కేటాయింపులు ఘనం..ఖర్చుశూన్యం | Government and opposition touchy | Sakshi
Sakshi News home page

కేటాయింపులు ఘనం..ఖర్చుశూన్యం

Published Fri, Mar 27 2015 2:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కేటాయింపులు ఘనం..ఖర్చుశూన్యం - Sakshi

కేటాయింపులు ఘనం..ఖర్చుశూన్యం

  • ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు
  •  బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి
  •  అన్నీ గారడీ లెక్కలని కాంగ్రెస్ విమర్శ   
  •  బడ్జెట్ వాస్తవ
  •  దూరమంటూ వాకౌట్   
  •  ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం
  • సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ లెక్కలన్నీ తప్పుల తడకలేనని.. గత బడ్జెట్‌లో లక్షా ఆరు వేల కోట్ల కేటాయింపులు చూపి, చివరికి సగం నిధులను కూడా ఖర్చు చేయలేదని ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ ఏడాది బడ్జెట్ కూడా వాస్తవాలకు దూరంగా ఉందంటూ మండిపడ్డాయి. గురువారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతేడాది బడ్జెట్‌తో పాటు తాజాగా ప్రవేశపెట్టిన (2015-16) బడ్జెట్ అంశాలపై సర్కారును నిలదీస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించింది.
     
    అవసరం లేనిచోట తగ్గించాం

    ద్రవ్య వినిమయ బిల్లుపై సాగిన చర్చలో మంత్రి ఈటెల రాజేందర్ సుదీర్ఘంగా మాట్లాడారు. రూ. 1.15 లక్షల కోట్లతో 2015-16 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణాలను, ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యతాంశాలను సభకు వివరించారు. తొలి బడ్జెట్‌కు సంబంధించి తొమ్మిది నెలల కాలంలో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 65 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో అవసరమైన చోట కేటాయింపులు పెంచి, అవసరం లేని చోట తగ్గించామన్నారు.

    రూ. 900 కోట్ల పింఛన్ల బడ్జెట్‌ను రూ. 4వేల కోట్లకు పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఈటెల పేర్కొన్నారు. బడ్జెట్‌లో 18 శాతం (రూ. 9,150 కోట్లు) వ్యవసాయానికే కేటాయించినట్లు తెలిపారు. 89.14 లక్షల మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామని చెప్పారు. విద్యుత్ మిగులు సాధించేదిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన అడ్వోకేట్ల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని, మరమగ్గాల కార్మికుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
     
    దళితులను ముంచారు..


    ఎస్సీ సబ్‌ప్లాన్ కింద దళితులకు అందాల్సిన నిధుల్లో భారీగా కోత విధించిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుకే దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 2014-15 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం కింద రూ. 48 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. కేవలం రూ. 20,010 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. వాస్తవ వ్యయానికి సంబంధించిన లెక్కలను చివరిరోజైనా సభలో ప్రవేశపెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవాలకు భిన్నంగా ఉన్న ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.

    ఇక బడ్జెట్ అంటే జీవం లేని అంకెలు కాదని తన ప్రసంగంలో చెప్పిన ఆర్థిక మంత్రి గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత జీవం ఉందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరువు నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించని ప్రభుత్వం.. సెక్రటేరియట్, రవీంద్ర భారతిని కూల్చేందుకు మాత్రం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. కేజీ టు పీజీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమైన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడం పట్ల ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
     
    ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

    బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించింది. గురువారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలపాలని మంత్రి ఈటెల కోరగా... రూ.1.15 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement