జోరు వాన.. ఆగిన రైళ్లు
చెన్నై: రోవాన్ తుఫాన్ ప్రభావం తమిళనాడుపై బాగా పడింది. గురువారం రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో చెన్నైతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాదాపు 14.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
దీంతో శుక్రవారం కూడా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా వరుసగా ఐదురోజులపాటు పాఠశాలలు మూతపడినట్లయింది. రైల్వే ట్రాకులపైకి నీరు చేరడంతో పలు లోకల్ రైళ్లతోపాటు ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆలస్యం ఏర్పడింది. తొమ్మిది రైళ్లలో కేవలం ఐదుమాత్రమే నడుస్తున్నాయి. దీంతో స్థానికులు తమ గమ్యస్థానం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.