ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలి
సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలని చెప్పారు. హోం శాఖ వ్యవహారాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును డ్రోన్ల ద్వారా గుర్తించాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వచ్చే నెలలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో ఓ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులను రాబట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీసు శాఖ ఆధునీకరణకు రూ.61 కోట్లు విడుదల చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, వైద్య కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
కన్నయ్యనాయుడికి సత్కారం
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు సత్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబును బుధవారం కన్నయ్యనాయుడు కలిశారు. వరద ఉద్ధృతిలోనూ తాత్కాలిక గేటు అమర్చి.. నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన కన్నయ్యనాయుడును సీఎం చంద్రబాబు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక
అందజేశారు.
ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను సమకూర్చుకోండి
ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలుపై కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇప్పటికే ప్రతిపాదించిన 1,489 డీజిల్ బస్సులనూ సమకూర్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment