చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన లభించింది. అధికార బీజేపీ ప్రశంసించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వైద్య సంఘం నిట్టూర్పులు వెళ్లగక్కింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాకాంక్షను నెరవేర్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పలువురు స్పందించారు. బడ్జెట్‌లో అన్ని అంశాలను ప్రస్తావించారని, నిధులను కేటాయించారని తమిళిసై అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో వాటికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని తెలిపారు.
ముఖ్యంగా రైతు పక్షపాతి బడ్జెట్‌గా రూపొందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ప్రకటించడం కాదు అమలు చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కంటితుడుపుగా అంకెలు చూపితే ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు.
ప్రజారోగ్యానికి ప్రధాన్యత ఏదీ
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పించడంలో కేంద్రబడ్జెట్ విఫలమైందని డాక్టర్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్విటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఆర్ రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. వైద్య ఖర్చుల కారణంగా ప్రతి ఏటా ఆరుకోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు దిగజారుతున్నారని కేంద్రం విడుదల చేసిన జాతీయ సంక్షేమ సిద్ధాంతం-2015 తేటతెల్లం చేసిందని అన్నారు. ప్రజారోగ్యశాఖకు 2013-14లోనే రూ.1,93,043 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో కేవలం రూ.1,51, 581 కోట్లు కేటాయింపు జరగడం విచారకరమన్నారు.
ప్రజావైద్యశాలను బలోపేతం చేయడానికి మారుగా ప్రయివేటు వైద్యశాలకు మేలు చేకూరేలా ఆరోగ్యబీమాపై నిర్ణయాలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. బీమా పాలసీలు ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చడం లేదని అనేక సర్వేల్లో తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు. వైద్యఖర్చులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో లక్ష రూపాయల బీమా సౌకర్యం వృథా అని అన్నారు.
మొత్తం మీద కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. గ్రామీణ వికాశం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేంద్రబడ్జెట్‌ను స్వాగతిస్తున్నానని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ ఏ వేలయ్యన్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు, తీసుకున్న నిర్ణయాలు భారత దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయని చెప్పారు.
బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
Published Tue, Mar 1 2016 3:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement