అనుమానాస్పదం | After discovering the events there was some suspicious background behind it | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదం

Published Sun, May 12 2019 5:27 AM | Last Updated on Sun, May 12 2019 5:27 AM

After discovering the events there was some suspicious background behind it - Sakshi

పుకార్లతో ఊరు అట్టుడుకుంతోంది. పోంచెర్ల టౌన్‌కి నాలుగు కోసుల దూరంలో ఉన్న పల్లెటూరు అది. పేరు చోరదిబ్బ. ఆ పేరు ఎందుకు వచ్చిందోగాని, ఊరికి మూడు వైపులా కుచ్చులబోడు, పలుకుబోడు, కొండలమ్మ చట్టు పేర్లతో ఉన్న గుట్టలు, మరొక వైపు చెరువు, చెరువుకు దగ్గర్లోనే శ్మశానం.పన్నెండువందలకు పైగా గడప. దాదాపు నాలుగు వేల ఓటర్లు ఉన్నా, ఎన్నికలప్పుడు మాత్రమే కనపడతారు నాయకులు. అన్ని ఊర్ల మాదిరిగానే ముసలీ ముతకా, చదువు సరిగా ఒంటబట్టని వారు తప్ప ఇతరులంతా బతుకుతెరువు కోసం దూరాలకు పోతే మిగిలిన వారు మాత్రమే ఉంటున్న ఊరు.ఈ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలతో ఊరి జనం బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి అయితే చాలు– శ్మశానంలో తెల్లని ఆకారాల సంచారం, మేకలు, కోళ్లు పదుల కొద్దీ మాయం కావడం, వాటి నెత్తురు శ్మశానంలో ఉండటం, ఒక రాత్రివేళ బహిర్భూమికి వెళ్లిన నర్సప్పని ఆ తెల్లని ఆకారాలే తినడానికి ప్రయత్నించడం, చివరికి చెయ్యి విరిగి బతుకు జీవుడా అని బయటపడటం, పూడ్చిన శవం తెల్లారే సరికి బయట పడి ఉండటం.

 దాదాపు ప్రతిరోజూ శ్మశానంలో పెద్దగా మంటలతో నెగళ్లు..వరుస సంఘటనలు జరుగుతున్నా, వాటి గురించి మాట్లాడుకోవడానికి ఊర్లో ఎవరికీ ధైర్యం చాలడం లేదు. కాలేజీలో చదువుతున్న శౌమిక్, మొహం మాడ్చుకుని ఉన్నాడు. ఎప్పుడూ వదలకుండా చూసే టీవీ నచ్చడం లేదు. పుస్తకాల వైపు చూడబుద్ధి కావడంలేదు. నిజం చెప్పాలంటే ఈ సెలవుల కోసం అతడు ఏడాదంతా ఎదురు చూస్తుంటాడు. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండలూ గుట్టలూ చెరువూ అంటే శౌమిక్‌కి భలే సరదా.కాని ఈసారి ఆ ఊరు రావద్దని, పరిస్థితులు బాగాలేవని ఆ ఊరి నుంచి కబురు. తల్లిదండ్రులు అనుమతి లేకుండా వెళ్లడానికి ఇష్టపడడు. ఊరికి వెళ్లడానికి శౌమిక్‌ మంకు రెండోరోజు కూడా సాగింది. మొత్తానికి వాళ్ల అమ్మ చెప్పిన వెయ్యి జాగ్రత్తలకు తల ఊపి, ఎట్టకేలకు ఊరికొచ్చాడు.రాత్రి అయింది. ఊరు చడీ చప్పుడూ లేకుండా ఊపిరి బిగపట్టుకుని నిద్రపోతోంది. శ్మశానానికి దగ్గరగా ఉండే వీధుల్లో అయితే ఉత్తరం దిక్కులో ఉండే కిటికీలు ఎప్పుడో భయంతో బిగుసుకుపోయాయి.ఈ పరిస్థితి శౌమిక్‌కు నచ్చడం లేదు.

సెలవులు సరదాగా గడుపుదామని వస్తే, ఇక్కడ వింత వింత విషయాలు తెలుస్తున్నాయి. దీని వెనుక ఏదో ఉంది. దాని సంగతి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.చిన్నగా వాళ్ల తాతయ్య దగ్గర చేరి, ‘ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు.వంటగదిలోకి వాళ్ల అమ్మమ్మ ‘ఆ పనీ అయ్యింది. అవతలి బజారులో ఉన్న వెంకటి మామ స్టేషన్‌కి కూడా వెళ్లాడు. కాని ఏమైందో ఏమో, ఆ తర్వాతి రోజే వాళ్లింటి పక్కనే ఉన్న గడ్డివాము తగలబడిపోయింది. ఆ మర్నాడు, ఇంట్లో ఉన్న మేకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకో ఇద్దరు ముగ్గురికీ అలాగే జరిగింది. అది మొదలు మళ్లీ ఎవరూ అలాంటి ఆలోచన కూడా చేయలేకపోయారు.’‘నువ్వు మాత్రం చీకటిపడితే బయటకు వెళ్లొద్దు’ తాతయ్య దాదాపు వార్నింగ్‌ ఇచ్చాడు.శౌమిక్‌ అయోమయంగా చూస్తుండిపోయాడు. కాని అతనికి ఒక నమ్మకం. కారణం లేకుండా ఏ పనీ జరగదు. ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.రోజంతా అందరి ఇళ్లకూ వెళ్లడం, కబుర్లాడుతూ సమాచారం సేకరించడం చేయసాగాడు శౌమిక్‌.

సేకరించిన వివరాలన్నీ క్రమ పద్ధతిలో కాగితం మీద రాసుకున్నాడు.ఊరికి ఈ ఆరు నెలల్లో కొత్తగా వచ్చిన వాళ్లు, ఇప్పటి వరకు వేరే చోట ఉండి ఊరికి వచ్చిన వాళ్ల వివరాలు... ఈ సంఘటనలు ఫలానా రోజు నుంచి జరుగుతున్నాయని చెప్పలేం గాని, ఆరు నెలల లోపే.. నర్సప్పను మినహా మరెవరినీ గాయపరచిన దాఖలాల్లేవు. శ్మశానంలో రెండు తెల్లని ఆకారాలు మాత్రం చాలామందికి కనిపించాయి. శ్మశానంలో మంటలు మాత్రం దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి.ఇంత జరుగుతున్నా ఎవరూ పోలీసులకు గాని, మీడియాకు గాని ఉప్పందించలేదు. అలా చేద్దామని చూసిన ఇద్దరి ముగ్గురి కళ్లాల్లో అగ్నిప్రమాదాలు, ఇళ్లలోని పశువుల మరణంలాంటివి జరిగి ఆర్థికంగా నష్టపోయారు. ఊళ్లో కొంత మంది ఈ మధ్య కాలంలోనే కాస్త స్థితిపరులుగా మారినట్లు కనిపిస్తోంది. వాళ్ల ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వస్తువులు కనిపిస్తున్నాయి.ఇంకా ఎక్కడో లింక్‌ మిస్సయినట్లే అనిపిస్తోంది శౌమిక్‌కి. తన వయసు వారిని కూడగట్టుకుని గుట్టల వైపు, చెలక పొలాల వైపు ఇదివరకటి మాదిరిగానే పగలల్లా తిరగసాగాడు.

అప్పుడు వచ్చింది అనుమానం.ఒకరోజు ఇంటికి రాగానే చేతిలో ఉన్నవి చూపించి– వాళ్ల తాతతో మాట్లాడాడు. తర్వాత బోటనీ లెక్చరర్‌కు ఫోన్‌ చేసి, చాలాసేపు మాట్లాడాడు.మరుసటి రోజే శౌమిక్, మరికొంతమంది క్రికెట్‌ బ్యాటు, బంతి తీసుకుని శ్మశానం వైపు వెళ్లారు. చెరువుకు దగ్గర్లో ఉన్న మైదానంలో ఆడుకున్నారు. చెరువుకు కొద్ది దూరంలో చిన్నపాటి డ్రమ్ములు కనిపించాయి శౌమిక్‌కు. తనతో ఉన్నవారిని అవేమిటని అడిగితే, ‘ఏమో, చేప పిల్లలను తెచ్చి చెరువులో పోసినప్పటివి అయి ఉంటాయి’ అని అన్నారు.అతనికి అనుమానం బలపడింది. పరిసరాలన్నీ నెమ్మదిగా పరిశీలిస్తూ శ్మశానంలోకి నడిచాడు.ఇంతలో అటుగా వస్తున్న ఒకతను ‘ఎవర్రా! ఏం కావాలి?’ కరకుగా అడిగాడు.‘రమణన్నా! మా దోస్తేలే’ అంటూ ఆడుతున్న పిల్లల్లో నుంచి అరిచారెవరో.‘అవునా! ఏంపేరు? ఎవరింటికి వచ్చావు?’ అడిగాడు.సమాధానం చెబుతూ, అతని వాలకం గమనిస్తూ వెనుదిరిగాడు.ఇంటికి వస్తూనే అమ్మమ్మను రమణ గురించి అడిగాడు.బొంబాయిలో ఉంటున్న రమణ ఏడాది కిందటే ఊరికి తిరిగొచ్చాడు.

ఒక్కడే ఉంటాడు. కొన్నేళ్ల కిందట దొంగతనం చేసినందుకు రమణ కులం వాళ్లను ఊరి వాళ్లు వెలివేశారు. అప్పడు వెళ్లిపోయిన తర్వాత రమణ ఒక్కడే ఊరికి వచ్చాడు. తల్లీదండ్రీ చనిపోయారని, తన కులంలో మిగిలిన వాళ్ల సంగతి తెలియదని చెప్పాడు. వచ్చినప్పటి నుంచి ఊర్లో అందరితో మంచిగా ఉంటూ గ్రామస్తులతో కలిసిపోయాడు. శ్మశానం వైపు వచ్చే వాళ్లకు అక్కడ జరిగే సంగతులు చెప్పి, జాగ్రత్తలు చెబుతూ ఉంటాడని చెప్పింది అమ్మమ్మ. ఆ రోజు కూడా శౌమిక్‌ లెక్చరర్‌తోను, మరెవరితోనో చాలాసేపు మాట్లాడాడు.శౌమిక్‌ వచ్చి చాలా రోజులైంది. మరో నాలుగు రోజుల్లో సెలవులైపోతాయి. ఎందుకో టెన్షన్‌ పడుతున్నాడు. పక్కింటి నుంచి అమ్మమ్మ ఇంట్లోకి వస్తూనే ‘ఏమయ్యోవ్‌! పోలీసులు వచ్చి వెంకటిని ఇంకొంతమందిని పట్టుకుపోయారటగా’ అంది.‘అవునా! ఎవరెవరిని పట్టుకున్నారు?’శౌమిక్‌ ఊపిరి బిగపట్టి వింటున్నాడు.‘వెంకటి, బొంబాయి రమణ, నర్సింహ..’ అంటూ లిస్టు చెప్పింది.రెండో రోజు ఉదయం పది గంటలవుతోంది. బయటి నుంచి కేకలు వినపడ్డాయి. ‘వీరాస్వామిగారూ! మిమ్మల్ని పోలీసులు రమ్మంటున్నారు.

పంచాయతీ ఆఫీసు దగ్గరకు త్వరగా రండి. ఇంకా కొంతమందిని పిల్చుకు రావాలి’ గ్రామ పంచాయతీ బంట్రోతు కేకేశాడు.‘పోలీసులా? వాళ్లకు నాతో ఏం పని?’ కంగారు గొంతుతో అంటూ చెప్పులేసుకుని బయల్దేరాడు. తాతయ్యతో కలసి శౌమిక్‌ కూడా బయల్దేరాడు.దాదాపు ఊరు ఊరంతా పంచాయతీ ఆఫీసు దగ్గర చేరింది. సర్పంచితో పాటు ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. శౌమిక్‌ను చూస్తూనే ఎస్సై పిలుస్తూ, ‘మీరే కదా శౌమిక్‌’ అనగానే తలూపాడు. పిలిచి పక్కన కూర్చోమని సైగ చేశాడు.ఎస్సై లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు. అంతా నిశ్శబ్దం అయింది.‘గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. ప్రతిచోటా, ప్రతిక్షణం పోలీసులు ఉండలేరు. ప్రతి పౌరుడూ పోలీసులాంటి వాడే. ఊరికి కొత్తగా, అనుమానాస్పదంగా ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయడం మీ బాధ్యత. మా డిపార్ట్‌మెంట్‌లోనూ మీ గ్రామ పోలీసులాంటి అవినీతిపరులు ఉండే అవకాశం ఉంది. వారి స్పందన సరిగా లేనప్పుడు పై అధికారులకు ఆ విషయం తెలియజేయాలి.

అలాగే, ఇంకొకరు ఫిర్యాదు చేయకుండా చేసేందుకు అతి తెలివి ప్రదర్శించి, వారి గడ్డివాములను వారే తగలబెట్టుకుని, వారి పశువులను వారే చంపుకొని నేరస్తులకు సాయపడ్డ వెంకటిలాంటి వాళ్లూ మీ మధ్యలోనే ఉంటారు’ ఎస్సై రుమాలుతో ముఖం తుడుచుకుంటూ కొనసాగించాడు.‘శౌమిక్‌ చూపిన చొరవ వల్ల ఒక నేర వ్యవస్థ పట్టుబడింది. ఈ విషయాలు శౌమిక్‌ చెబితేనే బాగుంటుంది’ అంటూ శౌమిక్‌ వైపు చూశాడు ఎస్సై.శౌమిక్‌ లేచాడు. ‘నేను ఇక్కడికి వచ్చే ముందే అమ్మమ్మ తాతయ్య వాళ్ల నుంచి కొంత సమాచారం తెలిసింది. అందుకే నేను ఇక్కడికి రావడానికి మా అమ్మవాళ్లు ముందు ఒప్పుకోలేదు. అయినా పట్టుపట్టి ఇక్కడకు వచ్చాక జరుగుతున్న, జరిగిన సంఘటనలు తెలుసుకున్నాక, వీటి వెనుక ఏదో అనుమానాస్పద నేపథ్యం ఉందనిపించింది. సమాచారం సేకరించడం మొదలుపెట్టా. ఈ ఆరు నెలల్లో ఊరికి కొత్తగా వచ్చిన వారెవరని ఆరా తీస్తే, సస్పెక్ట్‌ రమణ అనిపించింది. ఏడాది కిందట ఒకటి రెండు సార్లు ఊరికి వచ్చి వెళ్లాడు. ఆ రమణకు, పుల్లయ్య కూతురు మంగతో సావాసం కలిసింది. రోజూ రాత్రి శ్మశానం కనబడే తెల్లని ఆకారాలు వాళ్లే’‘మంగా’ అంతా ఉలిక్కిపడ్డారు.‘శ్మశానానికి దగ్గర్లోనే ఉన్న పుల్లయ్య కూతురు మంగ, పెళ్లయిన కొద్దికాలానికే భర్తను కోల్పోయి ఇంటికి చేరింది.

నెలకోసారైనా హిస్టీరియాతో బాధపడే మంగకు ఈ మధ్య కాలంలో హిస్టీరియా రాలేదు’ అందరికీ మంగ విషయాలు గుర్తుకొచ్చాయి. జనం మధ్యలోనే ఉన్న పుల్లయ్య తెల్లమొహం వేసి నిలుచున్నాడు.ఎస్సై మధ్యలో అందుకుని, ‘నర్సప్పను చంపబోయిందీ, గాయపరచిందీ వీరే. ఎవరూ అటువైపు రాకుండా ఉండేందుకే అలా చేశారు. నర్సప్ప తప్పించుకున్నాడు గాని, లేకపోతే అతన్ని చంపేవాళ్లు. ఆ భయం కొనసాగించడానికి ఇళ్లల్లో కోళ్లు, మేకలు ఎత్తుకెళ్లి చంపి తినేవాళ్లు. రమణ మిత్రులు రోజూ రావడం, రాత్రిపూట వీలైనంత వరకు పని చేయడం, తెల్లారక ముందే వెళ్లిపోవడం చేసేవాళ్లు. వాళ్లని కూడా పట్టుకున్నాం’ ‘మరి శ్మశానంలో వాళ్లకేం పని?’ ఎవరో సందేహం వెలిబుచ్చారు.‘గంజాయి నుంచి మార్ఫిన్‌ వంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు. గంజాయిని వేడి నీటిలో ఉడికిస్తారు. అదే మీరు శ్మశానంలో చూసిన మంటలు.

వేడి నీటికి సున్నపు పొడి కలిపితే మార్ఫిన్‌ తప్ప మిగిలిన పదార్థం గట్టి పడుతుంది. ఆ తర్వాత మిగిలిన ద్రావణానికి అమోనియం క్లోరైడ్‌ కలిపితే మార్ఫిన్‌ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియకు పెద్ద డ్రమ్ముల్లాంటివి కావాలి. అవే మీరు చెరువు దగ్గర చూసిన డ్రమ్ములు. నీరు అధికంగా కావాలి కాబట్టి చెరువుకు దగ్గర్లోని శ్మశానాన్ని ఎంచుకున్నారు. వంద కిలోల గంజాయి నుంచి పది కిలోల మార్ఫిన్‌ దొరుకుతుంది’ వివరించాడు శౌమిక్‌.‘మరి శవం సంగతో?’ మరొకరు అన్నారు.‘మీరు చీకటి పడుతుందన్న భయంతో సరిగా పూడ్చకపోవడం వల్ల బహుశ నక్కలు మట్టిని తోడి శవాన్ని బయటకు ఈడ్చుకొచ్చి ఉంటాయి. కాకపోతే అది నేరస్తులకు అడ్వాంటేజీ అయ్యింది.’ అన్నాడు ఎస్సై.ఎప్పటికప్పుడు తనకు సూచనలు ఇస్తూ సహకరించిన తన లెక్చరర్‌కు, పోలీసు వారికి శౌమిక్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘మీలాంటి బాధ్యతగా ఉండే యువకులుంటే మాకు పెద్దగా పనేమీ ఉండదు’ అంటూ అతడి భుజం తట్టాడు ఎస్సై.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement