర్లక్ష్యం బలికొనడంతో ఆ పరిసర వాసులు కన్నీటి సంద్రంలో మునిగారు. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు తమ మీద ఆగ్రహంతో ఉన్నారని, ఎందుకంటే, ఈ ప్రభుత్వాన్ని ఇంకా కుప్పకూల్చకుండా తాము వేచిచూస్తుండడమేనని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా మరెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక, మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ మృతదేహాలకు నివాళుర్పించేందుకు రాగా, అక్కడున్న జనం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు మృతుల కుటుంబాలు నచ్చజెప్పడంతో ప్రజలు శాంతించారు. తమ పిల్లల మరణానికి విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అని ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతం అయ్యాయి. కాగా, ఒట్టేరి నమ్మాళ్వార్‌ పేట సుబ్బరాయన్‌ నాలుగో వీధిలో తన ఇంటి ముందు నిల్వ ఉన్న వర్షపు నీటిలో జారిపడి మారిముత్తు భార్య పవనమ్మాల్‌(48) మృతి చెందడంతో ఆ పరిసర వాసుల్లో ఆగ్రహం బయలుదేరింది. నీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండి పడుతున్నారు.

ముప్పు తప్పదన్న కమల్‌
చెన్నైకి మళ్లీ వరద ముప్పు తప్పదని విశ్వనాయకుడు కమల్‌ మరో మారు హెచ్చరించారు. దక్షిణ చెన్నై శివారుల్లోని చెరువులన్నీ నిండాయని, రోడ్లు, ఖాళీ స్థలాలు, చిన్న చిన్న సందుల్లో సైతం నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని వివరించారు. మళ్లీ వర్షం తీవ్రత పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ చెరువుల పటిష్టతపై ఆందోళన తప్పడం లేదన్నారు. పాలకుల నిర్వాకం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటూ, మరో ముప్పును తప్పించేందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, తమిళమానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్, సీపీఐ నేత ముత్తరసన్‌లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలో వరద నివారణ చర్యల్లో పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. ముందస్తు చర్యల్ని చేపట్టకుండా, ప్రకల్భాలు పలికుతూ కాలం నెట్టుకు వచ్చారని విమర్శించారు.

సీఎం సమాలోచన
వర్షాలు విస్తారంగా పడుతుండడంతో గురువారం సచి వాలయంలో అధికారులతో సీఎం పళని స్వామి సమావేశం అయ్యారు. సీనియర్‌ మంత్రులు, ఆయా విభాగా ల అధికారులతో సాగిన ఈ సమావేశంలో వర్షం తీవ్రత, సహాయక చర్యల ముమ్మరం తదితర అంశాలపై చర్చించారు. భారీ వర్షాలు ఎదురైన పక్షంలో లోతట్టు ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక శిబిరాలను ముందస్తుగా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, మీడియాతో ప్రజా పనుల శాఖ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 4500 ప్రాంతాల్ని వర్షం భారినపడే ప్రాంతాలుగా గుర్తించి ఉన్నామని, అక్కడల్లా సహాయక చర్యలు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రజలకోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని వివరించారు. ఆ మేరకు రాష్ట్రస్థాయిలో 1070 టోల్‌ ఫ్రీ నంబర్‌కు, జిల్లాల స్థాయిలో 1077 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.  

హైకోర్టు సీరియస్‌
చిన్నారుల మృతి వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు న్యాయవాది జార్జ్‌ విలియమ్స్‌ విద్యుతాఘాతం సంఘటనల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది రాజగోపాల్‌ జోక్యం చేసుకుని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన బెంచ్‌ ప్రజల ప్రాణా లకు రక్షణ కల్గించే విధంగా ముందస్తు చర్యలు తీసుకుని ఉండాల్సిందని మండిపడ్డారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు వేగవంతం చేయాలని హెచ్చరించారు. చెన్నైలో వరదల విషయంగా పిటిషన్లు దాఖలు అయ్యాయని, శుక్రవారం ఆ పిటిషన్లతో కలిసి జార్జ్‌ వాదనను పరిగణించి విచారణ చేపడుతామని పేర్కొన్నారు. విద్యుదాఘాతం, చిన్నారుల మరణం తదితర అంశాలపై ఫొటోలతో సహా ఆధారాలు సమర్పించాలని జార్జ్‌కు సూచించారు. కాగా, కోర్టుకు వ్యవహారం చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ స్థంబాల భద్రత, ఎక్కడెక్కడ విద్యుత్‌ జంక్షన్‌ బాక్సులు ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా అధికారులకు విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి ఆదేశాలు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement