Home Department
-
పోలీసుల పనితీరులో మార్పు రావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలని చెప్పారు. హోం శాఖ వ్యవహారాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును డ్రోన్ల ద్వారా గుర్తించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వచ్చే నెలలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో ఓ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులను రాబట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ ఆధునీకరణకు రూ.61 కోట్లు విడుదల చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, వైద్య కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు. కన్నయ్యనాయుడికి సత్కారం కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు సత్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబును బుధవారం కన్నయ్యనాయుడు కలిశారు. వరద ఉద్ధృతిలోనూ తాత్కాలిక గేటు అమర్చి.. నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన కన్నయ్యనాయుడును సీఎం చంద్రబాబు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను సమకూర్చుకోండిఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలుపై కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇప్పటికే ప్రతిపాదించిన 1,489 డీజిల్ బస్సులనూ సమకూర్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
బంగ్లాలో భారతీయులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రత కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు అమిత్ షా వెల్లడించారు.కాగా, బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశంపై నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, దేశాన్ని వీడటంతో ముహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరోవైపు.. అక్కడ పరిపాలన వ్యవస్థ లేకపోవడంతో కొందరు మూకలు రెచ్చిపోతున్నారు. భారతీయులు, హిందువులు, పలువురు మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దుపై ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు, హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేపడుతుందన్నారు. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు చెప్పారు. ఇక, ఈ కమిటీలో దక్షిణ బెంగాల్, త్రిపుర విభాగాల బీఎస్ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు. -
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్‌బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
ఏపీకి 11.536 ఎకరాలు.. తెలంగాణకు 8.245 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తయింది. ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ శనివారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరగలేదు. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమన్వయంతో విభజన పూర్తయింది. ఢిల్లీలోని అశోకా రోడ్‌లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.9,913.505 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పంపకాల్లో భాగంగా ఏపీకి 58.32 శాతం వాటా దక్కగా, తెలంగాణకు 41.68 శాతం ఆస్తులు దక్కాయి. ఏపీ భవన్‌కు ఇలా 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవన్‌ను రెండు భాగాలుగా విభజించారు. విభజనలో భాగంగా ఏపీకి 11.536 ఎకరాలను అప్పగించారు. దీనిలో 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏపీ భవన్, 4.315 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సింగ్ హాస్టల్, 2.396 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. 0.512 విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నల్ రోడ్డు, 0.954 విస్తీర్ణంలోని శబరీ బ్లాక్ కొంత భాగాన్ని అప్పగించారు. ఏపీకి కేటాయించిన స్థలం విలువ రూ.5,781.416కోట్లు. తెలంగాణ భవన్‌కు ఇలా.. విభజనలో భాగంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. దీనిలో మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న శబరీ బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల విలువ రూ.4,132.089 కోట్లు. -
AP: మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత
సాక్షి, అమరావతి: సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు డీజీపీకి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది. -
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్‌లోని శ్రీముక్త్సర్ సాహిబ్‌కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్‌ను ప్రకటించింది. 2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. హోంశాఖ 2018లో ఆపరేషన్స్ మెడల్స్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక నాన్‌కేడర్ ఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంపికైన వారు రాజేష్ కుమార్ (ఐజీపీ), నరేందర్ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్.చైతన్య కుమార్ (నాన్‌కేడర్ ఎస్పీ), డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్ రెడ్డి, మహమూద్ యూసఫ్, హెడ్ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్.ప్రసాద్, కే.సి.విజయ్‌కుమార్, పీసీలు మహమూద్ ఖాజా మొయిద్దీన్, మోహముంద్ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్‌కుమార్, ఎస్.ప్రేమ్‌కుమార్, ఎండీ షబ్బీర్ పాషా, ఇంతియాజ్ పాషా షేక్, ఏ.శ్రీనివాస్. ఏపీ నుంచి ఎంపికైన వారు వినీత్ బ్రిజ్ లాల్ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్‌కుమార్ (ఎస్పీ, నాన్‌కేడర్), షేక్ సర్దార్ ఘని (ఇన్స్పెక్టర్), సవ్వన అనిల్‌కుమార్(ఎస్ఐ), ఎంవీఆర్‌పీ నాయుడు (ఆర్ఎస్ఐ), రాజన్న గౌరీ శంకర్ (హెడ్‌కానిస్టేబుల్), అనంతకుమార్ నంద (హెడ్‌కానిస్టేబుల్), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు. -
క్రిమినల్ బిల్లుల పరిశీలనకు మరింత సమయం
న్యూఢిల్లీ: ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో ప్రతిపాదించిన మూడు కొత్త బిల్లులపై హోం శాఖ కార్యకలాపాల పార్లమెంటరీ కమిటీ భేటీ శుక్రవారం అసంపూర్తిగా ముగిసింది. బిల్లుల డ్రాఫ్ట్‌ల అధ్యయనానికి మరింత సమయం కావాలని కమిటీలోని విపక్ష సభ్యులు కోరారు. స్వల్పకాలిక ఎన్నికల లబ్ధి కోసం వాటిని హడావుడిగా ఆమోదించొద్దని కమిటీ చైర్పర్సన్ బ్రిజ్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ నవంబర్ 6న భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. విపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆ రోజు వాటిని కమిటీ ఆమోదిస్తుందని సమాచారం. బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు మూడు కొత్త బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం తెలిసిందే. అనంతరం వాటిని పరిశీలన కమిటీకి పంపారు. వాటిపై పరిశీలనకు మరింత కావాలంటూ కమిటీలోని విపక్ష సభ్యులు పి.చిదంబరం (కాంగ్రెస్), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ) చైర్మన్‌కు లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రతిపాదిత చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని డీఎంకే వంటి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పట్టించుకోరాదని కేంద్రం నిర్ణయించినట్టు చెబుతున్నారు. -
రేపు తెలంగాణకు కేంద్ర బృందం.. నష్టాలపై నివేదిక!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదల నేపథ్యంలో పరిస్థితిని తక్షణమే అంచనా వేసేందుకు అమిత్‌షా ఆదేశాల మేరకు అంతర్–మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివరణాత్మక నివేదిక కేంద్రానికి సమర్పిస్తుంది. అనంతరం అవసరమైతే కేంద్ర బృందం మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తుంది. కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రహదారుల శాఖలు, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణలో 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి.. -
హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన
సాక్షి, తాడేపల్లి: హోంశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారు.. చంద్రబాబు రెండు సభలలో అమాయకులు చనిపోయారని సీఎం జగన్ అన్నారు. కాగా, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన -
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నా సీఎం జగన్
-
హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలి: సీఎం జగన్
-
హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. ‘‘దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలి. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి. రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌స్టేషన్ ఉండాలి’’ సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
డేటా దేశం దాటిందా?
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 24 రాష్ట్రాలకు చెందిన 80 కోట్ల మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చౌర్యానికి గురైన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సైబరాబాద్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇటీవల మూడు డేటా చౌర్యం కేసులకు సంబంధించి 17 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలు లీక్ అయ్యాయి. విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీఓలతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితులు విక్రయిసున్నారు. ఎలా లీకైంది? ఎవరు కొన్నారు? హై ప్రొఫైల్ వ్యక్తుల రహస్య సమాచారం లీక్ కావడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. నిందితులకు సమాచారం ఎలా చేరింది? ఎక్కడి నుంచి లీకైంది? ఎవరెవరు డేటా కొనుగోలు చేశారు? కొన్న సమాచారాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? సున్నితమైన సమాచారం ఏమైనా దేశం దాటిందా? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు వివరించారు. వెబ్సైట్ల ద్వారా డేటా విక్రయం.. తొలుత నిందితులు జస్ట్ డయల్ వేదికగా డేటాను విక్రయిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నిందితులు సొంతగా నకిలీ గుర్తింపు కార్డులతో కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి పేరుతో వెబ్సైట్లను సృష్టించి మరీ డేటాను విక్రయిస్తున్నట్లు తేలింది. ఢిల్లీ, ఫరీదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ నిరుద్యోగులను టెలీ కాలర్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. కొట్టేసిన సొమ్మును నేరుగా ఆయా ఖాతాలకు మళ్లిస్తే పోలీసులకు దొరికిపోతామని నో బ్రోకర్.కామ్, హౌసింగ్.కామ్, పేటీఎం, మ్యాజిక్ బ్రిక్స్ వంటి ఆన్లైన్ సంస్థలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. 21 సంస్థలకు నోటీసులు జారీ.. నిందితుల నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను విశ్లేషించిన పోలీసులు.. 21 సంస్థల నుంచి డేటా చౌర్యానికి గురైనట్లు గుర్తించారు. దీంతో బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యా ట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి 21 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో 8 సంస్థలు మాత్రమే విచారణకు హాజరై.. కస్టమర్ల డేటా సమీకరణ, భద్రత విధానాలపై పోలీసులకు నివేదికను సమర్పించాయి. దీంతో గైర్హాజరైన కంపెనీలపై పోలీసులు న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. 28 వెబ్సైట్లు ఇవే.. ♦ ఇన్‌సై్పర్ వెబ్స్ ♦ డేటా మార్ట్ ఇన్ఫోటెక్ ♦ గ్లోబల్ డేటా ఆర్ట్స్ ♦ ఎంఎస్ డిజిటల్ గ్రో ♦ ఇన్స్పైర్ డిజిటల్ ♦ ఫన్డూడేటా.కామ్ ♦ కెనిల్స్.కో ♦ డేటాస్పెర్నీడ్.కామ్ ♦ బినరీక్లూస్.కామ్ ♦ ఇనిగ్మా మార్కెటింగ్ ♦ అల్టీమోక్డ్స్.కామ్ ♦ ఫాస్ట్ డేటాబేస్ ప్రొవైడర్ ♦ డేటా సొల్యూషన్ ఫర్ బీ2బీ అండ్ ♦ బీ2సీ పోర్టల్ ♦ బీజీ డేటా ♦ డిమాండ్ డేటా సొల్యూషన్ ♦ స్పెర్ డిజిటల్ ఇండియా ♦ క్యూబిక్టెక్నాలజీ.కామ్ ♦ బీబీజీఈబ్రాండిం గ్.కామ్ ♦ ఈజీసర్వ్.కో.ఇన్ ♦ డేటాప్రొలిక్స్.కామ్ ♦ క్యూబిర్ర్ డేటాబేస్ మార్కెటింగ్ ♦ 77డేటా.నెట్ ♦ 99డేటాఏసీడీ.కామ్ ♦ డేటాబేస్ప్రొవైడర్.ఇన్ ♦ హెచ్ఐడేటాబేస్.కామ్ ♦ బల్క్డేటాబేస్.ఇన్ఫో ♦ గ్లోబల్‌డేటా.కామ్ ♦ డేటాపార్క్.కో.ఇన్ -
హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించండి
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించి.. ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరిగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతా గోపీ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ అభ్యర్థులకు నిర్ధేశించినట్లు హోంగార్డులకు కూడా కటాఫ్ మార్కులు నిర్ణయించడం తగదని.. ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. మొత్తం పోస్టుల్లో హోంగార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉందని చెప్పారు. 2016 నాటి జీవో 97 ప్రకారం స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రత్యేక కేటగిరికి వర్తించని తెలిపారు. సాధారణ అభ్యర్థుల్లాగా ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో పిటిషనర్లు దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందని శీనాకుమార్ వివరించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ఆదేశించారు. కటాఫ్‌తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలుకు గడువిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
జీవో నంబర్ 1పై దురుద్దేశంతోనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రజల భద్రత కోసం నిబంధనలను అనుసరించి హోం శాఖ జీవో నంబర్ 1 జారీ చేసిందని అదనపు డీజీ (శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాదయాత్రలు, రోడ్‌షోలపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొందరు దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలపై నిషేధం విధించిందని దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జీవో నంబర్ 1లో నిషేధం అనే మాటే లేదన్నారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైన సభలు, సమావేశాలు పెట్టొద్దని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పూర్తిగా ప్రజల ప్రయాణం, సరుకు రవాణా కోసమే రహదారులను ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వైద్యం, ఇతర అత్యవసర ప్రయాణాలు చేసేవారికి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవాలని సూచించామని తెలిపారు. అత్యవసరమైతే షరతులతో అధికారులు అనుమతినిస్తారని కూడా జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కరెంటు వైర్లు, కాలువలు, డ్రైనేజీలు దగ్గరలో లేకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభల నిర్వహణకు తగిన ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన సభ కోసం అనుమతి కోరితే అన్నీ పరిశీలించి అనుమతి మంజూరు చేశామని చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు సరిగా దరఖాస్తు పూర్తి చేయలేదన్నారు. దరఖాస్తు సరిచేసి ఇవ్వాలని పోలీసులు చెప్పినప్పటికీ నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఏ పార్టీ అయినా ఒకే రీతిలో జీవో నంబర్1 ను అమలు చేస్తామని వెల్లడించారు. 1861 పోలీసు చట్టం దేశమంతా అమలులో ఉందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్లు 30, 30ఏ, 31లలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగానే జీవో నంబర్ 1ను హోం శాఖ జారీ చేసిందన్నారు. కందుకూరు, గుంటూరు జిల్లాల్లో దుర్ఘటనలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ (శాంతిభద్రతలు) రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. -
AP: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపునిచ్చింది. ఈమేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుండటంతోపాటు, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సభల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లాల ఉన్నతాధికారులకు సూచించింది. రహదారులకు దూరంగా, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని పేర్కొంది. వివిధ పార్టీలు, ఇతర సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని చెప్పింది. అత్యంత అరుదైన సందర్భాల్లో.. అత్యంత అరుదైన సందర్బాల్లో జిల్లా ఎస్పీలు/ పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే షరతులతో సభలు, ర్యాలీలకు అనుమతినివ్వొచ్చు. అందుకు నిర్వాహకులు ముందుగా లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి. సభను ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు, కచ్చితమైన రూట్ మ్యాప్, హాజరయ్యేవారి సంఖ్య, సక్రమ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిపై జిల్లా ఎస్పీ/ పోలీస్ కమిషనర్ సంతృప్తిచెందితే నిర్వాహకుల పేరిట షరతులతో అనుమతినిస్తారు. సభ, ర్యాలీ నిర్వహణలో షరతులను ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే రాష్ట్రంలో రహదారులపై నియంత్రణ లేకుండా సభలు, ర్యాలీల నిర్వహణ వల్ల సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడతున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డుపై టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది సామాన్యులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నిర్వహించిన సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దుర్ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను ఆక్రమించి వేదికల నిర్మాణం, ఇష్టానుసారం ఫ్లెక్సీలు, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు, చివరి నిమిషాల్లో రూట్ మ్యాప్‌ల మార్పు, ఇరుకుగా బారికేడ్ల నిర్మాణం మొదలైన లోపాలతో ఈ రెండు దుర్ఘటనలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలపై మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణపై నియంత్రణ విధించింది. -
Telangana: తుపాకులకు హోంశాఖ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజ్, ఇతర అధికారులకు ఆయుధాలివ్వాలనే ప్రతిపాదనను గతంలోనే అటవీశాఖ నిశితంగా పరిశీలించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపుతో పాటు, తమ అవసరాలకు తగ్గట్టుగా ఏ రకమైన ఆయుధాలు కావాలి అన్న దానిపైనా అధ్యయనం జరిపారు. సెల్ప్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్) కోసం తయారీదారులను సంప్రదించే వరకు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాక.. హోంశాఖ అభిప్రాయం కోసం పంపించారు. అయి తే హోంశాఖ ఇందుకు నిరాకరించినట్లు అటవీ అధికారవర్గాల సమాచారం. అటవీ ప్రాంతాల్లోని అధికారులకు ఆయు« దాలు అందజేస్తే అవి తీవ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడే ప్రమాదముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల సహకారం తీసుకోండి.. అటవీ అధికారులకు పోలీస్ స్టేషన్ మాదిరిగా ఒక స్టేషన్, ఆయుధాలు భద్రపరిచే ‘బెల్‌రూమ్’వంటివి లేకపోవడాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదీగాక ఆయుధాలను ఉపయోగించడంలో అటవీ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడాన్ని కూడా హోంశాఖ ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తూ ఈ ప్రతిపాదనను అటకెక్కించినట్లు సమాచారం. చదవండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?! -
లోన్ యాప్స్ వేధింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ
సాక్షి, అమరావతి: లోన్ యాప్స్ వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంశాఖ అధికారులు సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1930ను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోన్ యాప్స్ వేధింపులపై 1930కి ఫిర్యాదు చేయాలని హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బ్యాంక్ వివరాలు, ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని హెంశాఖ హెచ్చరించింది. -
హామీలపై కేంద్ర హోంశాఖతో భేటీ.. రాజధాని కోసం రూ.29వేల కోట్లు..
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి. వీటిలో 7 అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి. కాగా, సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.20వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని తెలిపింది. షీలాబేడీ కమిటీ సిఫార్సుల ప్రకారం 89 సంస్థలను విభజించాలని సూచించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇవే.. - ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్లో విభజన - షెడ్యూల్-10లోని సంస్థల విభజన - చట్టంలో లేని ఇతర సంస్థల విభజన - ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన - సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన - బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన - ఏపీఎస్సీఎల్, టీఎస్సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15 రైస్ సబ్సిడీ విడుదల. ఏపీకి సంబంధించిన అంశాలు ఇవే.. - నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం - ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు - ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు - పన్ను మదింపులో పొరపాట్ల సవరణ - నూతన విద్యాసంస్థల ఏర్పాటు - నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు. -
AP News: అనధికార డిపాజిట్లు ఇక జప్తే..!
సాక్షి, అమరావతి: ఆర్థిక మోసాలు, అనధికార డిపాజిట్ల దందాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో అనధికారికంగా, ఆర్బీఐ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడాన్ని నిరోధించేందుకు కఠిన నిబంధనలను రూపొందించింది. అనధికారికంగా సేకరించే డిపాజిట్లు, అటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది. తద్వారా అధిక వడ్డీల ఎరకు మోసపోకుండా సామాన్యులకు రక్షణ కవచాన్ని కల్పించింది. అనధికార డిపాజిట్ల సేకరణపై పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.. ► ఆర్బీఐ అనుమతులు లేకుండా ఏ సంస్థగానీ, వ్యక్తులుగానీ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. ► అనధికారికంగా డిపాజిట్లు సేకరించే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నియమించే అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. ► ఎవరైనా డిపాజిట్లు సేకరిస్తే వాటికి సంబంధించిన వివరాలను ఆ అధికారికి తెలపాలి. ► తమ బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల వివరాలు వెల్లడించలేకున్నా వాటిని అనధికారిక డిపాజిట్లుగానే పరిగణిస్తారు. ► అడిగిన వివరాలు చెప్పకుండా పరారైతే సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను న్యాయస్థానానికి నివేదిస్తారు. ► ఇక అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, అలా సేకరించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులనూ జప్తు చేసే అధికారం ఆ అధికారికి ప్రభుత్వం ఇచ్చింది. ఆస్తుల జప్తునకు సంబంధించిన వివరాలను న్యాయస్థానానికి సమర్పిస్తారు. ► స్థానిక పోలీసు అధికారులతో కలసి ఆ వ్యక్తులు, సంస్థల ఆస్తులు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను కూడా ఆ అధికారి పరిశీలించవచ్చు. వీటికి మినహాయింపు డ్వాక్రా గ్రూపులు, చేనేత, స్వగృహ సహకార సంఘాలు, గుర్తింపు పొందిన మతపరమైన సంస్థలకు మినహాయింపు నిచ్చారు. ఆ సంఘాల్లోని ఒక్కో సభ్యుడు ఏడాదికి గరిష్టంగా రూ. 10 వేల వరకు చేసే డిపాజిట్లను అనధికారిక డిపాజిట్లుగా పరిగణించరు. మతపరమైన సంస్థలు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు, వేద పాఠశాలలు, గోశాలల నిర్వహణకు సేకరించే డిపాజిట్లకు కూడా ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. డిపాజిట్‌దారుల సొమ్ముకు రక్షణ సామాన్యులు అవగాహన లేకుండా అనధికారిక డిపాజిట్లు చేస్తే.. వారి సొమ్ముకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. అనధికారికంగా సేకరించిన డిపాజిట్లను, ఆ సంస్థల ఆస్తులను వెంటనే జప్తు చేస్తారు. ఆ విధంగా జప్తు చేసిన నగదు, ఆస్తులను ఇతరులకుగానీ ఇతర సంస్థలకుగానీ బదిలీ చేయడానికి వీల్లేదు. కేసు పరిష్కారమైన తరువాత డిపాజిటర్లకు వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ తప్పనిసరి రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం కఠినతరం చేసింది. సెక్యూరిటీ ఏజెన్సీలు పాటించాల్సిన నిబంధనలు, సెక్యూరిటీ సిబ్బంది నియామక అర్హతలు, వారికి ఇవ్వాల్సిన కనీస శిక్షణ ప్రమాణాలను నిర్దేశించింది. విధివిధానాలను పాటించే ఏజెన్సీలకే లైసెన్సులు జారీచేస్తామని స్పష్టం చేస్తూ హోం శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం
అగ్నిపథ్ స్కీమ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022 'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇవే.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి.