ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం | Cremations In School Areas | Sakshi
Sakshi News home page

చచ్చినా.. చావే..!

Published Wed, Mar 28 2018 11:45 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

Cremations In School Areas - Sakshi

17మృతదేహాలను నిక్షిప్తం చేసుకున్న సమాధి

యర్రగొండపాలెం:జిల్లాలో 1028 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. వీటిలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టారు. అందుకుగాను రూ. 67.84 కోట్లు కేటాయి ంచారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ. 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ నిధులు ముఖద్వారం, స్నానా లగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం నిర్మాణాలకే సరిపోతుండటంతో వాటిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాతలు (ఎన్‌ఆర్‌ఐలు) ముందుకొచ్చి రూ. 3 లక్షల విరాళం ఇచ్చినట్లయితే కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపడతారు. కారణాలు ఏమైనా శ్మశానాల అభివృద్ధి పనులు మండలానికి ఒకటి రెండు మాత్రమే పూర్తి చేయగలిగారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో శ్మశానాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. కబ్జాదారులు శ్మశానాలను సైతం వదలడం లేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

పాఠశాల ఆవరణలో దహన సంస్కారాలు:పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మశానం లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి ఒక పక్కన ఉన్న పాఠశాలకు కాంపౌండ్‌వాల్‌ లేదు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరాగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడంలాంటివి చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే పిల్లలు ఆ రోజు పాఠశాలకు వెళ్లరు. దహన కార్యక్రమాలు జరిగేవి చూసి అనేకమంది పిల్లలు భయపడిన సంఘటనలు ఉన్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు.

ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం:2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటు లోడు లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంతో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టారు. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకుండా ఉంచడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయి. సమస్య పరిష్కారం అయిన తరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటిక లేకుండా పోయింది. ఈ కారణంగా ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఆ గుంతలో ఖననం చేశారు. వెంటనే శ్మశాన వాటిక కోసం ఎకర స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయినా ఆ స్థలానికి రక్షణ లేకుండా పోయింది.

అధికారపార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే పనులు..
అధికార పార్టీకి చెందిన నాయకులు శ్మశానాలు సైతం వదలడం లేదు. వారు సిఫార్సు చేస్తేనే శ్మశాన వాటికల అభివృద్ధి పనులు అప్పచెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఈ పనులను అప్పచెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు సిఫార్సు చేయాల్సి ఉంది. జన్మభూమి కమిటీలు ఈ శ్మశాన రాజకీయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది.

పలు గ్రామాల్లో నేటికీ కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యుల చావుకొస్తుంది. ఆ మృతదేహాన్ని ఎక్కడ ఖననం లేక దహనం చేయాలన్నదే పెద్ద సమస్య. అప్పటికప్పుడు శ్మశాన వాటికలను వెతుక్కోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పట్టణాల్లో అరకొరగా శ్మశాన వాటికలు ఉన్నాయి. అధిక భాగం గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక మృతదేహాలను రోడ్లపక్కన, పాఠశాల స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దుస్థితి నేడు ఉంది. శ్మశానాల కోసం నిధులు మంజూరైనా రాజకీయ జోక్యంతో పలు చోట్లు అభివృద్ధి కుంటుపడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement