
పతాకస్థాయికి డీజీపీ వర్సెస్ అదనపు డీజీ
డీజీపీ గుప్తా, అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి ఎత్తులుపైఎత్తులు
చర్చనీయాంశంగా మారిన డీజీపీ సొంత టీమ్ దందా
ఈ ప్రచారం వెనుక మధుసూదన్‌రెడ్డి పాత్ర ఉందని గరంగరం
సాక్షి, అమరావతి: ఆయన తీరు సందేహాస్పదం... కాదు ఆయనే తీరే వివాదాస్పదం
ఆయన మాట వినొద్దు... కాదుకాదు ఆయన మాట అసలే వినొద్దు
నాకు సీఎంవో మద్దతు ఉంది.. కాదు కాదు సీఎంవో అండ నాకే
..ఇదీ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు తీరు. డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి మధ్య విభేదాలు అనతికాలంలోనే పతాక స్థాయికి చేరాయి. ఓవైపు ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ మరోవైపు శాఖపై ఆధిపత్యం కోసం ఇద్దరూ ఎత్తులు పైఎత్తుల్లో మునిగితేలుతున్నారని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఇతర సీనియర్ అధికారులు, జిల్లా అధికారులు తీవ్ర సంకట స్థితి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కీలక ఫైళ్ల పరిష్కారంపై పడుతోంది.
డీజీపీ గుప్తాపై ఓ కన్నేసి ఉండమన్నారు
‘డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాపై సీఎం చంద్రబాబుకు పూర్తి విశ్వాసం లేదు. అందుకే నన్ను కీలకమైన శాంతిభద్రతల విభాగం అదనపు డీజీగా నియమించారు’ అంటూ మధుసూదన్‌రెడ్డి కొందరు సీనియర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి డీజీపీ గుప్తా ట్రాక్ రికార్డు సక్రమంగా లేదన్నది కూడా ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని ఆయన చెప్పినట్టు సమాచారం.
ఆయనపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రావడం, ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన ఉదంతాలను కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు. డీజీపీ గుప్తా కదలికలు, వ్యవహార శైలిపై కన్నేసి ఉండాలని స్వయానా సీఎం చంద్రబాబు తనకు సూచించినట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పుకోవడం ఆసక్తికరం. అయితే, తన గురించి మధుసూదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు డీజీపీ గుప్తాకు తెలిశాయి. దాంతో ‘‘అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి వద్దకు ఫైళ్లు పంపాల్సిన అవసరం లేదు. అన్ని ఫైళ్లు నేరుగా నాకే పంపండి’’ అంటూ అధికారులను మౌఖికంగా ఆదేశించారని సమాచారం.
అంతేకాక, మధుసూదన్‌రెడ్డి చాంబర్‌లోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఆయన్ను ఎవరు కలుస్తున్నారనే ప్రతి అంశాన్ని డీజీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అనంతరం వారిని పిలిపించి మాట్లాడుతూ.. మీరు అదనపు డీజీని కలవాల్సిన అవసరం లేదని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు కూడా అదే విషయం సూచించినట్టు సమాచారం.
ఈ పరిణామాలతో ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో..? అసలు ఎవరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్కువ పరపతి ఉందో అన్నది అర్థం కాక పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు తికమక పడుతున్నారు.
డీజీపీ.. ఓ చిరుద్యోగి..
ఓ వ్యాపారిడీజీపీ హరీశ్‌కూమర్ గుప్తా వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రామకృష్ణ అనే ఓ కిందిస్థాయి ఉద్యోగి, తెనాలికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ ద్వారా ప్రైవేటు వ్యవహారాలు సాగిస్తున్న విషయం శాఖలో బాగా వ్యాపించింది. దీనివెనుక మధుసూదన్‌రెడ్డి ప్రమేయం ఉందని డీజీపీ గుప్తా శిబిరం ఆరోపిస్తోంది. చిరుద్యోగి అయిన రామకృష్ణ ఏకంగా జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ డీజీపీ చెప్పారంటూ పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
డీజీపీ సమ్మతి లేకుండా ఒక చిరుద్యోగి అంతటి సాహసం చేయరు కదా? అని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక హరీశ్‌కుమార్ గుప్తా గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. సీఐల పోస్టింగ్‌లలో శ్రీనివాస్ భారీఎత్తున ముడుపుల వసూళ్లు సాగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దానిపై ఏకంగా విచారణ సంఘం గుంటూరులో ఓపెన్‌హౌస్ నిర్వహించడం గమనార్హం. హరీశ్‌గుప్తా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ డీజీ అయ్యాక వ్యాపారి శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చాడు.
విజిలెన్స్ దాడుల పేరుతో రాష్ట్రంలో గ్రానైట్, హోల్‌సేల్, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంకుల యజమానులతో పాటు పలువురు బడా వ్యాపారులను బెదిరించారని చెబుతారు. గుప్తా డీజీపీ కాగానే శ్రీనివాస్ మరింత చెలరేగి రాష్ట్రవ్యాప్తంగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడు. డీజీపీ పదవీ కాలం ఆగస్టులో ముగియనుంది. ఆలోగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఈ ద్వయం లక్ష్యంగా ఉంది.
అనంతరం డీజీపీకి పొడిగింపు లభిస్తే సరి.. లేదంటే అవకాశం కోల్పోతామన్నది వారి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ, వ్యాపారి శ్రీనివాస్‌లు డీజీపీ గుప్తా పేరుతో సాగిస్తున్న సెటిల్‌మెంట్లు పోలీస్ శాఖతో పాటు వ్యాపారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment