ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.
భారీ వర్షాలు..
పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.
Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4
— Sreeram (@sreeram) November 30, 2024
వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm
— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024
మత్స్యకారులకు ఆదేశం..
ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.
విద్యాసంస్థలు బంద్
తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment