సాక్షి, అమరావతి: హోంశాఖకు పెరిగిన అవసరాలను పట్టించుకోకుండా బడ్జెట్‌లో జరిపిన అరకొర కేటాయింపులు జీతాలకే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంశాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లోనూ మోక్షం లభించలేదు. కేవలం రూ.6,226 కోట్లు కేటాయించారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్భయ మహిళా పోలీస్ వాలంటీర్ల కోసం రూ.28.71 కోట్లు మంజూరు చేశారు. పోలీసుల సంక్షేమానికి రూ.9.69 కోట్లు మాత్రమే విదిల్చారు. నేరాల నివారణలో ఎంతో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ (సీసీటీఎన్)కు రూ.20.70 కోట్లు ఇచ్చారు. రాజధానిలో నిర్మించే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి రూ.10 కోట్లనే ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రతకు నిధులను కేటాయించలేదు.
రాష్ట్రంలో వంద మోడల్ పోలీస్‌స్టేషన్‌లు నిర్మిస్తామని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా కేవలం 30 మోడల్ పోలీస్‌స్టేషన్ భవనాలకు మాత్రమే నిధులిచ్చారు. మంగళగిరిలో ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్ వద్ద రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్మాణం మినహా ప్రధాన సౌకర్యాలు సమకూరలేదు. రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) ఏర్పాటు చేయాల్సి ఉంది. మచిలీపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితమే స్థల పరిశీలన పూర్తైనా అక్కడ ఒక్క ఇటుక వేస్తే ఒట్టు. అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులకు రోజుకు రూ.500లకు పైగా వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం రూ.400లతో సరిపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment