సాక్షి, చెన్నై: ఈ ఏడాది వేసవి రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అగ్ని నక్షత్రం ముగిసినా ఎండలు ఇంకా మం డుతూనే ఉన్నాయి. అదే సమయంలో పరీక్షల అనంతరం విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించారు. అయితే, ఈ ఏడాది వేసవి సెలవులు కాస్త తక్కువే. ఈ సెలవులను కొందరు విద్యార్థులు పర్యాటక ప్రదేశాల్లో ఆహ్లాదంగా గడిపితే, మరి కొందరు విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, బంధువుల ఇళ్ల వద్ద సరదాగా ముగించేశారు. కొత్త విద్యా సంవత్సరంలో తమ పిల్లలకు అవసరమైన అన్ని రకాల విద్యా సంబంధిత వస్తువులను తల్లిదండ్రులు ఈ సెలవుల్లో సిద్ధం చేసుకున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ముందుగా ప్రకటించిన మేరకు రెండో తేదీ పాఠశాలల గేట్లు తెరచుకునేనా అన్న ప్రశ్న వ్యక్తయింది.
అయితే వేసవి సెలవులను పొడిగించకుండా, ముందుగా నిర్ణయించిన తేదీలోనే స్కూళ్లు పునఃప్రారంభం కావాలని విద్యాశాఖ ఆదేశించింది. పునఃప్రారంభం:సెలవులు ముగించుకున్న విద్యార్థులు ఉదయం నుంచి బడిబాట పట్టారు. భుజాన పుస్తకాల సంచులను వేసుకుని స్కూళ్లకు పరుగులు తీశారు. పది నుంచి ప్లస్‌టూ వరకు చదువుకుంటున్న విద్యార్థులు తమ మిత్రులను కలసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే మాధ్యమిక, ఉన్నత, మహోన్నత పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లన్నీ తెరచుకోవడంతో ఆ పరిసరాల్లో నెల రోజుల అనంతరం విద్యార్థుల సందడి నెలకొంది. ఎల్‌కేజీతో తొలి సారిగా స్కూళ్లలో అడుగు పెడుతున్న చిన్నారులు మాత్రం తెగ మారాం చేశారు.
కోటి మందికి పుస్తకాలు : ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీకి తొలి రోజే శ్రీకారం చుట్టారు. ఒకటి నుంచి ప్లస్‌టూ వరకు కోటి మంది విద్యార్థులు చదువుకుంటుండడంతో ఆయా తరగతుల వారీగా పుస్తకాలను ముందుగానే విద్యా శాఖ సిద్ధం చేసింది. ఆయా స్కూళ్లకు పుస్తకాలను పంపించేశారు. ప్రధాన నగరాలు, పట్టణాల్లోని స్కూళ్లకు పుస్తకాలు చేరినా, మారు మూల గ్రామాలకు ఇంకా పూర్తి స్థాయిలో చేరాల్సి ఉంది. చెన్నై విరుగ్గంబాక్కంలోని ఓ స్కూల్లో విద్యా శాఖ మంత్రి కేసీ వీరమణి, కార్యదర్శి సబితలు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లను అందజేసి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు.
పాత పాసులే: రాష్ర్ట ప్రభుత్వ రవాణా శాఖ నేతృత్వంలో విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం కొద్ది రోజుల పాటుగా విద్యార్థులు పాత పాసులే ఉపయోగించుకోవాలంటూ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు చదువుతున్న సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఫొటో గుర్తింపుతో కూడిన స్మార్ట్ కార్డు తరహాలో ఉచిత బస్సు పాసులను ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే పాసులు ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. అయితే, అనివార్య కారణాలు, ఎన్నికల విధులు అడ్డురావడంతో జాప్యం తప్పలేదు. విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోప్యాయుల నుంచి సేకరించాల్సి ఉండటంతో, ఆగమేఘాలపై ఆ పని పూర్తి చేయడం కష్టతరం. దీంతో ఈ ప్రక్రియను ఓ వైపు చేపడుతూనే, మరో వైపు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాత పాసులు ఉపయోగించుకోవాలంటూ అధికారులు ప్రకటించారు. పాత పాసులను అనుమతించాలంటూ రవాణా శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
బడి బాట
Published Mon, Jun 2 2014 11:53 PM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement