union budget 2016-17
-
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం
రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు. -
నిరసనల మధ్య జైట్లీ ప్రసంగం
స్మృతి ఇరానీపై హక్కుల తీర్మానం కోసం విపక్షాల ఆందోళన గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ న్యూఢిల్లీ :బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున లోక్‌సభలో మునుపెన్నడూ లేని అసాధారణ పరిస్థితుల్లో.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బలవంతంగా ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది. సోమవారం సభలో బడ్జెట్ ప్రసంగం చేయటానికి జైట్లీ లేచి నిలుచోగానే.. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ తాము ఇచ్చిన హక్కుల తీర్మానాల అంశాన్ని కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లేవనెత్తారు. ఆ అంశం పరిశీలనలో ఉందని స్పీకర్ సుమిత్రామహాజన్ చెప్పినప్పటికీ.. వారు దానిని ప్రస్తావిస్తూనే ఉండటంతో గందరగోళం తలెత్తింది. బడ్జెట్ సమయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుధ్వజమెత్తారు. మధ్యలో కూర్చుని ప్రసంగించిన జైట్లీ... లేత నీలి రంగు కుర్తాపై, కొంత ముదురు నీలి రంగు జాకెట్ ధరించిన జైట్లీ.. గంటన్నరకు పైగా ప్రసంగం కొనసాగించారు. ఆయన 20 నిమిషాలు ప్రసంగించాక.. కూర్చుని ప్రసంగాన్ని కొనసాగించవచ్చని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌కు తొమ్మిది మూల స్తంభాలు... భారతదేశాన్ని రూపాంతరీకరించాలన్న తమ అజెండాలో భాగంగా.. తొమ్మిది విభిన్న మూల స్తంభాలపై ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు జైట్లీ వివరించారు. అవేమిటంటే... 1) వ్యవసాయం - రైతుల సంక్షేమం, 2) గ్రామీణ రంగం, 3) ఆరోగ్యపరిరక్షణ సహా సామాజిక రంగం, 4) విద్య - నైపుణ్యాలు - ఉపాధి కల్పన, 5) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు, 6) ఆర్థిక రంగ సంస్కరణలు, 7) పరిపాలన - వాణిజ్యం సులభతరం చేయటం, 8) ఆర్థిక క్రమశిక్షణ, 9) పన్ను సంస్కరణలు. గ్రామీణ ఆదాయం, మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ సంక్షోభం అతి పెద్ద సవాలంటూ.. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, గ్రామీణ ఆదాయాన్ని పెంపొం దించటం కేంద్ర బడ్జెట్ లక్ష్యాలని జైట్లీ తెలిపారు. బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే వర్గీకరణను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తొ లగించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రభుత్వ వ్యయం లో రెవెన్యూ, పెట్టుబడి (కేపిటల్) వర్గీకరణపై మ రింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను తొలగిస్తామని.. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఒకే తరహాలో ఉండేలా రాష్ట్రాల ఆర్థిక శాఖలతో కలిసి పనిచేస్తామని జైట్లీ తెలిపారు. రాహుల్ సూచనకు సరే.. ♦ గత యూపీఏ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పాడైపోయిన స్థితిలో తమకు అప్పగించిందని, ఎన్డీఏ ప్రభుత్వం దానిని సరిచేసిందని చెప్తూ జైట్లీ.. ఁకష్టీ చలానే వాలో నే జబ్ దీ పట్వార్ హమే.. ఇన్ హాలాత్ మే ఆతా హై దరియా పార్ కర్నా హమే* (ఓడ తెడ్డును మా చేతికి అందించినపుడు.. ఈ పరిస్థితుల్లో నదిని దాటటం ఎలాగో మాకు తెలుసు) అటూ ఉర్దూ కవితను ఉదహరించారు. ♦ ఒక సందర్భంలో తమను ఆకాశ (ఆస్మానీ) శక్తులు, రాజ్య (సుల్తానీ) శక్తులు ఇబ్బందులు పెట్టాయని జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే దానిని వివరించలేదు. ♦ దళిత పారిశ్రామికవేత్తల గురించి జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించినపుడు.. కాంగ్రెస్ సభ్యులు దళిత విద్యార్థి రోహిత్ వేముల అంశాన్ని లేవనెత్తటం వినిపించింది. ♦ బ్రెయిలీ పేపర్‌పై దిగుమతి సుంకాన్ని తొలగించాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచనలను తాను అంగీకరించినట్లు జైట్లీ పేర్కొన్నపుడు.. సభలోనే ఉన్న రాహుల్ నవ్వుతూ కనిపించారు. బడ్జెట్ హైలైట్స్ ⇔ ఎఫ్‌డీఐ పాలసీలో గణనీయమైన మార్పులు చేయటం ద్వారా సాధారణ బీమా కంపెనీల లిస్టింగ్‌కు, బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలకు తెర తీయటం. ⇔ సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన ⇔ మొత్తం గ్రామీణ రంగానికి రూ.87,675 కోట్ల కేటాయింపు. ⇔ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ⇔ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు ⇔ విద్య, ఆరోగ్యం, సామాజిక రంగానికి రూ.1,51,581 కోట్ల కేటాయింపు. ⇔ 2016-17లో ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమం కింద 3000 స్టోర్ల ఏర్పాటు. ⇔ ఫైనాన్షియల్ కంపెనీల వివాదాల పరిష్కారానికి సమగ్ర నియమావళి. ⇔ ముద్ర యోజన కింద మంజూరీ లక్ష్యం రూ.1.8 లక్షల కోట్లకు పెంపు. ⇔ ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఈడీఏ, నాబార్డ్‌ల ద్వారా రూ. 31,300 కోట్ల ఇన్ఫ్రా బాండ్లు ⇔ 2017 మార్చి నాటికి 3 లక్షల రేషన్ డిపోల్లో ఆటోమేషన్. ⇔ స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కంపెనీల చట్టం సవరణ. ⇔ ఏప్రిల్, 2016 నుంచి మార్చి 2019 మధ్య ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు మూడు నుంచి ఐదేళ్ల పాటు లాభాల్లో పూర్తి మినహాయింపు ⇔ సంవత్సరానికి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ గనక తీసుకుంటే మొత్తం డివిడెండ్‌పై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇔ రూ.2 లక్షలకు పైబడి ఏవైనా వస్తువులు, సేవలు కొన్నా... రూ.10 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లు కొన్నా... అక్కడికక్కడే 1 శాతం టీడీఎస్ ⇔ ఆప్షన్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.017 నుంచి 0.05కు పెంపు ⇔ అన్ని సేవలపై రైతులు, వ్యవసాయ సంక్షేమం నిమిత్తం 0.5 శాతం సెస్సు ⇔ రూ.1000 మించిన రెడీమేడ్ గార్మెంట్లపై ఎక్సయిజు పన్ను 2 శాతానికి పెంపు ⇔ బీడీ మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం 15 శాతానికి పెంపు. ⇔ బ్లాక్‌మనీ వెల్లడికి 4 నెలల సమయం. ఆ బ్లాక్‌మనీపై 45% పన్ను, వడ్డీ. ⇔ బొగ్గు, లిగ్నైట్‌లపై క్లీన్ ఎనర్జీ సెస్ టన్నుకు 200 నుంచి రూ. 400కు పెంపు. ⇔ 2017-18 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 3 శాతం ⇔ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ. 25 వేల కోట్లు -
నువ్వు నేను జైట్లీ
చదివింది ఢిల్లీ పార్లమెంట్లో అయినా ఈ సారి బడ్జెట్ తిరిగింది మాత్రం మన ఊరి చుట్టూనే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేరుగా ఊళ్లోకొచ్చేశారు. గ్రామీణ రంగానికి భారీ కేటాయింపులతో పాటు... పంచాయతీలు, మున్సిపాలిటీలను పరిపుష్టం చేయడానికి ఏకంగా 2.87 లక్షల కోట్లు కేటాయించారు. రెండేళ్లలో కరెంటు లేని గ్రామం ఉండదని, మూడేళ్లలో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కంప్యూటర్ విద్య అందిస్తామని హామీ ఇచ్చారు జైట్లీ. ప్రతి గ్రామానికీ రోడ్డు వేయటమే కాక... నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌పోర్టులూ వాడకంలోకి తెస్తారట. ఇవన్నీ జరిగితే.. మన ఊరు... ఇదిగో ఈ చిత్రంలోలానే పచ్చగా కళకళలాడుతుంది. నిరుపేదకు సుస్తీ చేస్తే..? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైతే వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెచ్చారు. మరి మిగతా రాష్ట్రాల సంగతో!!. ఒకరకంగా ఇపుడిది దేశమంతటా విస్తరించనుంది. కుటుంబానికి లక్ష రూపాయల వరకూ బీమా కల్పిస్తారు. వృద్ధులకైతే ఇది 1.3 లక్షలు. అంతేకాదు! చౌక మందుల కోసం మరిన్ని జన ఔషధి స్టోర్లొస్తాయి. కిడ్నీ వ్యాధుల బారినపడ్డవారి సంఖ్య పెరగటంతో జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ కూడా రాబోతోంది. పెద్దలకు గౌరవం ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచి పింఛను కోసం దాచుకుని... తీరా తీసుకునేటపుడు పన్ను కట్టాలంటే... అదీ రిటైరైన సమయంలో!! ఆ బాధ మామూలుగా ఉండదు. జైట్లీకి అర్థమై ఉండొచ్చు. ఎన్‌పీఎస్‌లో ఆ భారం తొలగించారు. పింఛనుకోసం కట్టే బీమా పాలసీలపై కూడా సేవా పన్ను తగ్గించారు. కట్టెలపొయ్యి అక్కర్లేదిక.. గ్యాస్ పొయ్యి ఉన్నోళ్లంతా గొప్పోళ్లు కాదిక. ప్రతి ఒక్కరికీ గ్యాస్ ఇవ్వటానికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కోటిన్నర మందికి... ఐదేళ్లలో 6 కోట్ల మందికి గ్యాస్ పొయ్యిలందుతాయి. ఆధార్ ద్వారా పథకాలన్నీ నేరుగా చేరేలా దానికి చట్టబద్ధత కల్పిస్తారు. ఊళ్లలోకి విదేశీ నిధులు కూడా..! వ్యవసాయానికి విదేశీ నిధుల దన్ను కూడా దొరకబోతోంది. ఎందుకంటే దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తి, తయారీ కార్యకలాపాలకు 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తారు. అది కూడా నేరుగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డే అనుమతిస్తుంది. ఆహారధాన్యాల ధరల్లో హెచ్చుతగ్గుల్ని నియంత్రించడానికి రూ.900 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా. ఉద్యోగాల కోసం.. ఉద్యోగుల కోసం కంపెనీలు పీఎఫ్ భారం లేకుండా కొత్తగా ఉద్యోగాలివ్వటానికి... మూడేళ్ల పాటు కేంద్రమే యాజమాన్య పీఎఫ్ వాటాను చెల్లిస్తుంది. యువతలో స్కిల్స్ అభివృద్ధి చేయటానికి శిక్షణ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. సొంత కంపెనీలు పెట్టేలా ప్రోత్సహించడానికి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులూ రానున్నాయి. స్కూల్ చలే హమ్.. స్కూలు మారినప్పుడల్లా ఓ సర్టిఫికెట్. ఫస్టొస్తే ఒకటి... సెకండొస్తే మరొకటి. మార్కుల జాబితాలూ అంతే! స్కూళ్లు మారుతున్నపుడు, జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లినపుడు... తీసుకెళ్లాల్సిందే. ఇక బీమా పాలసీల్లా, కంపెనీ షేర్లలా వీటినీ డిజిటల్ రూపంలో దాచుకోవచ్చు. దీనికి డిజిటల్ డిపాజిటరీ వస్తోంది. ఇంకా 62 నవోదయ స్కూల్స్ వస్తాయి. రూ.1000 కోట్లతో ఉన్నత విద్యకు ఫైనాన్సింగ్ ఏజెన్సీ కూడా పెడతారు. జై కిసాన్.. నిజం! ఈ బడ్జెట్లోనైతే రైతే రాజు. పంట పండుతుందో లేదోననే భయం ఉన్నా... పథకాల పంట మాత్రం పండింది. నష్టపోతే ఆదుకోవటానికి బీమా పథకం. 28.5 లక్షల ఎకరాల కోసం సాగునీటి పారుదల పథకం. బోర్లు ఎండి పోకుండా.. భూగర్భ జలవనరుల పథకం. సేంద్రీయ సాగు ప్రోత్సాహానికి మరో పథకం. దీర్ఘకాలంగా సాగుతూ ఉన్న 89 ప్రాజెక్టులిక శరవేగంగా పూర్తవుతాయి. వర్షాభావ ప్రాంతాల్లో 5 లక్షల చెరువులు, బావులు తవ్వుతారు. సేంద్రీయ ఎరువుల తయారీకి 10 లక్షల కంపోస్ట్ గుంతల్నీ ఏర్పాటు చేస్తారు. వచ్చే మార్చికల్లా 14 కోట్ల భూ కమతాలకూ భూసార ఆరోగ్య కార్డులొస్తాయి. చిన్నకంపెనీ పెద్ద రిలీఫ్ ఊళ్లలో ఉన్నా, సిటీల్లో ఉన్నా... చిన్న కంపెనీలు ఇక ఖాతా పుస్తకాలు రాయక్కర్లేదు. టర్నోవరు మాత్రం రూ. 2 కోట్లలోపుంటే చాలు. డాక్టరుతో సహా వృత్తి నిపుణులకూ ఈ రిలీఫ్ ఇచ్చారు. వారి సంపాదన ఏడాదికి 50 లక్షలు మించకూడదు. చిన్న ఉద్యోగికి ఊరటే... నెల జీతం 41వేలు లోపుంటే.. ఏడాదికి మరో 3వేలు మిగులుతుంది. కాస్త రిబేటు పెంచారు లెండి. హెచ్ఆర్ఏ కంపెనీ ఇవ్వకపోతే... అలాంటివారికి కూడా కాస్త ఊరటనిచ్చారు. పెరిగిన ధరలతో పోలిస్తే ఇదేం మూలకనే పెదవి విరుపు చిరుద్యోగి సొంతం మరి. కారు మబ్బులు.. ఊళ్లోకి రాకుండా దూరంగా వె ళ్లే కారును, శ్రీమంతుల్ని కూడా జైట్లీ వదల్లేదు. కార్లపై సెస్సులు వేసి ధరలు పెంచారు. ఏటా రూ.కోటి ఆదాయం దాటే వారిపై మరో 3 శాతం సర్‌చార్జీ వడ్డించారు. పెట్టుబడులపై డివిడెండ్లు అందుకునేవారినీ బాదారు. ‘పాడికీ పథకాలు’ మన ఒంగోలు గిత్తల్లా కొన్ని పశు జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే వీటికి జాతీయ జినోమిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పాత్ర, ఈ-పశుధన్ హాత్ వంటి పథకాలనూ ప్రకటించారు. -
తయారీ సంస్థలకు తోడ్పాటు
పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించటం, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేందుకు బడ్జెట్లో కొత్త తయారీ యూనిట్లకు తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ విధించేలా ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చి 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త తయారీ యూనిట్లకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతమే (సర్‌చార్జి, సెస్సులు అదనం) ఉంటుంది. దీన్ని పొందాలంటే ఆయా సంస్థలు.. లాభాలు, పెట్టుబడుల ఆధారిత డిడక్షన్లు మొదలైనవి క్లెయిమ్ చేసుకోకూడదు. మరోవైపు, రూ. 5 కోట్ల టర్నోవరు ఉండే చిన్న యూనిట్లకు దీన్ని 30 శాతం నుంచి 29 శాతానికి (సర్‌చార్జి, సెస్సు అదనం) తగ్గించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను నాలుగేళ్లలో దశలవారీగా 25 శాతానికి తగ్గించే దిశగా చర్యలు ప్రతిపాదించినట్లు చెప్పారు. కొత్త సెజ్ యూనిట్లు.. సెక్షన్ 10ఏఏ ప్రయోజనాలు పొందాలంటే 2020 మార్చి 31 నాటికల్లా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. -
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట
దేశంలో ఉపాధి కల్పన పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్త ఉద్యోగులకు కంపెనీల బదులు ప్రభుత్వమే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కు 8.33 శాతం మొత్తాన్ని జమచేయనున్నది. ఉపాధి కల్పనకు ఊతమిచ్చేదిశగా ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్రతిపాదన చేసారు. ఉద్యోగి నియామకం తర్వాత మూడేళ్ల వరకూ ప్రభుత్వం ఈ చెల్లింపు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. రూ. 15,000లోపు వేతనంతో నియమించుకునే కొత్త ఉద్యోగులకు 8.33 శాతం ఈపీఎఫ్‌ను కంపెనీల తరపున ఇక మీదట ప్రభుత్వమే చెల్లించడం కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. కాగా ఉపాధి పెరుగుదల కోసం 2016-17 చివరి నాటికి 100 మోడల్ కెరీర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజెస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. -
కరెన్సీ కింగ్‌లు
120 కోట్ల మంది కోసం ప్రవేశపెట్టే దేశ బడ్జెట్ ప్రపంచంలోని మొదటి నలుగురు కుబేరుల ఆస్తితో దాదాపు సమానం. టాప్ 5 బిలియనీర్ల జాబితా పరిశీలిస్తే.. ( రూ. కోట్లలో) బిల్‌గేట్స్ 5,38,560 అమెరికాకు చెందిన బిల్‌గేట్స్ మెక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. 1995 -2006 మధ్య, 2009లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. కార్లొస్ స్లిమ్ హెలు 5,24,280 మెక్సికోకు చెందిన ఈ టెలికం దిగ్గజం 2010-13 మధ్య ఫోర్బ్స్ ధనవంతుల్లో చోటు దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ ఆఫ్ మెక్సికోగా పేరు పొందారు. వారెన్ బఫెట్ 4,94,360 ప్రపంచంలో విజయవంత మైన పెట్టుబడిదారుల్లో మొదటిస్థానం అమెరికాకు చెందిన బఫెట్దే... బెర్క్‌షైర్ హతవేకు ఈయన ఛైర్మన్, సీఈవోగా ఉన్నారు. అమాన్షియో ఓర్టెగా 4,38,600 స్పెయిన్‌కు చెందిన అమాన్షియో.. ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూపునకు వ్యవస్థాపక ఛైర్మన్.. అక్టోబర్, 2015న ఫోర్బ్స్ బిలియనీర్లలో మొదటిస్థానం దక్కించుకున్నారు. లారీ ఎల్లిసన్ 3,69,240 అమెరికాకు చెందిన ఎల్లిసన్ ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీఓగా ఉన్నారు. ఒరాకిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన సీఈవోగానూ పనిచేశారు. -
రూ. 10,000 కోట్లు రాయితీల్లో కోత ఇదీ...
ఆహార సబ్సిడీ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.1.34 లక్షల కోట్లకు న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు. 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు. 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు. అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు. ♦ వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు. ♦ యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు సబ్సిడీగా పేర్కొన్నారు. ♦ అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు. ♦ పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు. -
మరిన్ని సేవలపై పన్ను పోటు...
న్యూఢిల్లీ: కొన్ని సర్వీసులకు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను మినహాయింపులను ఉపసంహరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్నింటికి మాత్రం మినహాయింపులను ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్లు.. ఇతర అడ్వొకేట్లకు అందించే సర్వీసులపై 14 శాతం పన్ను విధించనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే ప్రజా రవాణా సేవలు అందించే స్టేజ్ క్యారియర్లను నెగటివ్ లిస్టు నుంచి తొలగించారు. ఈ సర్వీసులపై జూన్ 1 నుంచి 5.6% సర్వీస్ ట్యాక్స్ విధించనున్నట్లు జైట్లీ తెలిపారు. మరోవైపు, సేవా పన్నుల ఎగవేతల్లో ప్రాసిక్యూషన్‌కు సంబంధించి బడ్జెట్లో కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటి ప్రకారం పన్నులు వసూలు చేసి, వాటిని ఖజానాకు జమ చేయని పక్షంలోనే పన్ను చెల్లింపుదారుపై చర్యలకు అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూషన్‌కు అర్హమయ్యే ఎగవేత పరిమాణాన్ని రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచారు. టెలికాం స్పెక్ట్రమ్‌ను బదలాయించడం సర్వీసు పరిధిలోకి వస్తుందని, దీనికి సేవాపన్ను వర్తిస్తుందని జైట్లీ స్పష్టంచేశారు. మినహాయింపులూ ఉన్నాయ్.. అందరికీ ఇళ్లు (హెచ్ఎఫ్ఏ), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తదితర పథకాల కింద చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులపై 5.6% సర్వీస్ ట్యాక్స్‌ను ఎత్తివేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఏవైలో భాగంగా 60 చ.మీ. కన్నా తక్కువ కార్పెట్ ఏరియా ఉండే హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా మార్చి 1 నుంచి ఇది వర్తిస్తుంది. అటు, సెబీ, ఐఏఆర్‌డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ తదితర నియంత్రణ సంస్థల సర్వీసులపైనా ఏప్రిల్ 1 నుంచి 14% సర్వీస్ ట్యాక్స్‌ను కూడా ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ వంటి వాటితో బాధపడే వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘నిరామయా’ ఆరోగ్య బీమా పథకంలో భాగమైన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల సర్వీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సేవా పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై 14% సర్వీస్ ట్యాక్స్ ఉంటోంది. మరిన్ని విశేషాలు .. ♦ నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన భాగస్వామ్య సంస్థలు అందించే సేవలపై ట్యాక్స్‌ను ఉపసంహరించారు. ఇది ప్రస్తుతం 14 శాతంగా ఉంది. ♦ దేశీ షిప్పింగ్ సంస్థలకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలోని కొన్ని కోర్సులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ నిర్దిష్ట పరిమితికి మించి సెంట్రల్ ఎక్సైజ్ చెల్లించాల్సిన వారు దాఖలు చేయాల్సిన రిటర్నుల సంఖ్యను ఏకంగా 27 నుంచి 13కి తగ్గించారు. ఇకపై నెలకొకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు, వార్షికంగా ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెలవారీ రిటర్నులకు ఈ-ఫైలింగ్ విధానం ఉండగా.. త్వరలో వార్షిక రిటర్నులకు కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. అటు సర్వీస్ ట్యాక్స్ అసెసీలు వార్షికంగా మూడు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
వెన్నముకకు దన్ను
♦ వ్యవసాయ రంగానికి... రూ. 44,485 కోట్లు ♦ బ్యాంకుల ద్వారా పంట రుణాల లక్ష్యంరూ. 9,00,000 కోట్లు ♦ పంటల బీమా పథకానికి..రూ.5,500కోట్లు ♦ కొత్తగా సాగులోకి..28.5లక్షల ఎకరాలు ♦ వచ్చే ఏడాది కల్లా 14కోట్ల మంది రైతులకు భూసార కార్డులు.. ♦ వర్షపు నీటి నిల్వకు నీటి గుంతలు, కొలనులు.. 5లక్షలు ♦ సేంద్రియ సాగు లక్ష్యం..5లక్షల ఎకరాలు పాడి పరిశ్రమాభివృద్ధికి..రూ.850కోట్లు ♦ ఇ-మార్కెట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం ♦ సేంద్రియ సాగు, ఎరువులకు ప్రోత్సాహం వ్యవసాయానికి ఊతమిచ్చేందుకు బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన మరిన్ని అంశాలివీ.. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాం. కొత్తగా 28.5 లక్షల ఎకరాలను సాగు పరిధిలోకి తెస్తాం పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు రూ.850 కోట్లు వెచ్చిస్తాం. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పత్ర, ఇ-పశుధన్ హాత్ పథకాలతోపాటు దేశీయ పాడి సంతతిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న నేషనల్ జినోమిక్ కేంద్రానికి ఈ నిధులను వెచ్చిస్తాం. వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల ఎకరాలను సేంద్రియ సాగు పరిధిలోకి తెస్తాం. ఇందుకు రూ.412 కోట్లు వెచ్చిస్తాం. రూ.6 వేల కోట్లతో భూగర్భ జలాల పెంపు, సంరక్షణ చర్యలు. రూ.368 కోట్లతో భూసార పరిరక్షణ చర్యలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్షపు నీటిని నిల్వచేసేందుకు 5 లక్షల నీటి కొలనులు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తాం. ఇదే పథకం ద్వారా 10 లక్షల సేంద్రియ ఎరువు తయారీ గుంతలు ఏర్పాటు చేస్తాం వచ్చే మూడేళ్లలో విత్తన, భూసార పరీక్షలు కూడా చేసుకునేందుకు వీలుండే 2 వేల ఎరువుల దుకాణాలను ఏర్పాటుచేస్తాం సుదీర్ఘ వ్యవసాయ అవసరాల కోసం నాబార్డ్‌లో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. తొలి దశ కింద రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం పశుధన్ సంజీవని కింద పశువులకు ఆరోగ్య కార్డులు అందజేస్తాం కిందటి ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.8.5 లక్షల కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి రూ.9 లక్షల కోట్లు అందిస్తామని తెలిపారు. ఇంత పెద్ద లక్ష్యం నిర్దేశించుకోవడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ ;వరుసగా రెండేళ్లపాటు కరువుతో సంక్షోభంలో పడ్డ వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు దన్నుగా ఉంటామంటూ బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. సాగుకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపుల్ని దాదాపు రెట్టింపు చేసింది. సాగు, పాడి రంగాలకు మొత్తంగా రూ.44,485 కోట్లు కేటాయించింది. దేశంలో రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2016-17లో రైతులకు రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అలాగే సాగు రుణాల వడ్డీ చెల్లింపుల్లో రైతులకు సాయం అందించేందు కు బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.5,500 కోట్లు ప్రతిపాదించారు. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు రూ.500 కోట్లు కేటాయిం చారు. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలో 14 కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులు అందజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కేందుకు వీలుగా... ఆన్లైన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకు ఎంపిక చేసిన 585 హోల్‌సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఏకీకృత ఇ-మార్కెట్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 14న ఈ పథకాన్ని జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు వీలుగా ఇప్పటికే 12 రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) చట్టాన్ని సవరించుకున్నాయని, ఈ ఏడాది మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరనున్నాయని వివరించారు. దేశ ఆహార భద్రతకు రైతు వెన్నెముకగా నిలుస్తున్నాడని, అతడికి ఆర్థిక భద్రత అందించాల్సిన అవసరం ఉందని జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వేగంగా 89 సాగునీటి ప్రాజెక్టుల పనులు సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 89 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 80.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుందన్నారు. వీటికి వచ్చే ఏడాది రూ.17 వేల కోట్లు, రాబోయే ఐదేళ్లలో రూ.86,500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ 89 ప్రాజెక్టులలో 2017 మార్చి 31 నాటికి కనీసం 23 ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. -
బడ్జెట్ తయారీ ఇలా...
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!! ♦ సెప్టెంబర్ చివర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. ♦ అక్టోబర్ చివర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. ♦ డిసెంబర్.. ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. ♦ జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ♦ ముద్రణ ప్రక్రియ.. బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ♦ ఫోన్ ట్యాపింగ్.. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. ♦ సందర్శకులపై మూడో కన్ను..] ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. ♦ ఫిబ్రవరి చివర్లో.. బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ♦ ఆహారంపై ఎంత జాగ్రత్తో.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. ♦ అత్యవసర సమయాల్లో.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ♦ ఫిబ్రవరి 28/29.. సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్ గురించి వివరిస్తారు. -
సేవలపై కొత్తగా 0.5 శాతం వ్యవసాయ సెస్
పన్ను పరిధిలోని అన్ని సేవలపై ఈ ఏడాది జూన్ 1 నుంచి 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వ్యవసాయ రంగానికి నిధులు సమకూర్చేందుకు ఈ సెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయ పంపులు, ఎరువులపై ఎక్సైజ్ డ్యూటీని త గ్గిస్తామని, శీతల గిడ్డంగుల పరికరాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించివేస్తామని తెలిపారు. మొత్తంగా ఈ బడ్జెట్ రైతుకు అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. సాగులో ఆదాయం పెంచే దిశగా ఆలోచనలు చేయడం బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం. సాగులో మార్పు తేవడం కోసం విత్తు నాటారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. వీటి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించడం సబబుగా ఉంది. అలాగే కొత్తగా విధించిన వ్యవసాయ సెస్ ఆహ్వానించదగ్గది. స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త -
విగ్గు పౌడర్ విలవిల..
బడ్జెట్ అంటే పన్నులు. మరి ఫన్నులు ఏమిటి? ఇవీ పన్నులే. అప్పుడెప్పుడో జనాల్ని చావబాదినవి. ఇప్పుడు మాత్రం మనకు విచిత్రంగా అనిపించేవి.. నవ్వు తెప్పించేవి.. వింతైనవి అన్నమాట. ఓసారి చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఆ ఫన్నులపై లుక్కేద్దామా.. - సాక్షి సెంట్రల్ డెస్క్ విగ్గు పౌడర్ విలవిల.. బ్రిటిష్ ప్రధానుల్లోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన విలియమ్ పిట్ విచిత్రమైన పన్నులతో ప్రజలను విలవిలలాడించే వాడు. తన హయాంలో విగ్గులకు వాడే పౌడర్పైనా పన్ను విధించాడు. అప్పట్లో 1790 కాలంలో విగ్గులకు పౌడర్ వాడటం ఫ్యాషన్‌గా ఉండేది. అయితే, ఈ ఫ్యాషన్ 1820ల నాటికే కనుమరుగవడంతో, దానిపై విధించే పన్నుకూ కాలం చెల్లింది. కిటికీ కిరికిరి.. రష్యా పాలకుడు పీటర్-1 కూడా వింత పన్నుల వీరుడే. చిమ్నీలపై పన్నులు విధించాలని తొలుత సంకల్పించాడు. అయితే, అదంత తేలిక కాకపోవడంతో పాటు చిమ్నీల కంటే కిటికీలను లెక్కించడం తేలిగ్గా కనిపించడంతో ఇళ్ల కిటికీలపై పన్ను వడ్డించాడు. దూరంతో పెరిగే భారం.. దూరానికీ, పన్ను భారానికీ లంకెపెట్టిన చరిత్ర చైనాలోని చౌ వంశీయులది. వారి హయాంలో రాజధానికి చేరువలోనున్న పొలాలకు చెందిన రైతులపై 5 శాతం పన్ను విధించే వారు కాగా, దూరాన్ని బట్టి రైతులపై పన్ను భారం గరిష్టంగా 25 శాతం వరకు పడేది. ప్రమాదాల పన్ను... ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు న్యూజెర్సీ ప్రభుత్వం 1994 నుంచి పన్ను విధిస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి మూడేళ్ల వరకు ఏటా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ద్వారా న్యూజెర్సీ సర్కారుకు అదనంగా 100 కోట్ల డాలర్లు సమకూరాయి. -
నల్ల ధనం వెల్లడికి 4 నెలలు
న్యూఢిల్లీ: లెక్కల్లో చూపని ఆదాయాలు, ఆస్తులు స్వచ్ఛందంగా వెల్లడించాలనుకునే వారికి నాలుగు నెలల వ్యవధి ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవధిలో సదరు నల్లధనానికి సంబంధించి పన్నులు, పెనాల్టీలు కట్టిన వారిపై తదుపరి ప్రాసిక్యూషన్ తదితర చర్యలు ఉండబోవని తెలిపారు. ఇటువంటి బ్లాక్‌మనీపై 30 శాతం పన్నులు, 7.5 శాతం సర్‌చార్జీ, 7.5 శాతం పెనాల్టీ ఉంటుందని (మొత్తం 45 శాతం) మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
అమృత్, స్మార్ట్ సిటీస్ కు 7296 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్), స్మార్ట్ సిటీ మిషన్లకు రూ. 7296 కోట్లను కేటాయించారు. ఇందులో అమృత్ పథకానికి రూ. 4091 కోట్లు, స్మార్ట్‌సిటీస్ మిషన్‌కు రూ. 3205కోట్లు కేటాయించారు. 100 నగరాలను ఎంపిక చేసి అందులో తొలి విడతగా టాప్-20 నగరాలను అభివృద్ధి (తాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సాంకేతికత, కనీస మౌలిక వసతులు వంటివి) చేసేందుకు గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో నగరానికి ఐదేళ్లపాటు రూ.500కోట్ల నిధులిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఊతం
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంకోసం కేంద్రం తాజా బడ్జెట్లో ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రూ.500 కోట్లను కేటాయించింది. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సాయం అందించడానికి వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖలో జాతీయ హబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్లో ప్రకటించారు. పరిశ్రమలు, వాణిజ్యరంగంలో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు మంచి ఫలితాలు కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు వ్యాపార, పారిశ్రామికరంగాల్లో రాణించడానికోసం రూ.500 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని జైట్లీ అన్నారు. ప్రతీ బ్యాంకు బ్రాంచిల్లో ఒక్కో కేటగిరీలో కనీసం రెండు ప్రాజెక్టుల చొప్పున ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. దీనిద్వారా దాదాపు 2.5 లక్షలమందికి లబ్ధికలుగుతుందని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సాధికారతకు ఊతం లభించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రూ. 100కోట్ల చొప్పున కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది. కాగా, 2017లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇన్నేళ్లలో సాధించిన విజయాలను ఆ వేడుకలసందర్భంగా మననం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. మైనారిటీల కోసం ‘ఉస్తాద్’ మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికోసం ‘ఉస్తాద్’ పేరిట పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకంద్వారా బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికోసం చర్యలు చేపడతారు. -
గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే సాగరమాల ప్రాజెక్టు ద్వారా నౌకాయాన రంగంలో జలమార్గాలు, పోర్టు ఆధారిత ఆర్థికాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయ జలమార్గాల అభివృద్ధి కోసం రూ. 800 కోట్లు అందించామని...ఆ పనులను వేగవంతం చేశామని వివరించారు. 12 ప్రధాన పోర్టులను ఆధునీకరించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా కనీసం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలనుకుంటున్నామన్నారు. నౌకాయాన రంగంపై జైట్లీ పేర్కొన్న ఇతరాంశాలు.. ♦ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రధాన పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఇండియన్ కస్టమ్స్ సింగిల్ విండో ప్రాజెక్టు అమలు. ♦ మరింత మంది దిగుమతిదారులకు డెరైక్ట్ పోర్టు డెలివరీ సౌకర్యం విస్తరణ. ♦ కొన్ని తరగతుల ఎగుమతిదారులు, దిగుమతిదారులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో వాయిదా సౌలభ్యం అందించేందుకు కస్టమ్స్ చట్టానికి సవరణ. -
పన్నుల్లో ఊరట తక్కువే!
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇది మధ్య తరగతిని నిరాశపరిచేదే. కాకపోతే కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారిపై మాత్రం జైట్లీ కొంత కనికరం చూపించారు. బాగా ఎక్కువ ఆదాయం ఉన్నవారిని ఇంకాస్త మొత్తారు. తొలిసారి రుణంతో ఇంటిని కొనుక్కునేవారికి మరిన్ని వడ్డీ ప్రయోజనాలిచ్చారు. టీడీఎస్‌తో చిన్న పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే సరళమైన విధానాన్ని తెస్తామని చెప్పారు జైట్లీ. 80 జీజీ కింద హెచ్ఆర్ఏ పరిమితి రూ.60,000కు పెంపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5,000 ట్యాక్స్ రిబేట్ తొలిసారి ఇల్లు కొంటే వడ్డీపై అదనంగా 50,000 మినహాయింపు ఎన్పీఎస్ నుంచి విత్‌డ్రా చేసుకునే 40 % మొత్తానికి పన్నుండదు కోటిరూపాయల ఆదాయం దాటితే సర్ చార్జీ ఇక 15 శాతం తక్కువ ఆదాయం... తక్కువ ఊరట రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఇప్పటిదాకా పన్నులో రూ.2,000 రిబేటు ఇస్తున్నారు. దీన్నిపుడు రూ.5,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.3,000 అదనపు ప్రయోజనం లభించనుంది. 2013లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటును ప్రవేశపెట్టారు. అంటే నెలకు రూ.41 వేలు ఆదాయంలోపు ఉన్నవారికే ఈ ప్రయోజనం. అది దాటితే ఎలాంటి రిబేటూ ఉండదు. అదీ లెక్క. హెచ్ఆర్ఏ అలవెన్స్ లేనివారికి.. కంపెనీలన్నీ హెచ్ఆర్ఏ ఇవ్వవు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నా వారికి హెచ్ఆర్ఏ ప్రయోజనం లభించదు. అలాంటివారు ఇప్పటి వరకూ సెక్షన్ 80 జీజీ కింద రూ.24,000 మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద తగ్గించి చూపించుకునే అవకాశం ఉండేది. ఇపుడు ఆ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అంటే హెచ్ఆర్ఏ లేని ప్రతి ఒక్కరికీ అదనంగా రూ.36,000 మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత ట్యాక్స్ శ్లాబుల్నిబట్టి గరిష్ఠంగా 10,800 వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఇలా పెంచటం ఊరటే అయినా... ఏడాదికి రూ.60 వేలంటే నెలకు రూ.5వేల కింద లెక్క. ప్రస్తుత ధరల ప్రకారం రూ.5వేల అద్దెకు మంచి ఇల్లు ఎక్కడైనా వస్తోందా? మరి ఇది నిజంగా ఊరటేనా? తొలిసారి ఇంటిని కొంటే ఒకవంక రియల్ ఎస్టేట్ దెబ్బతినటంతో దేశీయంగా డిమాండ్ పెంచటానికి, నిర్మాణ రంగానికి ఊతమివ్వటానికి జైట్లీ మరో నిర్ణయం తీసుకున్నారు. రుణం తీసుకుని ఇల్లు కట్టుకునేవారికి వడ్డీ విషయంలో అదనపు ప్రయోజనం కల్పించారు. తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షలకు అదనంగా రూ.50,000 ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని కోసం కొన్ని షరతులు విధించారు. ఇంటి ధర రూ. 50 లక్షలు దాటకుండా... తీసుకునే రుణం రూ.35 లక్షలు దాటకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం.. ఎక్కువ వడ్డన ఏడాదికి కోటి రూపాయలు దాటి సంపాదించేవారిపై వడ్డన మరికాస్త పెంచారు. అలాంటివారు ఇప్పటిదాకా పన్ను చెల్లించటంతో పాటు... సూపర్ రిచ్ సర్‌ఛార్జీ పేరిట 12 శాతాన్ని చెల్లించేవారు. ఇపుడు ఈ సర్ఛార్జిని 15 శాతానికి పెంచారు. 2013లో అప్పటి ఆర్థిక మంత్రి తొలిసారిగా ఈ సూపర్ రిచ్ సర్చార్జిని 10 శాతంగా ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లో జైట్లీ వెల్త్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసి సూపర్ రిచ్ సర్ చార్జీని 12 శాతానికి పెంచారు. ఇప్పుడు ఇది 15 శాతం అయ్యింది. ఎన్పీఎస్ విత్‌డ్రా.. ట్యాక్స్ ఫ్రీ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్పీఎస్) మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేశారు. ఇతర పింఛన్ పథకాల మాదిరిగానే ఎన్పీఎస్ నుంచి చేసే విత్ డ్రాయల్స్‌పై కూడా పన్ను భారాన్ని తీసేశారు. 60 ఏళ్లు దాటాక ఎన్పీఎస్ కార్పస్ నుంచి మామూలుగా 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేయొచ్చు మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. తద్వారా పింఛన్ వస్తుంది. అయితే విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఇప్పటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై మాత్రం విత్‌డ్రా చేసుకునే మొత్తం 40 శాతందాకా ఉంటే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 60 శాతమైతే మాత్రం... మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎన్పీఎస్ మాదిరిగా 1-4-2016 నుంచి ఈపీఎఫ్‌లో కూడా మార్పులు జరుగుతాయి. విత్డ్రాయల్స్పై 40 శాతం వరకు మాత్రమే పన్ను మినహాయింపులుంటాయి. అలాగే సింగిల్ ప్రీమియం పెన్షన్ పాలసీపై సర్వీస్ ట్యాక్స్‌ను 3.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగమిస్తే ఈపీఎఫ్ సాయం.. కొత్త ఉద్యోగాలు కల్పించడానికి, పరిశ్రమలన్నీ ఈపీఎఫ్ పరిధిలోకి రావటానికి కేంద్రం కొత్త ప్రోత్సాహకాలు కల్పించింది. కొత్త ఉద్యోగి కనక ఈపీఎఫ్‌లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్‌కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్‌కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్లు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది. ఇందుకోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది. చౌక ఇళ్లకు ప్రోత్సాహకాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేలా అందుబాటు ధరల్లో నిర్మించే ఇళ్లకు ఈ బడ్జెట్లో ప్రోత్సాహకాలిచ్చారు. చౌక ఇళ్లను నిర్మించే సంస్థలకు వచ్చే లాభాల్లో 100 శాతం డిడక్షన్‌కు వీలు కల్పించారు. మెట్రో నగరాల్లో 30 చదరపు అడుగుల్లో, మిగిలిన పట్టణాల్లో 60 చదరపు అడుగుల్లో నిర్మించే ఫ్లాట్స్‌కి ఈ ప్రయోజనం లభిస్తుంది. బీమా ఏజెంట్లకు టీడీఎస్ ఊరట ముందస్తు పన్ను మినహాయింపు (టీడీఎస్) నుంచి ఊరట దొరికింది. ముఖ్యంగా బీమా ఏజెంట్ల కమీషన్‌పై విధించే టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంతకాలం కమీషన్ రూపంలో వచ్చే ఆదాయం రూ.20,000 దాటితేనే టీడీఎస్ వర్తించేది. దీన్నిప్పుడు రూ.15,000కు తగ్గించారు. బీమా పాలసీకి చేసే చెల్లింపులపై విధించే టీడీఎస్‌ను 2 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్ఎస్ఎస్) కమీషన్లపై టీడీఎస్‌ను 20 నుంచి 10 శాతానికి, బ్రోకింగ్ కమీషన్లపై టీడీఎస్‌ను 10 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఎస్ఎంఈలు, వృత్తి నిపుణులకు ఊరట చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వృత్తి నిపుణులకు పెద్ద ఊరటే ఇచ్చారు. రెండు కోట్ల లోపు టర్నోవర్ కలిగిన వారు... తమ టర్నోవర్‌లో 8% లాభం వస్తుందని అంచనా వేసుకుని... దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాంటివారు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ రాయాల్సిన పని కూడా లేదు. గతంలో ఈ పరిమితి కోటి రూపాయలుగా ఉండేది. దీనివల్ల సుమారు 30లక్షల మంది చిరు వ్యాపారులకు ఊరట లభించనుంది. అలాగే డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వృత్తి నిపుణులు తమ ఆదాయం కనక రూ.50 లక్షల లోపు ఉంటే... ఆదాయంలో 50 శాతాన్ని లాభంగా అంచనా వేసుకుని, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. వీరు కూడా అకౌంట్ బుక్స్ రాయాల్సిన పని ఉండదు. ఇప్పుడు పన్ను శ్లాబులు ఎలా ఉన్నాయంటే... -
ఆధార్ కు చట్టబద్ధత
♦ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ♦ ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తామన్న జైట్లీ ♦ ఎరువుల సబ్సిడీ ‘ప్రత్యక్ష బదిలీ’పై త్వరలో పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: వివిధ వర్గాల వ్యతిరేకత, సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో ‘ఆధార్’కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అర్హులకే సబ్సిడీలు అందించడానికి ఆధార్ ఆవశ్యకమని... అందువల్ల ఆధార్‌కు చట్టబద్ధత కల్పించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పేదలు, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా పారదర్శకంగా వ్యవహరించేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. బిల్లు సిద్ధంగా ఉందని, మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్ ముందుకు తెస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, మరిన్ని అభివృద్ధి చర్యలకు అనుసంధానిస్తామని తెలిపారు. భారత సంచిత నిధి నుంచి కల్పించే అన్ని రకాల సబ్సిడీలు, సేవలు, ప్రయోజనాలను ఆధార్ ద్వారా అందజేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98 కోట్ల మంది ఆధార్ నంబర్‌ను పొందారని... రోజూ సుమారు 26 లక్షల మంది నేరుగా, మరో 1.5 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకం కింద 16.5 లక్షల మంది ప్రయోజనం పొందుతుండగా... అందులో 11.19 కోట్ల మంది తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందజేసే పథకాన్ని దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని జైట్లీ తెలిపారు. ఇక వివిధ సబ్సిడీ పథకాలను ఆధునీకరించడంలో భాగంగా... దేశవ్యాప్తంగా లక్ష రేషన్ దుకాణాలను కంప్యూటరీకరించనున్నట్లు ప్రకటించారు. -
రహదారులకు రాజయోగం
♦ దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ♦ బడ్జెట్లో రోడ్లు, హైవేలకు రూ. 55,000 కోట్లు ♦ ఎన్హెచ్ఏఐ బాండ్ల ద్వారా రూ. 15,000 కోట్లు ♦ గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,000 కోట్లు ♦ పథకంలో రాష్ట్రాల వాటా మరో రూ. 8,000 కోట్లు ♦ మొత్తం రూ. 97 వేల కోట్లతో రోడ్లకు మహర్దశ ♦ 2019 నాటికే అన్ని గ్రామాలకూ రోడ్ల అనుసంధానం ♦ వచ్చే ఏడాదిలో 10 వేల కి.మీ. హైవేల నిర్మాణం ♦ నేషనల్ హైవేలుగా 50 వేల కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు ♦ రోడ్డు ప్రయాణంలో ప్రయివేటు రంగానికి అవకాశం ♦ వాహనాలపై 1 నుంచి 4 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్సు న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. 2016-17 బడ్జెట్లో 2.21 లక్షల కోట్ల నిధులను అందుకోసం కేటాయించింది. ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను కేవలం రహదారుల నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) సహా దేశంలో రహదారుల రంగానికి రూ. 97 వేల కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ.. రోడ్లు, హైవేలకు భారీగా రూ. 55,000 కోట్లు ఇచ్చారు. దీనికి అదనంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బాండ్ల రూపంలో రూ. 15,000 కోట్లు సమీకరించి ఖర్చు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఇక పీఎంజీఎస్‌వై కోసం మరో రూ. 19,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. సడక్ యోజన నిధులకు రాష్ట్రాల వాటా రూ. 8,000 కోట్లు కలుస్తుందని చెప్పారు. మొత్తం కలిపి రూ. 97,000 కోట్లతో దేశంలో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. 2019 నాటికి అన్ని గ్రామాలకూ రోడ్లు... ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని మునుపెన్నడూ లేని విధంగా తాము అమలు చేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. గతంలో నిధుల కేటాయింపులు స్వల్పంగా ఉండటం వల్ల ఈ పథకం దెబ్బతిన్నదన్నారు. 2012-13లో ఈ పథకానికి రూ. 8,885 కోట్లు, 2013-14లో రూ. 9,805 కోట్లు మాత్రమే కేటాయించారని.. తాము గత రెండేళ్లలో గణనీయంగా నిధులు పెంచామని తెలిపారు. తాజా బడ్జెట్లో ఈ పథకం కింద.. కేంద్రం కేటాయించిన రూ. 19,000 కోట్ల నిధులకు రాష్ట్రాల వాటా కలిపి మొత్తం రూ. 27,000 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం చేయటం జరుగుతుందన్నారు. దేశంలో మిగిలి వున్న 65 వేల అర్హమైన గ్రామాలనూ ఈ పథకం కింద 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని 2019 నాటికే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు జైట్లీ తెలిపారు. అలాగే.. 2011-14 మధ్య సగటున రోజుకు 73.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగితే అది ప్రస్తుతం 100 కిలోమీటర్లకు పెరిగిందని.. దీనిని మరింతగా పెంచుతామని చెప్పారు. ఇక.. దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలను వచ్చే ఏడాదిలో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నిలిచిపోయివున్న రూ. లక్ష కోట్లకు పైగా రోడ్డు ప్రాజెక్టుల్లో 85 శాతం ప్రాజెక్టులను మొదలు పెట్టటం, వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. రోడ్డు రవాణాలో ప్రయివేటుకు అవకాశం... అలాగే.. రహదారుల రంగం అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్న ‘పర్మిట్ రాజ్’ (అనుమతుల విధానం)ను తొలగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం.. రహదారులపై ప్రయాణ రవాణాను మరింత సమర్థవంతంగా చేయాల్సి ఉందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రయాణ విభాగంలో ప్రయివేటు సంస్థలకు రోడ్డు రవాణా తలుపులు తెరిచేందుకు మోటారు వాహనాల చట్టానికి అవసరమైన సవరణలు చేపడతామని చెప్పారు. కార్లు, వాహనాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు... భారతీయ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న జైట్లీ.. అదనపు వనరులను సృష్టించటం కోసం చిన్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై ఒక శాతం చొప్పున, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, అధిక ఇంజన్ సామర్థ్యం గల వాహనాలు, ఎస్‌యూవీలపై 4 శాతం చొప్పున మౌలికసదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) సెస్సు వేయనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. -
పైసాలోనే పరమాత్మ!
బడ్జెట్ అంటే అంతా డబ్బుతో పని. ఇప్పుడంటే అంతా నోట్లలోనే నడుస్తోంది గానీ.. గతంలో అన్నీ నాణేలే. మరి దేశంలోని మొదటి నాణెం నుంచి మనం స్వర్ణయుగమని చెప్పుకునే గుప్తుల నుంచి విజయనగర రాజుల వరకూ, అటు మొగలుల నుంచి ఇటు హైదరాబాద్ నిజాం కాలం వరకూ నాణేలు ఎలా ఉండేవి.. ఇదిగో ఇలా ఉండేవి. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన లభించింది. అధికార బీజేపీ ప్రశంసించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వైద్య సంఘం నిట్టూర్పులు వెళ్లగక్కింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాకాంక్షను నెరవేర్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా పలువురు స్పందించారు. బడ్జెట్లో అన్ని అంశాలను ప్రస్తావించారని, నిధులను కేటాయించారని తమిళిసై అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం నుంచి ఏవైతే ఆశిస్తున్నారో వాటికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని తెలిపారు. ముఖ్యంగా రైతు పక్షపాతి బడ్జెట్‌గా రూపొందిందని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. ప్రకటించడం కాదు అమలు చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కంటితుడుపుగా అంకెలు చూపితే ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన్యత ఏదీ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పించడంలో కేంద్రబడ్జెట్ విఫలమైందని డాక్టర్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్విటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీఆర్ రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. వైద్య ఖర్చుల కారణంగా ప్రతి ఏటా ఆరుకోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు దిగజారుతున్నారని కేంద్రం విడుదల చేసిన జాతీయ సంక్షేమ సిద్ధాంతం-2015 తేటతెల్లం చేసిందని అన్నారు. ప్రజారోగ్యశాఖకు 2013-14లోనే రూ.1,93,043 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో కేవలం రూ.1,51, 581 కోట్లు కేటాయింపు జరగడం విచారకరమన్నారు. ప్రజావైద్యశాలను బలోపేతం చేయడానికి మారుగా ప్రయివేటు వైద్యశాలకు మేలు చేకూరేలా ఆరోగ్యబీమాపై నిర్ణయాలు తీసుకున్నారని ఆయన విమర్శించారు. బీమా పాలసీలు ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చడం లేదని అనేక సర్వేల్లో తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు. వైద్యఖర్చులు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో లక్ష రూపాయల బీమా సౌకర్యం వృథా అని అన్నారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. గ్రామీణ వికాశం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేంద్రబడ్జెట్‌ను స్వాగతిస్తున్నానని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ ఏ వేలయ్యన్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులు, తీసుకున్న నిర్ణయాలు భారత దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయని చెప్పారు. -
క్రీడలకు నామమాత్రపు పెంపు..
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో క్రీడలకు నిధులు నామమాత్రంగా పెంచారు. గత బడ్జెట్‌తో పోలిస్తే కేవలం రూ. 50.87 కోట్లు ఎక్కువ ఇచ్చారు. 2016-17 బడ్జెట్లో క్రీడలకు ప్రణాళిక వ్యయం కింద రూ. 1,400 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 192 కోట్లు మొత్తం రూ. 1592 కోట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. గత బడ్జెట్లో క్రీడలకు రూ. 1541.13 కోట్లు ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీకి రూ. 381.30 కోట్లు, క్రీడా సంస్థలకు రూ. 545.90 కోట్లు కేటాయించారు. -
కుటుంబానికి రూ. లక్ష ఆరోగ్య బీమా
వైద్య రంగానికి రూ. 38,206 కోట్లు సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేల వరకు ప్యాకేజీ జాతీయ ఆరోగ్య మిషన్‌కు 19వేల కోట్లు కిడ్నీ రోగులపై కరుణ ♦ జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం ♦ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ♦ దేశవ్యాప్తంగా 3 వేల జన్ఔషధి స్టోర్లు న్యూఢిల్లీ: పేదలు (దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు), ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రతపై బడ్జెట్లో కేంద్రం కరుణ చూపింది. వారి కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తామన్నారు. ‘‘కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అది ఆ కుటుంబంపై పెను ఆర్థిక భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త ఆరోగ్య పథకం తెస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు. న్యూఢిల్లీ: కిడ్నీ రోగులపై బడ్జెట్లో కేంద్రం ఉదారత చాటుకుంది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం అవసరమైన రోగులకు ఆర్థికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించి దీని కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందించనుంది. అలాగే డయాలసిస్ పరికరాల్లోని కొన్ని భాగాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ లేదా కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించింది. ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. డయాలసిస్ కోసం రోగుల కుటుంబాలు తరచూ దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రయా ణ ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో వారు రోజువారీ వేతనాలూ నష్టపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నిధుల సమీకరణ చేపడతామన్నారు. నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఈ బడ్జెట్ విప్లవాత్మకమైనది
ఈ బడ్జెట్ విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అని.. రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. దేశ చరిత్రలో తొలిసారిగా రోడ్లు, హైవేల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రంగాన్ని ప్రభుత్వం పునరుద్ధరించగలిగిందని.. రానున్న నెలల్లో ఇది చాలా వేగవంతం కానుందని చెప్పారు. బడ్జెట్ ప్రకటనల ద్వారా.. యువతకు ఉపాధి కల్పన జరుగుతుందని, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 15 కోట్లకు పెరుగుతుందన్నారు. కేవలం 10 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణ పనుల ద్వారా నాలుగు కోట్ల పని దినాల సృష్టి జరుగుతుందని చెప్పారు. -
విమానయానం మరింత భారం
విమానాల్లో వినియోగించే ఇంధనం ‘ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)’పై ఆరు శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంపును జైట్లీ ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతం 8 శాతంగా ఉన్న ఈ పన్ను 14 శాతానికి పెరగనుంది. విమానయాన సంస్థల వ్యయంలో 40 శాతం కేవలం ఏటీఎఫ్ కోసమే ఖర్చవుతుంది. ఈ లెక్కన ఏటీఎఫ్‌పై పన్ను పెంపుతో వినియోగదారులపైనే భారం పడుతుంది. అయితే ‘ప్రాంతీయ అనుసంధాన పథకం’లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని విమానయాన సంస్థలకు మాత్రం ప్రస్తుత పెంపు నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఏటీఎఫ్‌పై పన్ను పెంపుతో ఈ రంగంలో ముడి పదార్థాల ధరలు నాలుగైదు శాతం వరకు పెరగవచ్చని అంచనా.