విద్యకు అరకొర కేటాయింపులపై సర్కారును నిలదీసిన విపక్షాలు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంలో సర్కారు మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించాయి. విద్యా వ్యవస్థ బలోపేతంతోనే సమాజాభివృద్ధి సాధ్యమన్న జయశంకర్ ఒకవేళ బతికి ఉండుంటే ప్రభుత్వ తీరును చూసి ఎంతో బాధపడేవారని దుయ్యబట్టాయి. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు వంశీచందర్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు విద్యకు మొత్తం బడ్జెట్‌లో సగటు న 10.5-11శాతం చొప్పున నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఈ బడ్జెట్‌లో కేవలం 9.6 శాతం కేటాయింపులే చేసిందన్నారు. ఇందులోనూ పాఠశాల విద్యకు కే టాయించింది 7.8 శాతమేనన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది మొత్తం 61.78 లక్షలమంది విద్యార్థులుండగా, ఈ ఏడాది 59.51 లక్షలు మందే ఉన్నారని, సుమారు 2.27 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్లుగా మారారని చెప్పారు. రేషనలైజేషన్ పేరిట 4,213 పాఠశాలలను మూసివేయాలని సర్కారు చూస్తోందని, ఇది కచ్చితంగా పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నమేనని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 24,861 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. డీఎస్సీ నిర్వహణ గురించి సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని స్కూళ్లు 14,884 ఉండగా, బడ్జెట్‌లో కేటాయించిన రూ.1.05 కోట్లు కనీసం 20 పాఠశాలలకు కూడా సరిపోవన్నారు. కేజీ టు పీజీ పథకం కోసం కేటాయిం చిన రూ. 75 కోట్లు రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల్లో సిబ్బంది వేతనాలకూ చాలవన్నారు. నిధులు లేక , అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కొరతతో యూనివర్సిటీలు స్టడీ సెంటర్లుగా మారే పరిస్థితి నెలకొందన్నారు. పాఠశాల స్థాయిలో ఒకవేళ సిలబస్ మారిస్తే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి ప్రత్యేక పాఠ్యాంశాన్ని పొందుపరచాలని వంశీచందర్‌రెడ్డి కోరారు.
విద్య, వైద్యం పటిష్టతకు చర్యలు చేపట్టండి: అక్బర్
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వపరంగా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మైనారిటీ విద్యాసంస్థలు, మదర్సాలు, ఉర్దూ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. మదర్సాలలోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తిచేశారు. పేదలకు అన్నిరకాల సౌకర్యాలు,సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాల కల్పనతోపాటు ఖాళీల భర్తీ తదితర చర్యలు తీసుకోవాలన్నారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 108, 104 సర్వీసులకు ఒప్పందం ప్రకారం రూ. 28.8 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.34.20 కోట్లు చెల్లిం చారని... ఇది ఒక కుంభకోణమని ఆరోపిం చారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకంటే జైళ్లలోనే పరిశుభ్రత మెరుగ్గా ఉందని, పేరుగాంచిన గాంధీ, ఉస్మానియా, కాకతీయ తదితర.. బోధనాసుపత్రుల్లోనూ డీజిల్ జనరేటర్ కొనేందుకు సర్కారు నిధులు ఇవ్వట్లేదని బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆరోపించారు.
మాటలే తప్ప చేతలేవీ?
Published Wed, Mar 25 2015 1:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement