ఆ పిల్లలే వారికి దేవుళ్లు | The children of the gods | Sakshi
Sakshi News home page

ఆ పిల్లలే వారికి దేవుళ్లు

Published Tue, Aug 19 2014 11:00 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఆ పిల్లలే వారికి దేవుళ్లు - Sakshi

ఆ పిల్లలే వారికి దేవుళ్లు

ఉన్నత విద్యావంతుడు గణేశ్... స్పెషల్ టీచర్ విశాలాక్షి.
 దేవుడికిచ్చిన మాట కోసం... ఉద్యోగాలు మానుకున్నాడతడు.
 చుట్టూ ఉన్న పిల్లల్లోనే దేవుడున్నాడని... విదేశీ అవకాశాలను వదులుకున్నారామె.
 వీరిద్దరూ శ్రమిస్తున్నది ప్రత్యేకమైన పిల్లల సంక్షేమం కోసమే.
 అదే వీరి ప్రయాణాన్ని ఒకే గమ్యం వైపు నడిపిస్తోంది.
 ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఈ స్నేహితులు
 ఎందరికో జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

 
చెన్నై నగరంలో నుంగంబాక్కంలోని నాగేశ్వర రోడ్డులో ఉంది కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్. నరాల బలహీనత, బుద్ధిమాంద్యం, జన్యులోపాలతో పుట్టిన పిల్లలకు అక్కడ వైద్యం జరుగుతోంది. డాక్టరు నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు గణేశ్. అతడి కళ్లలో దైన్యం... ప్రపంచంలోని నైరాశ్యమంతా గూడుకట్టుకుని ఉన్నట్లుంది ముఖం. అతడి చేతుల్లో ఉన్న ఎనిమిదిరోజుల పాపాయి శ్వేతకు ఇవేవీ తెలియదు. తనను బతికించుకోవడానికి తండ్రి జీవితాన్ని ధారపోస్తాడని ఆ బిడ్డకే కాదు ఆ క్షణంలో గణేశ్‌కి కూడా తెలియదు.

ఏ క్షణాన ఫిట్స్ వస్తుందో బిడ్డ మెలికలు తిరిగిపోతూ కళ్లు తేలేస్తుందోనని ఒకటే ఆందోళన. కళ్లు మూసుకుని కళ్ల ముందు మెదిలిన దేవుళ్లందరికీ మొక్కుతున్నాడు. ఇది జరిగి పద్ధెనిమిదేళ్లవుతోంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘‘భగవంతుడా! నా బిడ్డను  ఆరోగ్యవంతురాలిని చేయి. నేను నా జీవితమంతా ఇలాంటి బిడ్డలకు సేవ చేసి నీ రుణం తీర్చుకుంటాను - అని మొక్కాను. ఏ దేవుడు కరుణించాడో తెలియదు. కానీ నా బిడ్డ కోలుకుంది. తర్వాత నేను పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో ‘హృదయాలయ’ అనే హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు దానిని నిడదవోలుకు మార్చాం.

మా హోమ్‌లో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లలను సంరక్షిస్తున్నాం. తప్పిపోయిన పిల్లలకు ఆశ్రయమిస్తున్నాం. జెమిని టీవీ కార్యక్రమంలో మా హోమ్‌లో ఉన్న పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు గణేశ్.
 
దేవుడికిచ్చిన మాట కోసం...
 
భగవంతుడిని నమ్మే వారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో దేవుడిని వరమడిగే ఉంటారు. వారిలో చాలామంది కోరిక నెరవేరిన తర్వాత చాలా సౌకర్యంగా మొక్కు సంగతి మర్చిపోతారు. అలా మర్చిపోకపోవడం గణేశ్‌లో నిజాయితీ. కుమార్తె వైద్యం కోసం అతడు సికింద్రాబాద్‌లోని స్వీకార్ ఉప్‌కార్ రీహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో గడిపాడు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పడంలో శిక్షణ పొందుతున్న విశాలాక్షి పరిచయమయ్యారు. మాటల్లో మాటగా దేవుడికిచ్చిన మాటను ఆమెతో పంచుకున్నారు గణేశ్. వారిద్దరిలో ప్రత్యేకమైన పిల్లల కోసం ఏదైనా చేయాలనే తపన ఉంది. గణేశ్ ప్రయత్నానికి భార్య విజయలక్ష్మి సహకరించారు. ‘‘హృదయాలయ ఆవిర్భావానికి ఆ తపనే కారణం’’ అంటారాయన.
 
నిర్వహణ కష్టమే అయినా...

హోమ్ నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఒడుదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయాలను పక్కన పెట్టి తమకు సహాయం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు గణేశ్. ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి గారి కోడలు రాధమ్మ బియ్యం, పప్పు దినుసులు పంపిస్తున్నారు. గణేశ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో సంపాదించిన డబ్బులో ఎక్కువ ఈ హోమ్‌కే ఖర్చు చేశారు. ఉన్న రెండెకరాలూ అమ్మేశారు. అతడి స్నేహితులు మంచి స్థితిలో ఉన్న వాళ్లు అప్పుడప్పుడూ సహాయం చేస్తున్నారు. నా బంగారం, గణేశ్ గారి భార్య బంగారమూ తాకట్టుకెళ్లింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లలను ఏ రోజూ పస్తు పెట్టలేదు’’ అన్నారు విశాలాక్షి.
 
చిత్తశుద్ధితో చేస్తే...

గణేశ్ నమ్మే దేవుడు ఇతడికి స్పందించే మనసిచ్చాడు. అలాగే గంపెడంత కష్టాన్నీ ఇచ్చాడు. పాపాయిని ఏ క్షణాన ఫిట్స్ భూతం మింగేస్తుందోనని కంటి మీద రెప్పవేయకుండా గడిపారు గణేశ్. ఇప్పుడు అలాంటి ఎందరో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పిల్లల్లో దేవుడుంటాడని నమ్మడంలో ఒక సంతోషం ఉంటుంది. ప్రత్యేకమైన పిల్లలు ఎప్పటికీ పిల్లలే. కాబట్టి దేవుడు వీరిలో ఎప్పటికీ ఉంటాడు- అంటారు గణేశ్. నిజమే... వారికి ఆ పిల్లలే దేవుళ్లు.
 
- సాక్షి ఫ్యామిలీ
 ఫొటోలు : రాజేశ్, శేఖర్, న్యూస్‌లైన్ నిడదవోలు
 
ప్రతిరోజూ ... నేర్పించాల్సిందే!

మాది పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి. గణేశ్‌గారు స్పెషల్ చిల్డ్రన్ కోసం హోమ్ పెట్టాలని చెప్పినప్పుడు మా ఊరే సరైన ప్రదేశం అని సూచించాను. ఈ పిల్లలకు పళ్లు తోముకోవడం నుంచి ప్రతిదీ ప్రతిరోజూ నేర్పించాల్సిందే.  తమ పేరు, స్కూల్ పేరు, ఊరి పేరు రోజూ డ్రిల్ చేయిస్తాం. ఫోన్ నంబరు పలికిస్తున్నాం. పిల్లల్లో ఏకాగ్రత, మైండ్ - హ్యాండ్ కో ఆర్డినేషన్ అలవడడానికి పేపర్ కవర్ల తయారీ నేర్పించాను. వాళ్ల మూడ్‌ని బట్టి వారంలో రెండు లేదా మూడు రోజులు కూర్చోబెడతాను. పిల్లలు నాతో ఎంతగా అల్లుకుపోయారంటే ఒక్కరోజు నేను కనిపించకపోతే బెంగపెట్టుకుంటారు.
 - విశాలాక్షి, స్పెషల్ టీచర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement