సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించి.. ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరిగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతా గోపీ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి.శీనాకుమార్ వాదనలు వినిపిస్తూ.. సాధారణ అభ్యర్థులకు నిర్ధేశించినట్లు హోంగార్డులకు కూడా కటాఫ్ మార్కులు నిర్ణయించడం తగదని.. ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. మొత్తం పోస్టుల్లో హోంగార్డులకు ప్రత్యేకంగా 15 శాతం కోటా ఉందని చెప్పారు. 2016 నాటి జీవో 97 ప్రకారం స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ప్రత్యేక కేటగిరికి వర్తించని తెలిపారు. సాధారణ అభ్యర్థుల్లాగా ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో పిటిషనర్లు దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందని శీనాకుమార్ వివరించారు.
ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ఆదేశించారు. కటాఫ్‌తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని రిక్రూట్‌మెంట్ బోర్డుకు స్పష్టం చేశారు. కౌంటర్లు దాఖలుకు గడువిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment