విద్యార్థి గర్జన
Published Sun, Dec 22 2013 2:06 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : అమెరికాలో భార త రాయబారి దేవయానిపై ఆ దేశపు అధికారుల దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ చెన్నైలోని విద్యార్థి సంఘాలు శనివారం ఆందోళన నిర్వహించాయి. అమెరికా దాష్టీకాన్ని ఎండగడుతూ గర్జించాయి. మౌంట్‌రోడ్డులోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టి ఆదేశపు పతాకాన్ని దగ్ధం చేశాయి.డీవైఎఫ్‌ఐ సహా పలు విద్యార్థి సంఘాలు అమెరికన్ ఎంబసీ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తారనే సమాచారంతో ఉదయం 6 గంటలకే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. అమెరికా ఎంబసీ కార్యాలయం ప్రహరీగోడ చుట్టూ సాయుధ పోలీసులు బారులు తీరారు. సమీపంలోని అన్నా ఫ్లైవోవర్ పై కూడా భారీ సంఖ్యలో పోలీసులు నిలిచారు. ఉదయం 10 గంటలకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ఊరేగింపుగా అమెరికన్ ఎంబసీ కార్యాలయానికి చేరుకున్నారు.
భారత జాతీయ పతాకంతోపాటూ విద్యార్థి సంఘాల చిహ్నాలతో కూడిన పతాకాలతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. తనిఖీల పేరుతో దేవయాని పట్ల అసభ్యరీతిలో అమెరికా అధికారులు ప్రవర్తించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అబ్దుల్‌కలాం, కమల్‌హాసన్, దేవయాని ఇలా భారతీయ ప్రముఖులను అవమానించడం ఆమెరికాకు ఎంతమాత్రం తగదని, ఇది క్షమించరాని నేరమని వారు పేర్కొన్నారు. వందలాది మంది విద్యార్థులు అమెరికన్ ఎంబసీ కార్యాలయం పరిసరాలను చుట్టుముట్టడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. యూఎస్ అధికారుల దౌర్జ్యన్యం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ అమెరికా పతాకాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. దీంతో విద్యార్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. డీవైఎఫ్‌ఐ ఆందోళన ముగిసిపోయిన అనంతరం ముస్లిం, మైనార్టీ విద్యార్థి సంఘాలు మధ్యాహ్నం అక్కడికి చేరుకుని ఆందోళన చేశాయి.
Advertisement
Advertisement