Provisions
-
రంజాన్‌కు భారీ బందోబస్తు
సాక్షి హైదరాబాద్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు నిర్ణీత ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మీరాలం ఈద్గా వద్ద.. ఈద్గా మీరాలం ట్యాంక్ వైపు ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను పురానాపూల్, కామాటిపు రా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా చౌరస్తా మీదుగా పంపిస్తారు. సాధారణ వాహనాలను బహదూర్‌పురా చౌరస్తా నుంచి కిషన్‌బాగ్, కామాటిపురా వైపు మళ్లిస్తారు. సైకిళ్లు, రిక్షాలను ఈద్గా క్రాస్ రోడ్స్ దాటి రానివ్వరు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాండ్స్‌లో వీటిని ఆపుకోవాలి. శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను ధనమ్మ గుడిసెలున్న టీ–జంక్షన్ నుంచి ఆలియాబాద్, తాడ్‌బండ్, బాయిస్ టౌన్ హైస్కూల్ మీదుగా పంపిస్తారు. ప్రార్థనల అనంతరం వేగంగా ప్రయాణించే వాహనాలను పునారాపూల్, సిటీ కాలేజ్ మీదుగా పంపుతారు. మాసబ్‌ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ వద్ద.. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వచ్చే సాధారణ వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్‌ట్యాంక్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్‌కృష్ణా, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. లక్టీకాపూల్ నుంచి రోడ్ నంబర్ 1/12 వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను అయోధ్య, నిరంకారి, చింతల్‌బస్తీ మీదుగా పంపిస్తారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
యస్ బ్యాంక్.. 80 % జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 266 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే లాభం ఏకంగా 80 శాతం ఎగిసింది. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ గణనీయంగా తగ్గడం ఇందుకు తోడ్పడింది. నికర వడ్డీ మార్జిన్ 0.25 శాతం వృద్ధి చెంది 2.4 శాతానికి పెరిగినప్పటికీ .. రుణ వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 31 శాతం క్షీణించి రూ. 1,764 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో రుణ వృద్ధి 4 శాతంగా నమోదైంది. క్యూ3లో ప్రొవిజనింగ్ రూ. 2,089 కోట్ల నుంచి ఏకంగా 82 శాతం తగ్గింది. రూ. 375 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. భారీ విలువ రుణాలను తగ్గించుకోవడంతో పాటు కార్పొరేట్లు రుణాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి గైడెన్స్‌ను 10 శాతానికి కుదించుకున్నట్లు ఆయన వివరించారు. గతంలో ఇది 15 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. -
మూడు నెలలు... 52వేల కోట్లు!
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు అధికం. విమానయాన సంస్థ, జెట్ ఎయిర్వేస్ కూలిపోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీ కూడా మూతపడటంతో ప్రభుత్వ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరటంతో ఈ ప్రభావం బ్యాంక్‌ల లాభదాయకతపై బాగానే పడింది. ఎనిమిది బ్యాంక్‌లకు రూ.15,192 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. ఐదు బ్యాంక్‌లకు మాత్రమే నికర లాభాలొచ్చాయి. ఒక్కో బ్యాంక్ నష్టాలు నాలుగంకెల్లో (వెయ్యి కోట్లకు పైగా) ఉండగా, లాభాల్లో ఉన్న బ్యాంక్‌ల లాభాలు రెండు, మూడు అంకెల్లో (రూ.95 కోట్లు నుంచి రూ.838 కోట్ల రేంజ్) మాత్రమే ఉన్నాయి. ఇప్పట్లో కష్టమే.... ఈ మొండి బకాయిల్లో ఎంత మొత్తం బకాయిలు వసూలు అవుతాయో, ఎంత మేర బకాయిలను బ్యాంక్‌లు రద్దు చేస్తాయో, ఎన్ని కోట్ల కేటాయింపులు మళ్లీ వెనక్కి వస్తాయో ఎవరూ జవాబివ్వలేని ప్రశ్నగా మిగిలిపోయింది. కేటాయింపుల పరిమాణం చూస్తే, మొండి బకాయిల బండ ఇప్పట్లో బ్యాంక్‌లను వీడేటట్లు లేదని నిపుణులంటున్నారు. కేటాయింపుల వ్యధ... గత క్యూ3లో రూ.6,006 కోట్లుగా ఉన్న ఎస్బీఐ మొండి కేటాయింపులు గత క్యూ4లో నాలుగు రెట్లు పెరిగి రూ.16,502 కోట్లకు చేరాయి. ఐఎల్ఎఫ్ఎస్కు ఇచ్చిన రూ.3,487 కోట్ల రుణాల్లో 1,125 కోట్ల రుణాలను మొండి బకాయిలుగా ఎస్బీఐ వర్గీకరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.1,200 కోట్ల బకాయిలను కూడా మొండి బకాయిలుగా ఈ బ్యాంక్ గుర్తించింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా రూ.1,985 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ కేటాయింపులు రూ.4,502 కోట్లుగా ఉన్నాయి. రానున్న క్వార్టర్లలో ఈ బ్యాంక్ కేటాయింపులు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులంటున్నారు. దీంతో మరో రెండు క్వార్టర్ల పాటు ఈ బ్యాంక్‌కు నష్టాలు తప్పవని వారంటున్నారు. దాదాపు ప్రతి బ్యాంక్ పరిస్థితి ఇలాగే ఉంది. రెండు బ్యాంక్‌ల కేటాయింపులు మాత్రం గత క్యూ4లో తగ్గాయి. యునైటెడ్ బ్యాంక్ కేటాయింపులు రూ.1,967 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేటాయింపులు రూ.4,422 కోట్ల నుంచి రూ.415 కోట్లకు తగ్గాయి. ఈ రెండు బ్యాంక్‌లకు గత క్యూ4లో నికర లాభాలు వచ్చాయి. వడ్డీ ఆదాయం కంటే మొండి బకాయిల కేటాయింపులే అధికం... మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎనిమిది బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం కంటే కూడా మొండి బకాయిల కేటాయింపులే అధికంగా ఉన్నాయి. మొండి బకాయిల ప్రక్షాళన కోసం సదరు ఎనిమిది బ్యాంక్‌లు కనీసం మరో రెండేళ్ల పాటు కేటాయింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం రూ.43,304 కోట్లు. కాగా, మొండి బకాయిలు కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరాయి. -
ఐసీఐసీఐకు ప్రొవిజన్ల దెబ్బ : లాభాల్లో క్షీణత
సాక్షి,ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ లిమిటెడ్ క్యూ3 ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబరు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 2.8 శాతం క్షీణించాయి. తద్వారా ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసింది. 2017డిసెంబరు క్వార్టర్లో సాధించిన రూ.1650 కోట్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో రూ. 1605 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 19.8శాతం మేర పుంజుకుంది. రూ. 20,163 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 16,832 కోట్లుగా ఉంది. ఎసెట్ క్వాలిటీ కూడా పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 8.54 నుంచి 7.75శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తుల రేషియో కూడా 3.65 శాతం నుంచి 2.58 శాతానికి దిగి వచ్చింది. అయితే ప్రొవిజన్లు బ్యాంకు ఫలితాలను దెబ్బతీశాయి ఎనలిస్టులు పేర్కొన్నారు. గత క్వార్టర్‌తో పోలిస్తే 6శాతం, వార్షిక ప్రాతిపదికన 19శాతం ఎగిసి రూ. 4, 244కోట్లుగా నిలిచాయి. మరోవైపు రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో మాజీ సీఈవో చందా కొచర్‌పై ఎప్ఐఆర్ నమోదైంది. అటు ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణానికి సంబంధించి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్టును దర్యాప్తు సంస్థకు అందించింది. ఈ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచర్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ వార్తలు రేపటి బ్యాంకు షేర్ ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
క్యూ2లో ఢమాలన్న పీఎన్బీ
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) క్యూ2లో ఢమాల్ అంది. శుక్రవారం విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర నష్టాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తోముగిసిన క్యూ2లో రూ. 4532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత త్రైమాసికంలో రూ. 940 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో భారీ నష్టాలను నమోదు చేసింది. పీఎన్బీ నికర వడ్డీ ఆదాయం కూడా 1 శాతం తగ్గి రూ. 3974 కోట్లకు పరిమితమైంది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 18.26 శాతం నుంచి 17.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 10.58 శాతం నుంచి 8.9 శాతానికి నీరసించడం గమనార్హం. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 5758 కోట్ల నుంచి రూ. 9758 కోట్లకు ఎగశాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5250 కోట్ల నుంచి రూ. 4476 కోట్లకు తగ్గాయి. రైటాఫ్స్ రూ. 2648 కోట్ల నుంచి రూ. 3543 కోట్లకు ఎగశాయి. ఈ ఫలితాల నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలతో 4శాతానికి పైగా నష్టపోయింది. అయితే ఇటీవల నీరవ్‌మోదీ స్కాంతో అభాసుపాలైన పీఎన్బీ ఎసెట్ క్వాలీటీ క్వార్టర్-ఆన్ క్వార్టర్ మెరుగుపడింది. సెప్టెంబర్ చివరినాటికి రుణాల మొత్తం 17.16 శాతంగా ఉంది. జూన్ చివరి నాటికి ఇది 18.26 శాతం, అంతకు ముందు ఏడాది 13.31 శాతంగా ఉంది. -
ఎస్బీఐ షాకింగ్ : క్యూ1లో భారీ నష్టాలు
-
ఎస్బీఐ షాకింగ్ : క్యూ1లో భారీ నష్టాలు
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ షాకింగ్ ఫలితాలను విడుదల చేసింది. జూన్‌తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,876 కోట్ల స్టాండలోన్ నికర నష్టాలను నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ రూ.242 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. కానీ విశ్లేషకుల అంచనాలను ఎస్బీఐ తలకిందులు చేసింది. గత మార్చి త్రైమాసికంలో కూడా ఇదే విధంగా రూ.7718.17 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ త్రైమాసికంలో బ్యాంక్‌కు రూ.2,005.53 కోట్ల లాభాలు ఉన్నాయి. ఏడాది ఏడాదికి ప్రొవిజన్లు భారీగా రూ.19,228.26 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ప్రొవిజన్లు రూ.8,929.48 కోట్లగా మాత్రమే ఉన్నాయి. అయితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు ఈ త్రైమాసికం మొత్తం రుణాల్లో 10.69 శాతానికి పడిపోయాయి. మార్చి త్రైమాసికంలో ఇది 10.91 శాతంగా రికార్డయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 5.73 శాతం నుంచి 5.29 శాతానికి తగ్గాయి. వడ్డీలు ఈ త్రైమాసికంలో 7.1 శాతానికి పెరిగి రూ.58,813.18 కోట్లగా రికార్డైనట్టు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల ప్రకటన అనంతరం ఈ బ్యాంక్ షేర్లు 5.1 శాతం క్షీణించాయి. -
హోంశాఖకు పెంపు.. జీతాలకే సరి
సాక్షి, అమరావతి: హోంశాఖకు పెరిగిన అవసరాలను పట్టించుకోకుండా బడ్జెట్లో జరిపిన అరకొర కేటాయింపులు జీతాలకే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంశాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లోనూ మోక్షం లభించలేదు. కేవలం రూ.6,226 కోట్లు కేటాయించారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిర్భయ మహిళా పోలీస్ వాలంటీర్ల కోసం రూ.28.71 కోట్లు మంజూరు చేశారు. పోలీసుల సంక్షేమానికి రూ.9.69 కోట్లు మాత్రమే విదిల్చారు. నేరాల నివారణలో ఎంతో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ (సీసీటీఎన్)కు రూ.20.70 కోట్లు ఇచ్చారు. రాజధానిలో నిర్మించే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి రూ.10 కోట్లనే ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రతకు నిధులను కేటాయించలేదు. రాష్ట్రంలో వంద మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తామని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా కేవలం 30 మోడల్ పోలీస్‌స్టేషన్ భవనాలకు మాత్రమే నిధులిచ్చారు. మంగళగిరిలో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ వద్ద రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్మాణం మినహా ప్రధాన సౌకర్యాలు సమకూరలేదు. రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) ఏర్పాటు చేయాల్సి ఉంది. మచిలీపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితమే స్థల పరిశీలన పూర్తైనా అక్కడ ఒక్క ఇటుక వేస్తే ఒట్టు. అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులకు రోజుకు రూ.500లకు పైగా వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం రూ.400లతో సరిపెడుతున్నారు. -
ఆర్థిక రాజధానికి అరసున్నా
⇒అరకొర కేటాయింపులు ⇒అత్తెసరు ప్రతిపాదనలు ⇒రాష్ట్ర బడ్జెట్లో విశాఖకు మొండి చెయ్యి ఆర్థిక రాజధాని అని ఆకాశానికెత్తేశారు.. ఐటీహబ్ చేస్తామని ఊదరగొట్టారు.. జిల్లాను పర్యాటక పుంతగా మార్చేస్తామని మురిపించారు... తీరా.. బడ్జెట్ దగ్గరకొచ్చేసరికి మొండిచెయ్యి చూపారు.. అరకొర కేటాయింపులు.. అత్తెసరు ప్రాజెక్టులు.. అస్పష్ట ప్రతిపాదనలతో విశాఖ జిల్లా ప్రజలను రాష్ట్ర సర్కారు తీవ్ర నిస్పృహకు గురి చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్లో విశాఖ నగరానికి, జిల్లాకు చేసిన కేటాయింపులు చూస్తే.. దేశ విదేశాల ప్రముఖులను మభ్యపెట్టడానికి, ప్రచార ఆర్భాటాలకే వినియోగించుకుంటున్నారని స్పష్టమవుతోంది. నిధుల కేటాయింపు విషయానికొచ్చేసరికి కూరలో కరివేపాకులా తీసుపారేస్తున్నారని.. బడ్జెట్ కేటాయింపులు చూసిన స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చీటికీ మాటికీ విశాఖకు వచ్చి వాలిపోయే సీఎం చంద్రబాబు.. ఆయా సందర్భాల్లో లెక్కలేనన్ని హామీలు ఇచ్చేస్తున్నారు..ఆ హామీలకూ ఈ బడ్జెట్లో చోటు దక్కకుండా పోయింది.తాగు, సాగు నీటికి సంబంధించి జిల్లాకు, నగరానికి అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ముష్టి విదిల్చినట్లు రూ.2 కోట్లు పడేశారు. పరిశ్రమలకు అత్యంతావశ్యకమైన ఏలేరు ఆధునికీకరణకూ అరకొర నిధులే విదిల్చారు. సిగ్నేచర్ టవర్స్, ఐటీ స్టార్టప్ విలేజ్, కేజీహెచ్ ఆధునికీకరణ, గాజువాక హౌస్ కమిటీ.. తదితర అంశాలన్నీ సోదిలో లేకుండా పోయాయి..ఏతావాతా తేలిందేమిటంటే.. ఈ బడ్జెట్లో ఆర్థిక రాజధానికి అరసున్నాయే గతి.. విశాఖపట్నం : విశాఖ వచ్చిన ప్రతిసారీ విశాఖను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం, ఆర్థిక రాజధానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం అంటూ ముఖ్యమంత్రి హామీలిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆయన హామీలకు మోక్షం లభిస్తుందని అంతా ఎదురుచూశారు. బుధవారం నాటి బడ్జెట్లో కేవలం మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టి విశాఖపై తనకున్న ‘ప్రత్యేక అభిమానం’ ఏపాటిదో చాటుకున్నారు. ఏలేరు ఆధునికీకరణకు గత బడ్జెట్లో రూ.19.51 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.39.36 కోట్లు కేటాయించారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గత ఏడాది, ఈ సంవత్సరం కూడా కేవలం రూ.2 కోట్లే ఇచ్చారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. అంటే ఈ నిధుల్లో విశాఖకు సగటున రూ.150 కోట్లు వచ్చే అవకాశం ఉంది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని లెక్కలేనన్ని సార్లు వేదికలపై ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు కేటాయింపులే చేయలేదు. విశాఖ ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రస్తావనే లేదు. మెట్రో రైలు ఊసే లేదు విజయవాడలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించగా.. మూడేళ్ల నుంచి ఊరిస్తున్న విశాఖ మెట్రో రైలు ఊసే లేదు. ఏటా కోటి మందిని ఆకర్షిస్తున్న విశాఖ పర్యాటకరంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని చూపింది. గాజువాక హౌస్‌కమిటీ భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న హామీకి బడ్జెట్లో పరిష్కారం చూపలేదు. సిగ్నేచర్ టవర్స్‌కు మంగళం మధురవాడ ఐటీ సెజ్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సిగ్నేచర్ టవర్స్ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ టవర్స్‌కు మంగళం పాడేశారు. స్టార్టప్ విలేజ్‌లో ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. చెన్నై మెరీనా బీచ్‌కు ధీటుగా విశాఖ బీచ్‌ను తీర్చిదిద్దుతానని, బర్డ్స్ పార్కు, బొటానికల్ గార్డెన్, ఓషన్ రివర్, బీచ్ రిసార్ట్స్, సైన్స్ సిటీలు నిర్మిస్తానని, పాడేరు సర్క్యూట్ ద్వారా అరకు, లంబసింగిలో సమ్మర్ రిసార్ట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, ఐఎన్ఎస్ విరాట్ మ్యూజియం కమ్ స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ çహోటల్స్ వంటివి ఏర్పాటు చేస్తామని ఎన్నో సార్లు సీఎం ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించడానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. డీప్‌వాటర్ పోర్టు ఊసేలేదు విశాఖలో ప్రస్తుతం ఉన్న రెండు పోర్టులకు అదనంగా మరో డీప్‌వాటర్ పోర్టును తీసుకొస్తానని ఇచ్చిన హామీ ఈ బడ్జెట్లో అమలు కాలేదు. భీమిలి–కాకినాడ కారిడార్ పొడవున తీర రహదారిని నిర్మిస్తామని, కుర్లాన్, బయోకాన్, ఏసియన్ పెయింట్స్ తదితర పరిశ్రమలు విశాఖలో ఏర్పాటవుతాయని సీఎం చెప్పారు. కానీ వాటి నిధుల కేటాయింపుపై శ్రద్ధ చూపలేదు. సాగరమాలలో విశాఖ–కాకినాడల మధ్య పోర్టులను కలుపుతూ లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ వీటిలో ఏ ఒక్కటి ఈ బడ్జెట్లో చేర్చలేదు. బీచ్రోడ్ల సంగతి మరిచారు? విశాఖ–కాకినాడ, విశాఖ–చెన్నై, ఇచ్చాపురం–చెన్నైల మధ్య బీచ్‌రోడ్లను నాలుగులైన్ల రహదారులుగా విస్తరించనున్నామని, విశాఖ, గంగవరం, కాకినాడ, కష్ణపట్నం పోర్టుల సామరŠాద్యన్ని విస్తరించేందుకు నిధుల జోలికెళ్లలేదు. స్పోర్ట్స్, మెరైన్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఎప్పట్నుంచో చెబుతున్నా ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావన లేదు. హైదరాబాద్‌కు ధీటుగా విశాఖలో కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న హామీకి ఠికాణా లేదు. ఐటీ హబ్‌ను పట్టించుకోలేదు? విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం ఐటీ శాఖకు కేవలం రూ.364 కోట్లు ఇచ్చింది. ఇదే రాష్ట్ర వ్యాప్త ఐటీ అభివృద్ధికి సర్ధుకోవాలంటే కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు కాదు కదా రహదారుల నిర్మాణానికి కూడా సరిపోదు. ఇప్పటికే ఐటీ పరిశ్రమలు విశాఖ నుంచి తరలిపోతున్నాయి. వస్తామన్న ఒక్క కంపెనీ కూడా ఇటువైపు చూడటం లేదు. బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత ఇక విశాఖ ఐటీ హబ్ కలేనని తేలిపోయింది. కేవలం ఒప్పందాలకే పరిమితం? పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలంగా ఉందని చెబుతూ విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సును మంత్రి గొప్పగా చెప్పుకున్నారు. 2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 328 అవగాహన ఒప్పందాలు చేసుకోగా రూ.4,67,577 కోట్లు మేర పెట్టుబడులు ఆకర్షించామని, 2017లో 664 ఒప్పందాలు చేసుకుని, రూ.10.54 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా 22.34 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడిందని అప్పుడు చెప్పిన అబద్ధాలనే సభా ముఖంగా మరోసారి నమ్మబలికారు. నిజానికి ఈ ఒప్పందాల్లో చాలా వరకూ తప్పుడు ఒప్పందాలని, వీటి వల్ల విశాఖకు ఒరిగేదేమీ లేదని అప్పుడే తేలిపోయింది. -
ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికమే
పునర్విభజన సమావేశంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పునర్విభజనలో కొత్త జిల్లాకు అధికారులు, సిబ్బందిని తాత్కాలికంగానే కేటాయించనున్నామని జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పునర్విభజన పర్యవేక్షక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాకు కేటాయింపులు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరపాలని సూచించారు. ఆయా శాఖలు తమ తమ జాబితాను ఇష్ట ప్రకారంగా సమర్పించినందున అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. నమూనాలో కార్యాలయ వసతి, సిబ్బంది, ఫైళ్ల వివరాలు, ఫర్నిచర్ సంబంధిత వివరాలు అందించాలని కోరారు. ఫైళ్ల నమూనాలో గార్ల, బయ్యారానికి సంబంధించిన ఫైళ్లు ఉంటే వాటిని వేరుగా చూపించాలని చెప్పారు. అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని, అక్కడ ఏ నమూనాలో అడిగినా పంపించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన జాబితాలను పరిశీలించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్, జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీనివాస్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, సీపీఓ రాందాస్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు, సమాచార శాఖ ఏడీ ముర్తుజా, మెప్మా పీడీ వేణుమనోహర్‌రావు పాల్గొన్నారు. -
ముందుగా బీమా.. ఆరోగ్యానికి ధీమా
కంపెనీ పాలసీతో పాటు సొంతదీ ఉండాలి వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రాథమిక వైద్యానికి సంబంధించిన కేటాయింపులు ఎప్పటికప్పుడు భారీగా పెంచుతోందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కోసం ఎంత ముందు నుంచీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. 23 సంవత్సరాల నేహా శర్మను ఉదాహరణగా తీసుకుంటే... ఈ మధ్యే తను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. జీతం నెలకు రూ.25 వేలు. కంపెనీ తరఫున ఒక పీఎఫ్ ఖాతా, పేరెంట్స్ బహుమతిగా ఇచ్చిన ఒక ఎల్ఐసీ పాలసీ ఉంది. ఆ వయసులోని మిగతా వారిలానే నేహాకు ప్రత్యేకంగా సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదీ లేదు. కంపెనీ తరఫునున్న రూ.5 లక్షల కవరేజీ పాలసీ తప్ప. తను ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభంలో ఉంది.. ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరమేంటి అన్నది తన అభిప్రాయం. ఇరవైలలో ఉన్న నేహా విషయాన్ని కాస్సేపు అలా ఉంచితే... ముప్ఫైలలో ఉన్న వారు కూడా చాలా మంది ఇదేరకంగా భావిస్తుండటం ఆలోచించతగ్గ విషయం. ఎందుకంటే... ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స చేయించాలనుకుంటే ఎక్కడ లేని డబ్బూ సరిపోదు. రూ.3 లక్షల కవరేజీ ఉన్నా కూడా సంక్లిష్టమైన సర్జరీ లేదా తీవ్ర అనారోగ్యాల వంటి వాటి బారిన పడితే 5 రోజుల హాస్పిటల్ ఖర్చులకు మించి రావడం లేదు. పోనీ అలాగని వ్యక్తిగతంగా పొదుపు చేసి, ఆ మొత్తాన్ని వైద్యానికి ఉపయోగించుకుందామంటే అయ్యే పని కాదు. అందుకని సాధ్యమైనంత ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇటు పొదుపు మొత్తాలు భద్రంగా ఉంటాయి. అటు మీరెంతగానో ప్రేమించే కుటుంబానికీ భరోసా ఉంటుంది. రెండు రకాలుగా ప్రయోజనాలు... వైద్య బీమాను సాధ్యమైనంత ముందుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. మొదటిదేమంటే... పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన రిస్కులు తక్కువగానే ఉంటాయి, దీర్ఘకాలం పాటు ఎక్కువ కవరేజీ లభిస్తుంది. ఇక రెండోది.. ఎంత ముందుగా తీసుకుంటే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అదే నలభై ఏళ్లు వచ్చే దాకా ఆగి అప్పుడు తీసుకుంటే.. జీవిత కాలం తక్కువగా ఉంటుంది కనుక ప్రీమియం మొత్తం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎంత ముందయితే.. అంత మంచిది...! కంపెనీ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ.. సొంతంగా కూడా ఒకటి తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. ఒకవేళ మీరో, లేదా మీ కుటుంబసభ్యులో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు ఒకోసారి కంపెనీ ఇచ్చే పాలసీ మొత్తం చికిత్స ఖర్చులకు సరిపోకపోవచ్చు. అలాగే, మీరు రిటైరయిన తర్వాత కంపెనీ ఇచ్చే పాలసీ కవరేజీ కూడా ముగిసిపోతుంది. సొంతంగా తీసుకున్న పాలసీనే అప్పుడు అక్కరకొస్తుంది. లేకపోతే కష్టపడి పొదుపు చేసిన డబ్బును ఖరీదైన వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పోనీ అప్పుడు పాలసీ తీసుకుందామనుకుంటే 60 ఏళ్లు వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే కష్టమవుతుంది. ప్రస్తుతం చాలా మటుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డే-కేర్ ప్రొసీజర్స్ మొదలుకుని, మెటర్నిటీ, ఓపీడీ మొదలైన వాటన్నింటికీ కూడా కవరేజీ ఇస్తున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరకపోయినా కూడా జీవితంలో చాలా మటుకు వైద్యం ఖర్చులను ఎదుర్కొనేందుకు హెల్త్ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, పాలసీ తీసుకున్నాక నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే కొన్ని రకాల అనారోగ్యాలు, ప్రత్యేక ట్రీట్మెంట్స్కు కవరేజీ వర్తిస్తుంది. కనుక, సాధ్యమైనంత ముందుగా తీసుకుంటే.. వీలైనంత త్వరగా మెరుగైన కవరేజీ అందుకునేందుకు వీలవుతుంది. స్థూలంగా చెప్పాలంటే.. అరవయ్యో పడిలోకి వచ్చేదాకా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వైద్యం ఖర్చులకు భారీ మొత్తాలను జేబులో నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నా ప్రీమియం కూడా భారీగానే కట్టుకోవాల్సి వస్తుంది. కనుక, ఎంత ముందుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అంత మంచిది. - అమిత్ భండారి హెడ్ (క్లెయిమ్స్ అండర్‌రైటింగ్ విభాగం) ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐసీ -
మాటలే తప్ప చేతలేవీ?
విద్యకు అరకొర కేటాయింపులపై సర్కారును నిలదీసిన విపక్షాలు హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంలో సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించాయి. విద్యా వ్యవస్థ బలోపేతంతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్న జయశంకర్ ఒకవేళ బతికి ఉండుంటే ప్రభుత్వ తీరును చూసి ఎంతో బాధపడేవారని దుయ్యబట్టాయి. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు వంశీచందర్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు విద్యకు మొత్తం బడ్జెట్లో సగటు న 10.5-11శాతం చొప్పున నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఈ బడ్జెట్లో కేవలం 9.6 శాతం కేటాయింపులే చేసిందన్నారు. ఇందులోనూ పాఠశాల విద్యకు కే టాయించింది 7.8 శాతమేనన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది మొత్తం 61.78 లక్షలమంది విద్యార్థులుండగా, ఈ ఏడాది 59.51 లక్షలు మందే ఉన్నారని, సుమారు 2.27 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్లుగా మారారని చెప్పారు. రేషనలైజేషన్ పేరిట 4,213 పాఠశాలలను మూసివేయాలని సర్కారు చూస్తోందని, ఇది కచ్చితంగా పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24,861 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. డీఎస్సీ నిర్వహణ గురించి సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని స్కూళ్లు 14,884 ఉండగా, బడ్జెట్లో కేటాయించిన రూ.1.05 కోట్లు కనీసం 20 పాఠశాలలకు కూడా సరిపోవన్నారు. కేజీ టు పీజీ పథకం కోసం కేటాయిం చిన రూ. 75 కోట్లు రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల్లో సిబ్బంది వేతనాలకూ చాలవన్నారు. నిధులు లేక , అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరతతో యూనివర్సిటీలు స్టడీ సెంటర్లుగా మారే పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాల స్థాయిలో ఒకవేళ సిలబస్ మారిస్తే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి ప్రత్యేక పాఠ్యాంశాన్ని పొందుపరచాలని వంశీచందర్‌రెడ్డి కోరారు. విద్య, వైద్యం పటిష్టతకు చర్యలు చేపట్టండి: అక్బర్ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వపరంగా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మైనారిటీ విద్యాసంస్థలు, మదర్సాలు, ఉర్దూ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. మదర్సాలలోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తిచేశారు. పేదలకు అన్నిరకాల సౌకర్యాలు,సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాల కల్పనతోపాటు ఖాళీల భర్తీ తదితర చర్యలు తీసుకోవాలన్నారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 108, 104 సర్వీసులకు ఒప్పందం ప్రకారం రూ. 28.8 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.34.20 కోట్లు చెల్లిం చారని... ఇది ఒక కుంభకోణమని ఆరోపిం చారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకంటే జైళ్లలోనే పరిశుభ్రత మెరుగ్గా ఉందని, పేరుగాంచిన గాంధీ, ఉస్మానియా, కాకతీయ తదితర.. బోధనాసుపత్రుల్లోనూ డీజిల్ జనరేటర్ కొనేందుకు సర్కారు నిధులు ఇవ్వట్లేదని బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆరోపించారు. -
కుప్పానికి కన్నీళ్లే ?
ఏడాదిలోగా హంద్రీ-నీవా నీళ్లిస్తానన్న బాబు బడ్జెట్లో మాత్రం మొక్కుబడి కేటాయింపులు అవసరం *1194 కోట్లు, కేటాయింపులు * 212 కోట్లే గాలేరు - నగరి, తెలుగుగంగదీ అదే పరిస్థితి బాబు వంచనపై విమర్శల వెల్లువ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించారు. రాష్ట్ర పరిధిలో వందలాది హామీలు ఇవ్వగా, సొంత జిల్లాకు సంబంధించి దాదాపు 30కిపైగా హామీలు ఇచ్చారు. జిల్లాలో కరువు నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరింది. హంద్రీ-నీవా కాలువను పూర్తిచేసి జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి పలు దఫాలు హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలల పాలన కాలంలో బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తాజా బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి హామీలు నెరవేర్చుతారనుకుంటే అదీ లేదు. బడ్జెట్ చూశాక ఆ ఆశ ఆవిరై పోయింది. 2015-16కు గాను గురువారం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి కానరావడంలేదు. రాష్ట్ర ప్రజలనే కాదు సొంత జిల్లా ప్రజలను సైతం చంద్రబాబు వంచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తుది కేటాయింపులు ఎన్నిసార్లు?
అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన క్యాట్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను ఎన్నిసార్లు తుది కేటాయింపులు చేస్తారని కేంద్రాన్ని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) బుధవారం నిలదీసింది.ఐపీఎస్ కేడర్ తాత్కాలిక కేటాయింపులను సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్ అన్వరుల్ హుడా, టీపీ దాస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బి.వి.రావు, మిన్నీ మాథ్యూస్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ల తరఫున షఫీకుజ్జమాన్ వాదనలు వినిపిస్తూ.. ఐపీఎస్ కేడర్‌ను కేటాయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసేనాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని తెలిపారు. జూన్ 2ను అపాయింటెడ్ డేగా నిర్ణయించాక.. మే 30న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 31న నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు.మార్గదర్శకాలు లేకుండానే కేటాయింపులు చేసిందన్నారు. కేంద్రం తరఫు న్యాయవాది జయప్రకాశ్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే కేంద్రం తుది జాబితా ప్రకటించిందని, అభ్యంతరాల నిమిత్తం జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నిసార్లు తుది కేటాయింపులు జరుపుతారని ప్రశ్నిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
యూనియన్ బ్యాంక్ లాభం 27% డౌన్
క్యూ4లో రూ. 579 కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 579 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 789 కోట్లతో పోలిస్తే ఇది 27% క్షీణత. మొండిబకాయిలకు ప్రొవిజన్లు పెరగడం, వడ్డీయేతర ఆదాయం తగ్గడం లాభాలను దెబ్బతీసినట్లు బ్యాంకు చైర్మన్ అరుణ్ తివారీ పేర్కొన్నారు. బకాయిలకు కేటాయింపులు రూ. 655 కోట్ల నుంచి రూ. 920 కోట్లకు పెరిగాయి. వడ్డీయేతర ఆదాయం రూ. 875 కోట్ల నుంచి రూ. 775 కోట్లకు తగ్గింది. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.61% నుంచి 2.33%కు పెరిగాయి. ఈ కాలంలో రూ. 320 కోట్లమేర మొండి రుణాలను విక్రయించింది. వడ్డీ ఆదాయం 3.6% అప్ క్యూ4లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.6% పుంజుకుని రూ. 2,052 కోట్లను తాకగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.62%గా నమోదయ్యాయి. ఇదే కాలానికి బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 7,501 కోట్ల నుంచి రూ. 8,445 కోట్లకు ఎగసింది. ఇక పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు నికర లాభం 21%పైగా క్షీణించి రూ. 1,696 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు దాదాపు 9% పతనమై రూ. 135 వద్ద ముగిసింది.