ప్రతిపక్షాల గొంతునొక్కుతారా?
హైదరాబాద్: శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. బడ్జెట్ లోపాలను ఎత్తిచూపుతారన్న భయంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు సయితం టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తప్పుబడుతున్నా.. సమాధానం ఇవ్వలేని స్థితిలో అధికార పక్షం వుంది. ప్రజలు,రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేసీఆర్‌పై సభ ఉల్లంఘన నోటీసు స్పీకర్‌కు ఇచ్చిన చర్యలు లేవు. అధికారం శాశ్వతం కాదు..న్యాయబద్ధంగా వ్యవహరించాలి. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. -టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.ఈ మిల్లు మూతపడటంతో ప్రతక్షంగా,పరోక్షంగా సుమారు 5వేల మంది ఉద్యోగులు, కార్మికులు జీవనోపాధి కొల్పోయారు.75 ఏళ్ల క్రితం స్థాపించిన మిల్లుపై యాజమాన్యం ఇప్పటికే రూ.400 కోట్ల రుణం తీసుకుంది. మరో రూ. 200 కోట్ల బ్యాంకు రుణం లేనిదే తిరిగి ఉత్పత్తి ప్రారంభించలేమని యాజమాన్యం పేర్కొనడం శోచనీయం. మరోవైపు రైతులకు రూ.25 కోట్లు, అటవీ శాఖకు రూ.29 కోట్లు, విద్యుత్‌కు రూ.5కోట్లు, నీటికి రూ.4 కోట్లు, మున్సిపాలిటికి రూ. 8కోట్లు బకాయి పెట్టింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.6 కోట్లు విడుదలచేసి సీఎం కేసీఆర్ కొంత వరకు ఆదుకున్నారు.
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ప్రజాకోర్టులో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల, రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేవలం ‘బంగారు తెలంగాణ’ పేరుతో రాజకీయ సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తోంది. ప్రజల, రైతుసమస్యలతోపాటు అభివృద్ధి పనులపై ప్రభుత్వాన్ని ప్రజాకోర్టు కీడ్చి నిలదీస్తాం. పోలవరం ముంపు గ్రామాలపై మాట తప్పింది.ప్రతిపక్షాలు విద్యుత్ సమస్యపై కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ కోసం సబ్‌కమిటీ ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తున్నారు. - కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
వికారాబాద్-మక్తల్ రైల్వేలైన్‌పై లేఖ రాయాలి
వికారాబాద్-మక్తల్ రైల్వే లైన్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్రానికి లేఖ రాయాలి. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సగం శాతం వాటా భరించేందుకు అంగీకరించినప్పటికీ, ఎన్నికల కారణంగా జీవో విడుదల కాలేదు. ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలి.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి వేతనాలను పెంచి ఉద్యోగాలను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. - సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య
పీఆర్‌సీపై స్పష్టత ఇవ్వాలి
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులకు ఇంకా పీఆర్‌సీ అమలు చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. - టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
మీడియా పాయింట్
Published Sun, Nov 16 2014 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement