స్కూళ్లు మూసేసి రండి
► మధ్యాహ్న భోజనం పెట్టి స్కూళ్లు బంద్ చేయాలి
► ప్రతి టీచరూ ముఖ్యమంత్రి సభకు రావాల్సిందే
► స్పష్టం చేసిన విద్యాశాఖ అధికారులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టేసి ఇంటికి పంపండి. స్కూళ్లు బంద్ చేసి హెచ్‌ఎంలు, టీచర్లందరూ సీఎం సమావేశానికి రావాలి’ అంటూ బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం బుక్కరాయసముద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో పాల్గొంటారు. వాస్తవానికి ఈ రెండు కార్యక్రమాలకు విద్యాశాఖకు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా...పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ చేయకూడదు.
అయితే ముఖ్యమంత్రి సమావేశం కదా...జనాలు తక్కువగా వస్తే బాగుండదని భావించిన శింగనమల నియోజక వర్గానికి చెందిన ఓ ముఖ్యనేతలు బడులు మూయించే కార్యక్రమానికి పూనుకున్నారు. ప్రతి స్కూల్ నుంచి టీచర్లను పంపాలని మండల విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వారు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేశారు.
ఇంకొందరికి మాత్రం ఎక్కడ ఇబ్బందు లు తలెత్తుతాయోనని భావించి.. నేరు గా పిలిపించుకుని చెప్పినట్లు తెలిసింది. పైగా సమావేశానికి హాజరుకాని ఉపాధ్యాయుల వివరాలు కూడా అధికార పార్టీ నాయకులకు అందజేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఎలాంటి కారణం లేకుండానే రెండు మండలాల్లోని పాఠశాలలు మధ్యాహ్నం నుంచి మూతపడనున్నాయి. దీనిపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా... తానెవరికీ చెప్పలేదన్నారు. కొందరు ఫోన్లు చేసి అడిగినా...పాఠశాలలు బంద్ చేయడం కుదరదని చెప్పానని, మరి ఆ స్కూళ్ల హెచ్‌ఎంలకు ఎవరు చెప్పారో తనకు తెలీదన్నారు.