
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.
అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.
10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.
చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్
అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్‌షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment