విద్యా రంగంలో సరికొత్త ఒరవడి | Latest trend in the field of education | Sakshi
Sakshi News home page

విద్యా రంగంలో సరికొత్త ఒరవడి

Published Thu, Jul 24 2014 11:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

విద్యా రంగంలో సరికొత్త ఒరవడి - Sakshi

విద్యా రంగంలో సరికొత్త ఒరవడి

 సాక్షి, చెన్నై:విద్యాపరంగా పరిశోధనలు, విద్యావ్యాప్తి, అభ్యున్నతిలో తమ దేశంతో పాటుగా భారత్  సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజా వ్యవహారాలు, సాంస్కృతిక వ్యవహారాల అధికారి షానా డైట్జ్ సురేంద్ర పేర్కొన్నారు. విద్యా పరంగా భారత్‌తో సత్సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నేతృత్వంలో గురువారం కాటాన్ కొళత్తూరు టీపీ గణేషన్ ఆడిటోరియంలో ‘సెమిస్టర్ అబ్రాడ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్సిటీ నేతృత్వంలో యూఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా దేశాల్లోని వర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించిన ఇక్కడి విద్యార్థులు, తమ అనుభవాలు ఈ కార్యక్రమంలో పంచుకున్నారు.
 
 గత విద్యా సంత్సరం సెమిస్టర్ అబ్రాడ్ కార్యక్రమం ద్వారా విదేశాలకు వెళ్లి దిగ్విజయంగా తమ కోర్సులను ముగించుకుని అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను అవగాహన చేసుకుని అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. సర్టిఫికెట్లను, అవార్డులను ప్రదానం చేశారు. మరికొందరు విద్యార్థులు మెరిట్ సాధించడంతో వారికి ఎంఐటీ స్కాలర్‌షిప్‌లు ఒక్కొక్కరికి రూ.7లక్షలు చొప్పున అందజేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించిన ఆ వర్సిటీ వీసీ(ఇన్‌చార్జ్) టీసీ గణేషన్ మాట్లాడుతూ, తమ వర్సిటీ విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా ముందుకెళుతోందని వివరించారు. 2008లో సెమిస్టర్ అబ్రాడ్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని, ఇప్పటికి 500 మంది విద్యార్థులు తమ వర్సిటీ ద్వారా విదేశాల్లోని పలు వర్సిటీల్లో సెమిస్టర్లు పూర్తి చేసి ఉన్నారని గుర్తు చేశారు. మరో 50 మంది విద్యార్థులు పలు వర్సిటీల్లో కోర్సులు చేస్తున్నారని, 2014కు గాను ఆగస్టు - సెప్టెంబరు నెలల్లో వంద మంది విద్యార్థులు విదేశాల్లోని పలు వర్సిటీలను సందర్శించి, అక్కడి విద్యా విధానాన్ని, అంతర్జాతీయ విద్యా పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోనున్నట్లు చెప్పారు.
 
 సత్సంబంధాల మెరుగు
 అమెరికా కాన్సులేట్ ప్రజా, సాంస్కృతిక వ్యవహారాల అధికారి షానా డైట్జ్ సురేంద్ర మాట్లాడుతూ, సర్టిఫికెట్లు పొందిన, స్కాలర్ షిప్‌లు దక్కించుకున్న విద్యార్థులను ప్రశంసలతో ముంచెత్తారు. యూఎస్, భారత్ సమష్టిగా విద్యా పరంగా చరిత్ర సృష్టించబోతున్నాయన్నారు. రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలు మరింత మెరుగు పడ్డాయన్నారు. తమ దేశం ఉన్నత విద్యకు పేరొందిందని, అంతర్జాతీయ విద్యా బోధనలు, నైపుణ్యత, విద్యానాణ్యత పాటించడంలో తమ దేశంలోని వర్సిటీలు కీలక భూమి పోషిస్తున్నాయని వివరించారు. విదేశీ విద్యార్థులను ఉన్నత చదువుల నిమిత్తం తమ దేశంలోని వర్సిటీలు ఆహ్వానిస్తున్నాయని పేర్కొన్నారు.
 
 ఇతర దేశాల్లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందించడంతోపాటుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, వారికి అన్ని రకాలుగా సహకారాన్ని వర్సిటీలు అందిస్తున్నాయని వివరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక దేశానికి చెందిన విద్యార్థులు ఇతర దేశాల్లో పర్యటించడంతో అంతర్జాతీయ విద్యా విధానాలు తెలుసుకోవడమే కాకుండా, ఆ దేశంలోని పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఎంతో వీలుంటుందన్నారు. భారత్, అమెరికాల్లోని అనేక వర్సిటీల భాగస్వామ్యంతో విద్యా సంబంధిత కార్యక్రమాలను వేగవంతం చేసి ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను యూఎస్-ఇండియూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వెబ్‌సైట్లో పొందుపరచి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ వర్సిటీ రీసెర్చ్ డెరైక్టర్ నారాయణ రావు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం డెరైక్టర్ ముత్తమిళ్ సెల్వన్, ఆ వర్సిటీ విదేశీ సంబంధాల విభాగం డెరైక్టర్ కతార్ సింగ్, డీన్ టీ వీ గోపాల్, విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement