Cemetry
-
ఒకరిది మానవత్వం... మరొకరిది ‘పైసా’చికత్వం
కోదాడ: కరోనాతో మృతి చెందాడని బంధువులు ముఖం చాటేశారు.. తమకు ఎక్కడ అంటుకుంటుందేమోనని అయినవారు ఆమడదూరం పారిపోయారు. కానీ... మనిషిలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని దానికి కుల మతాలు ఉండవని కొందరు ముస్లిం యువకులు నిరూపించగా.. ఎలా పోతే మాకేంటి పైసలే మాకు పరమావధి అన్నట్లు మరికొందరు ప్రవర్తించి దహనసంస్కారాలు చేయడానికి వచ్చిన వారి నుంచి మృతదేహాన్ని కాల్చినందుకు రూ.32 వేలను శ్మశానం సాక్షిగా వసూలు చేసి తమలోని ‘పైసా’చికత్వాన్ని చాటుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మహంకాళి గోపాలకృష్ణమూర్తి (70) కరోనాతో మృతి చెందాడు. ఇతడు దివ్యాంగుడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు బిడ్డలు, ఆయన సోదరుడు హుస్సేన్‌రావు మాత్రమే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆరుగురు ముస్లిం యువకులు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని ఇంటినుంచి బయటికి తీసుకురావడంతో పాటు హిందూ శ్మశానవాటిక వద్దకు చేర్చారు. అక్కడ కూడా మృత దేహాన్ని వారే చితి మీదకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదంతా వారు ఉచితంగా సేవాదృక్పథంతో చేయడం గమనించదగ్గ విషయం.. రూ. 32 వేలు.. నిలబెట్టి వసూలు చేశారు.. కరోనాతో మృతి చెందిన గోపాలకృష్ణమూర్తి అంత్యక్రియలకు కోదాడ హిందూ శ్మశానవాటికలో రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని అక్కడ ఉన్నవారు డి మాండ్ చేసి మరీ వసూలు చేసినట్లు మృతుడి సోదరుడు హుస్సేన్‌రావు తెలిపాడు. చితి కోసం కేవలం ఆరుక్వింటాళ్ల కట్టెలు పెట్టి రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఇచ్చిన తర్వాతే మృతదేహాన్ని కాల్చారని వాపోయాడు. ఈ విషయాన్ని ఆయన రికార్డు చేసి సామాజికమాధ్యమంలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. కరోనా మృతదేహాల దహనం కోసం సిబ్బందిని పెట్టామని పురపాలకసంఘం అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అక్కడ ఎవరూ లేరని ఈ దోపిడీపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు -
శ్మ'శాన' పనుంది!
సాక్షి, అందోల్: జనన మరణాలు రెండే మానవ జన్మలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న కార్యాలు. జననం ప్రతీ ఒక్కరిలో ఆనందాన్ని కలిగించి.. మరణం మాత్రం కుటుంబాల్లో ఆత్మీయుల్లో విషాదాన్ని నింపుతుంది. జన్మనెత్తిన ప్రతీ వారు జీవిత పయనంలో ఒకనాడు కాలం చేయక తప్పదు. చివరి పయనంలో జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చే స్థలమే శ్మశానం. అంత్యక్రియలు నిర్వహించే స్థలం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోతే ఎంతో బాధని కలిగిస్తుంది. స్వాతంత్య్ర సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా కనీసం శ్మశానవాటికలకు స్థలం కోసం ఇంకా పాలకులకు ప్రాధేయపడాల్సి రావడం విచారకరం. ప్రజల అవస్థలు.. అందోలు మండలంలోని అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు వాటిల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు గ్రామాలలోకి వచ్చిన సమయంలో శ్మశానవాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని మొరపెట్టుకున్నా అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాలలో స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్థలాలు ఉంటే వాటి సమీపంలో ఉన్న రైతులు ఆక్రమించుకోవడం లేదా కంప చెట్లతో కనీస సౌకర్యాలు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చేసేదిలేక చెరువుల్లో ఖననం చేయాల్సిన దుస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందోలు మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో డాకూరు గ్రామంలోనే శ్మశాన వాటిక పనులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. శ్మశాన వాటికలనూ వదలడం లేదు.. గ్రామాలల్లో శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి పక్కనే స్థలం ఉన్న వ్యక్తులు వాటిని ఆక్రమించుకుంటున్నారు. పలుసార్లు గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చేయకపోవడంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్థలాలు లేక రోడ్ల పక్కనే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మండలంలో 14 శ్మశానవాటికలకు నిధులు మండలం పరిధిలోని 14 గ్రామాలల్లో శ్మశానవాటికలు నిర్మించేందుకు గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కొక్కదానికిగాను రూ.10 లక్షలు మంజూరు చేశారు. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా స్థలాలు అనుకూలంగా ఉన్నందుకుగాను 14 గ్రామాలకే నిధులు మంజూరు అయ్యాయి. మిగతా పది గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. మండలంలో డాకూరు, నాదులాపూర్ గ్రామాలలో మాత్రమే పనులు ప్రారంభించగా అవి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొత్త సర్పంచ్‌లు అనుకూలంగా ఉన్నారు శ్మశాన నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లు నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నారు. ఒక్కొక్క శ్మశానవాటికకు రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. అసంపూర్తిగా ఉన్న డాకూరు, నాదులాపూర్ గ్రామాల్లో కూడా తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి. – సత్యనారాయణ, ఎంపీడీఓ, అందోలు -
అనుమానాస్పదం
పుకార్లతో ఊరు అట్టుడుకుంతోంది. పోంచెర్ల టౌన్‌కి నాలుగు కోసుల దూరంలో ఉన్న పల్లెటూరు అది. పేరు చోరదిబ్బ. ఆ పేరు ఎందుకు వచ్చిందోగాని, ఊరికి మూడు వైపులా కుచ్చులబోడు, పలుకుబోడు, కొండలమ్మ చట్టు పేర్లతో ఉన్న గుట్టలు, మరొక వైపు చెరువు, చెరువుకు దగ్గర్లోనే శ్మశానం.పన్నెండువందలకు పైగా గడప. దాదాపు నాలుగు వేల ఓటర్లు ఉన్నా, ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతారు నాయకులు. అన్ని ఊర్ల మాదిరిగానే ముసలీ ముతకా, చదువు సరిగా ఒంటబట్టని వారు తప్ప ఇతరులంతా బతుకుతెరువు కోసం దూరాలకు పోతే మిగిలిన వారు మాత్రమే ఉంటున్న ఊరు.ఈ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఊరి జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి అయితే చాలు– శ్మశానంలో తెల్లని ఆకారాల సంచారం, మేకలు, కోళ్లు పదుల కొద్దీ మాయం కావడం, వాటి నెత్తురు శ్మశానంలో ఉండటం, ఒక రాత్రివేళ బహిర్భూమికి వెళ్లిన నర్సప్పని ఆ తెల్లని ఆకారాలే తినడానికి ప్రయత్నించడం, చివరికి చెయ్యి విరిగి బతుకు జీవుడా అని బయటపడటం, పూడ్చిన శవం తెల్లారే సరికి బయట పడి ఉండటం. దాదాపు ప్రతిరోజూ శ్మశానంలో పెద్దగా మంటలతో నెగళ్లు..వరుస సంఘటనలు జరుగుతున్నా, వాటి గురించి మాట్లాడుకోవడానికి ఊర్లో ఎవరికీ ధైర్యం చాలడం లేదు. కాలేజీలో చదువుతున్న శౌమిక్, మొహం మాడ్చుకుని ఉన్నాడు. ఎప్పుడూ వదలకుండా చూసే టీవీ నచ్చడం లేదు. పుస్తకాల వైపు చూడబుద్ధి కావడంలేదు. నిజం చెప్పాలంటే ఈ సెలవుల కోసం అతడు ఏడాదంతా ఎదురు చూస్తుంటాడు. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండలూ గుట్టలూ చెరువూ అంటే శౌమిక్‌కి భలే సరదా.కాని ఈసారి ఆ ఊరు రావద్దని, పరిస్థితులు బాగాలేవని ఆ ఊరి నుంచి కబురు. తల్లిదండ్రులు అనుమతి లేకుండా వెళ్లడానికి ఇష్టపడడు. ఊరికి వెళ్లడానికి శౌమిక్ మంకు రెండోరోజు కూడా సాగింది. మొత్తానికి వాళ్ల అమ్మ చెప్పిన వెయ్యి జాగ్రత్తలకు తల ఊపి, ఎట్టకేలకు ఊరికొచ్చాడు.రాత్రి అయింది. ఊరు చడీ చప్పుడూ లేకుండా ఊపిరి బిగపట్టుకుని నిద్రపోతోంది. శ్మశానానికి దగ్గరగా ఉండే వీధుల్లో అయితే ఉత్తరం దిక్కులో ఉండే కిటికీలు ఎప్పుడో భయంతో బిగుసుకుపోయాయి.ఈ పరిస్థితి శౌమిక్‌కు నచ్చడం లేదు. సెలవులు సరదాగా గడుపుదామని వస్తే, ఇక్కడ వింత వింత విషయాలు తెలుస్తున్నాయి. దీని వెనుక ఏదో ఉంది. దాని సంగతి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.చిన్నగా వాళ్ల తాతయ్య దగ్గర చేరి, ‘ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు.వంటగదిలోకి వాళ్ల అమ్మమ్మ ‘ఆ పనీ అయ్యింది. అవతలి బజారులో ఉన్న వెంకటి మామ స్టేషన్‌కి కూడా వెళ్లాడు. కాని ఏమైందో ఏమో, ఆ తర్వాతి రోజే వాళ్లింటి పక్కనే ఉన్న గడ్డివాము తగలబడిపోయింది. ఆ మర్నాడు, ఇంట్లో ఉన్న మేకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకో ఇద్దరు ముగ్గురికీ అలాగే జరిగింది. అది మొదలు మళ్లీ ఎవరూ అలాంటి ఆలోచన కూడా చేయలేకపోయారు.’‘నువ్వు మాత్రం చీకటిపడితే బయటకు వెళ్లొద్దు’ తాతయ్య దాదాపు వార్నింగ్ ఇచ్చాడు.శౌమిక్ అయోమయంగా చూస్తుండిపోయాడు. కాని అతనికి ఒక నమ్మకం. కారణం లేకుండా ఏ పనీ జరగదు. ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.రోజంతా అందరి ఇళ్లకూ వెళ్లడం, కబుర్లాడుతూ సమాచారం సేకరించడం చేయసాగాడు శౌమిక్. సేకరించిన వివరాలన్నీ క్రమ పద్ధతిలో కాగితం మీద రాసుకున్నాడు.ఊరికి ఈ ఆరు నెలల్లో కొత్తగా వచ్చిన వాళ్లు, ఇప్పటి వరకు వేరే చోట ఉండి ఊరికి వచ్చిన వాళ్ల వివరాలు... ఈ సంఘటనలు ఫలానా రోజు నుంచి జరుగుతున్నాయని చెప్పలేం గాని, ఆరు నెలల లోపే.. నర్సప్పను మినహా మరెవరినీ గాయపరచిన దాఖలాల్లేవు. శ్మశానంలో రెండు తెల్లని ఆకారాలు మాత్రం చాలామందికి కనిపించాయి. శ్మశానంలో మంటలు మాత్రం దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఇంత జరుగుతున్నా ఎవరూ పోలీసులకు గాని, మీడియాకు గాని ఉప్పందించలేదు. అలా చేద్దామని చూసిన ఇద్దరి ముగ్గురి కళ్లాల్లో అగ్నిప్రమాదాలు, ఇళ్లలోని పశువుల మరణంలాంటివి జరిగి ఆర్థికంగా నష్టపోయారు. ఊళ్లో కొంత మంది ఈ మధ్య కాలంలోనే కాస్త స్థితిపరులుగా మారినట్లు కనిపిస్తోంది. వాళ్ల ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులు కనిపిస్తున్నాయి.ఇంకా ఎక్కడో లింక్ మిస్సయినట్లే అనిపిస్తోంది శౌమిక్‌కి. తన వయసు వారిని కూడగట్టుకుని గుట్టల వైపు, చెలక పొలాల వైపు ఇదివరకటి మాదిరిగానే పగలల్లా తిరగసాగాడు. అప్పుడు వచ్చింది అనుమానం.ఒకరోజు ఇంటికి రాగానే చేతిలో ఉన్నవి చూపించి– వాళ్ల తాతతో మాట్లాడాడు. తర్వాత బోటనీ లెక్చరర్‌కు ఫోన్ చేసి, చాలాసేపు మాట్లాడాడు.మరుసటి రోజే శౌమిక్, మరికొంతమంది క్రికెట్ బ్యాటు, బంతి తీసుకుని శ్మశానం వైపు వెళ్లారు. చెరువుకు దగ్గర్లో ఉన్న మైదానంలో ఆడుకున్నారు. చెరువుకు కొద్ది దూరంలో చిన్నపాటి డ్రమ్ములు కనిపించాయి శౌమిక్‌కు. తనతో ఉన్నవారిని అవేమిటని అడిగితే, ‘ఏమో, చేప పిల్లలను తెచ్చి చెరువులో పోసినప్పటివి అయి ఉంటాయి’ అని అన్నారు.అతనికి అనుమానం బలపడింది. పరిసరాలన్నీ నెమ్మదిగా పరిశీలిస్తూ శ్మశానంలోకి నడిచాడు.ఇంతలో అటుగా వస్తున్న ఒకతను ‘ఎవర్రా! ఏం కావాలి?’ కరకుగా అడిగాడు.‘రమణన్నా! మా దోస్తేలే’ అంటూ ఆడుతున్న పిల్లల్లో నుంచి అరిచారెవరో.‘అవునా! ఏంపేరు? ఎవరింటికి వచ్చావు?’ అడిగాడు.సమాధానం చెబుతూ, అతని వాలకం గమనిస్తూ వెనుదిరిగాడు.ఇంటికి వస్తూనే అమ్మమ్మను రమణ గురించి అడిగాడు.బొంబాయిలో ఉంటున్న రమణ ఏడాది కిందటే ఊరికి తిరిగొచ్చాడు. ఒక్కడే ఉంటాడు. కొన్నేళ్ల కిందట దొంగతనం చేసినందుకు రమణ కులం వాళ్లను ఊరి వాళ్లు వెలివేశారు. అప్పడు వెళ్లిపోయిన తర్వాత రమణ ఒక్కడే ఊరికి వచ్చాడు. తల్లీదండ్రీ చనిపోయారని, తన కులంలో మిగిలిన వాళ్ల సంగతి తెలియదని చెప్పాడు. వచ్చినప్పటి నుంచి ఊర్లో అందరితో మంచిగా ఉంటూ గ్రామస్తులతో కలిసిపోయాడు. శ్మశానం వైపు వచ్చే వాళ్లకు అక్కడ జరిగే సంగతులు చెప్పి, జాగ్రత్తలు చెబుతూ ఉంటాడని చెప్పింది అమ్మమ్మ. ఆ రోజు కూడా శౌమిక్ లెక్చరర్తోను, మరెవరితోనో చాలాసేపు మాట్లాడాడు.శౌమిక్ వచ్చి చాలా రోజులైంది. మరో నాలుగు రోజుల్లో సెలవులైపోతాయి. ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. పక్కింటి నుంచి అమ్మమ్మ ఇంట్లోకి వస్తూనే ‘ఏమయ్యోవ్! పోలీసులు వచ్చి వెంకటిని ఇంకొంతమందిని పట్టుకుపోయారటగా’ అంది.‘అవునా! ఎవరెవరిని పట్టుకున్నారు?’శౌమిక్ ఊపిరి బిగపట్టి వింటున్నాడు.‘వెంకటి, బొంబాయి రమణ, నర్సింహ..’ అంటూ లిస్టు చెప్పింది.రెండో రోజు ఉదయం పది గంటలవుతోంది. బయటి నుంచి కేకలు వినపడ్డాయి. ‘వీరాస్వామిగారూ! మిమ్మల్ని పోలీసులు రమ్మంటున్నారు. పంచాయతీ ఆఫీసు దగ్గరకు త్వరగా రండి. ఇంకా కొంతమందిని పిల్చుకు రావాలి’ గ్రామ పంచాయతీ బంట్రోతు కేకేశాడు.‘పోలీసులా? వాళ్లకు నాతో ఏం పని?’ కంగారు గొంతుతో అంటూ చెప్పులేసుకుని బయల్దేరాడు. తాతయ్యతో కలసి శౌమిక్ కూడా బయల్దేరాడు.దాదాపు ఊరు ఊరంతా పంచాయతీ ఆఫీసు దగ్గర చేరింది. సర్పంచితో పాటు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. శౌమిక్ను చూస్తూనే ఎస్సై పిలుస్తూ, ‘మీరే కదా శౌమిక్’ అనగానే తలూపాడు. పిలిచి పక్కన కూర్చోమని సైగ చేశాడు.ఎస్సై లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు. అంతా నిశ్శబ్దం అయింది.‘గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. ప్రతిచోటా, ప్రతిక్షణం పోలీసులు ఉండలేరు. ప్రతి పౌరుడూ పోలీసులాంటి వాడే. ఊరికి కొత్తగా, అనుమానాస్పదంగా ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. మా డిపార్ట్మెంట్లోనూ మీ గ్రామ పోలీసులాంటి అవినీతిపరులు ఉండే అవకాశం ఉంది. వారి స్పందన సరిగా లేనప్పుడు పై అధికారులకు ఆ విషయం తెలియజేయాలి. అలాగే, ఇంకొకరు ఫిర్యాదు చేయకుండా చేసేందుకు అతి తెలివి ప్రదర్శించి, వారి గడ్డివాములను వారే తగలబెట్టుకుని, వారి పశువులను వారే చంపుకొని నేరస్తులకు సాయపడ్డ వెంకటిలాంటి వాళ్లూ మీ మధ్యలోనే ఉంటారు’ ఎస్సై రుమాలుతో ముఖం తుడుచుకుంటూ కొనసాగించాడు.‘శౌమిక్ చూపిన చొరవ వల్ల ఒక నేర వ్యవస్థ పట్టుబడింది. ఈ విషయాలు శౌమిక్ చెబితేనే బాగుంటుంది’ అంటూ శౌమిక్ వైపు చూశాడు ఎస్సై.శౌమిక్ లేచాడు. ‘నేను ఇక్కడికి వచ్చే ముందే అమ్మమ్మ తాతయ్య వాళ్ల నుంచి కొంత సమాచారం తెలిసింది. అందుకే నేను ఇక్కడికి రావడానికి మా అమ్మవాళ్లు ముందు ఒప్పుకోలేదు. అయినా పట్టుపట్టి ఇక్కడకు వచ్చాక జరుగుతున్న, జరిగిన సంఘటనలు తెలుసుకున్నాక, వీటి వెనుక ఏదో అనుమానాస్పద నేపథ్యం ఉందనిపించింది. సమాచారం సేకరించడం మొదలుపెట్టా. ఈ ఆరు నెలల్లో ఊరికి కొత్తగా వచ్చిన వారెవరని ఆరా తీస్తే, సస్పెక్ట్ రమణ అనిపించింది. ఏడాది కిందట ఒకటి రెండు సార్లు ఊరికి వచ్చి వెళ్లాడు. ఆ రమణకు, పుల్లయ్య కూతురు మంగతో సావాసం కలిసింది. రోజూ రాత్రి శ్మశానం కనబడే తెల్లని ఆకారాలు వాళ్లే’‘మంగా’ అంతా ఉలిక్కిపడ్డారు.‘శ్మశానానికి దగ్గర్లోనే ఉన్న పుల్లయ్య కూతురు మంగ, పెళ్లయిన కొద్దికాలానికే భర్తను కోల్పోయి ఇంటికి చేరింది. నెలకోసారైనా హిస్టీరియాతో బాధపడే మంగకు ఈ మధ్య కాలంలో హిస్టీరియా రాలేదు’ అందరికీ మంగ విషయాలు గుర్తుకొచ్చాయి. జనం మధ్యలోనే ఉన్న పుల్లయ్య తెల్లమొహం వేసి నిలుచున్నాడు.ఎస్సై మధ్యలో అందుకుని, ‘నర్సప్పను చంపబోయిందీ, గాయపరచిందీ వీరే. ఎవరూ అటువైపు రాకుండా ఉండేందుకే అలా చేశారు. నర్సప్ప తప్పించుకున్నాడు గాని, లేకపోతే అతన్ని చంపేవాళ్లు. ఆ భయం కొనసాగించడానికి ఇళ్లల్లో కోళ్లు, మేకలు ఎత్తుకెళ్లి చంపి తినేవాళ్లు. రమణ మిత్రులు రోజూ రావడం, రాత్రిపూట వీలైనంత వరకు పని చేయడం, తెల్లారక ముందే వెళ్లిపోవడం చేసేవాళ్లు. వాళ్లని కూడా పట్టుకున్నాం’ ‘మరి శ్మశానంలో వాళ్లకేం పని?’ ఎవరో సందేహం వెలిబుచ్చారు.‘గంజాయి నుంచి మార్ఫిన్ వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు. గంజాయిని వేడి నీటిలో ఉడికిస్తారు. అదే మీరు శ్మశానంలో చూసిన మంటలు. వేడి నీటికి సున్నపు పొడి కలిపితే మార్ఫిన్ తప్ప మిగిలిన పదార్థం గట్టి పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ద్రావణానికి అమోనియం క్లోరైడ్ కలిపితే మార్ఫిన్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు పెద్ద డ్రమ్ముల్లాంటివి కావాలి. అవే మీరు చెరువు దగ్గర చూసిన డ్రమ్ములు. నీరు అధికంగా కావాలి కాబట్టి చెరువుకు దగ్గర్లోని శ్మశానాన్ని ఎంచుకున్నారు. వంద కిలోల గంజాయి నుంచి పది కిలోల మార్ఫిన్ దొరుకుతుంది’ వివరించాడు శౌమిక్.‘మరి శవం సంగతో?’ మరొకరు అన్నారు.‘మీరు చీకటి పడుతుందన్న భయంతో సరిగా పూడ్చకపోవడం వల్ల బహుశ నక్కలు మట్టిని తోడి శవాన్ని బయటకు ఈడ్చుకొచ్చి ఉంటాయి. కాకపోతే అది నేరస్తులకు అడ్వాంటేజీ అయ్యింది.’ అన్నాడు ఎస్సై.ఎప్పటికప్పుడు తనకు సూచనలు ఇస్తూ సహకరించిన తన లెక్చరర్‌కు, పోలీసు వారికి శౌమిక్ కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీలాంటి బాధ్యతగా ఉండే యువకులుంటే మాకు పెద్దగా పనేమీ ఉండదు’ అంటూ అతడి భుజం తట్టాడు ఎస్సై. -
ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం
యర్రగొండపాలెం:జిల్లాలో 1028 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. వీటిలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టారు. అందుకుగాను రూ. 67.84 కోట్లు కేటాయి ంచారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ. 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ నిధులు ముఖద్వారం, స్నానా లగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం నిర్మాణాలకే సరిపోతుండటంతో వాటిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాతలు (ఎన్ఆర్ఐలు) ముందుకొచ్చి రూ. 3 లక్షల విరాళం ఇచ్చినట్లయితే కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని చేపడతారు. కారణాలు ఏమైనా శ్మశానాల అభివృద్ధి పనులు మండలానికి ఒకటి రెండు మాత్రమే పూర్తి చేయగలిగారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో శ్మశానాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. కబ్జాదారులు శ్మశానాలను సైతం వదలడం లేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. పాఠశాల ఆవరణలో దహన సంస్కారాలు:పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మశానం లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి ఒక పక్కన ఉన్న పాఠశాలకు కాంపౌండ్‌వాల్ లేదు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరాగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడంలాంటివి చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే పిల్లలు ఆ రోజు పాఠశాలకు వెళ్లరు. దహన కార్యక్రమాలు జరిగేవి చూసి అనేకమంది పిల్లలు భయపడిన సంఘటనలు ఉన్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం:2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటు లోడు లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంతో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టారు. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకుండా ఉంచడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయి. సమస్య పరిష్కారం అయిన తరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటిక లేకుండా పోయింది. ఈ కారణంగా ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఆ గుంతలో ఖననం చేశారు. వెంటనే శ్మశాన వాటిక కోసం ఎకర స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయినా ఆ స్థలానికి రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే పనులు.. అధికార పార్టీకి చెందిన నాయకులు శ్మశానాలు సైతం వదలడం లేదు. వారు సిఫార్సు చేస్తేనే శ్మశాన వాటికల అభివృద్ధి పనులు అప్పచెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఈ పనులను అప్పచెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు సిఫార్సు చేయాల్సి ఉంది. జన్మభూమి కమిటీలు ఈ శ్మశాన రాజకీయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది. పలు గ్రామాల్లో నేటికీ కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యుల చావుకొస్తుంది. ఆ మృతదేహాన్ని ఎక్కడ ఖననం లేక దహనం చేయాలన్నదే పెద్ద సమస్య. అప్పటికప్పుడు శ్మశాన వాటికలను వెతుక్కోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పట్టణాల్లో అరకొరగా శ్మశాన వాటికలు ఉన్నాయి. అధిక భాగం గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక మృతదేహాలను రోడ్లపక్కన, పాఠశాల స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దుస్థితి నేడు ఉంది. శ్మశానాల కోసం నిధులు మంజూరైనా రాజకీయ జోక్యంతో పలు చోట్లు అభివృద్ధి కుంటుపడుతోంది. -
ఉమ్మడి శ్మశానాలు కావాలి: సాక్షి మహరాజ్
మీరట్: ఖబరస్తాన్ తోపాటు శ్మశానం కూడా ఉండాలన్న మోదీ వ్యాఖ్యలపై గొడవ సద్దుమణగకముందే బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పాతిపెట్టే శ్మశానాలనే నిర్మించకూడదని, మృతులందర్నీ దహనం చేయాలన్నారు. ‘శ్మశానాలను నిర్మిస్తూపోతే దేశంలో వ్యవసాయానికి స్థలమే ఉండదు. ఇస్లాం దేశాల్లో శ్మశానాలను నిర్మించే సంప్రదాయం లేదు. అక్కడ భౌతికాయాలను దహనం చేస్తారు’ అని చెప్పారు. అన్ని మతాలవారికి ఉమ్మడి శవదహనశాలలు ఉండేలా చూడాలని మోదీని కోరుతున్నానన్నారు. ‘దేశ జనాభా పెరుగుతోంది. భూమికి కొరత ఉంది. ఉన్న భూమినంతా శ్మశానాల నిర్మాణానికి వాడితే ప్రజలు ఎక్కడ జీవించాలి?’ అని అన్నారు. తాను మోదీకి వ్యతిరేకం కాదని, స్థలం పేరు ఏదైనా, అది దహనం కోసం పనికొచ్చేలా ఉండాలన్నారు. -
రూ.20లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్ఖానగడ్డ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.20లక్షలు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. సోమవారం 4వ డివిజన్లోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులో రూ.2.5 లక్షలతో నిర్మించనున్న డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి శ్మశానవాటికలకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. డీపీఆర్ రూపొందిన తర్వాత స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో ప్రవేశిస్తామని, పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కార్పొరేటర్ ఎడ్ల సరిత, నాయకులు పెండ్యాల మహేశ్, కామారపు శ్యాం, కట్కూరి మల్లేశం, ఆనంద్, అరుణ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో సీసీరోడ్డు పనులు 5వ డివిజన్ కిసాన్‌నగర్ ముస్లింవాడలో రూ.8 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మేయర్ ప్రారంభించారు. స్థానికులు రోడ్డు సమస్యను విన్నవించగా, అప్పటికప్పుడు భూమి యజమానులతో మాట్లాడి పరిష్కరించారు. డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
పేకాట వివాదంలో వ్యక్తికి కత్తిపోట్లు
బొల్లారం : తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలోని శ్మశాన వాటికలో జరిగిన పేకాట వివాదంలో కుమార్ (50) అనే వ్యక్తి కత్తి పోట్లకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం శ్మశాన వాటికలో నలుగురు కలిసి పేకాటాడుతుండగా కుమార్, రవి అనే వ్యక్తి కి రూ.50 లు బాకీ పడ్డారు. దానికోసం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో రవి తన బ్యాగులో నుంచి కత్తి తీసి కుమార్ మెడ, చాతీపై దాడి చేయడంతో తీవ్రగాయలయ్యాయి. కుమార్‌ను గాంధీ అసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బతికుండగానే కాటికి..
పాలకొల్లు: ఆ పెద్దాయన నలుగురు సంతానానికి తండ్రి... అందర్నీ పెంచి ప్రయోజకులను చేసిన ఆయన ఇప్పుడు వారికి భారమయ్యాడు. మానవత్వం సిగ్గుపడేలా... ఆ వృద్ధుడ్ని శ్మశానంలో విడిచి వెళ్లిపోయారు కుటుంబీకులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు... పట్నాల బ్రహ్మం (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బ్రహ్మం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పట్టణంలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకొచ్చి కాటికాపరికి అప్పగించారు. దీంతో ఫోన్ నెంబర్ ఇచ్చి... చనిపోతే కబురు పెట్టాలని చెప్పి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శనివారం హిందూ శ్మశాన వాటికకు వచ్చి బ్రహ్మంను పరామర్శించారు. అతడ్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. వృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.