
మార్కెట్లకు ‘పన్ను’పోటు..!
♦ 848 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ హెచ్చుతగ్గులు
♦ మెనస్ 660 నుంచి మైనస్ 152కు రికవరీ
♦ 23,002 పాయింట్ల వద్ద ముగింపు
♦ 43 పాయింట్ల నష్టంతో 6,987కు నిఫ్టీ
♦ డీడీటి, ఎస్‌టీటీ, క్రూడ్, కోల్ సెస్‌లతో షాక్
అసలే...ఆసియా మార్కెట్లు అల్లకల్లోలమవుతున్న సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు పన్నుపోటు పొడిచారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఆయన ప్రతిపాదించిన వివిధ రకాల పన్నులకు స్టాక్ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 22,500 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. చివరలో దేశీయ సంస్థలు కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టంతో 23,002 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 6,987 పాయింట్ల వద్ద ముగిశాయి. 10 లక్షలకు మించిన డివిడెండ్‌పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించడం, క్రూడ్‌పై అంచనాలకంటే అధికంగా 20 శాతం సెస్‌ను ప్రతిపాదించడం, బొగ్గుపై క్లీన్ ఎనర్జీ సెస్‌ను రెట్టింపుచేయడం, ఆప్షన్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ)ను 0.017 నుంచి 0.05 శాతం పెంచడంతో సెంటిమెంట్ బలహీనపడింది.
బడ్జెట్ ప్రతిపాదనల కారణంగా స్టాక్ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 660 పాయింట్లు క్షీణించింది. మొత్తం మీద సెన్సెక్స్ 848 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అయితే ఆర్‌బీఐ రేట్ల కోత ఉంటుందనే ఊహాగానాల కారణంగా దిగువస్థాయి నుంచి సూచీలు కొంతవరకూ కోలుకున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్‌ను మార్కెట్ నియంత్రించజాలదని, బడ్జెట్ మార్కెట్‌కు నచ్చిందా లేదా అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు.
భవిష్యత్‌లో ప్రభావం...
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి తీసిన దెబ్బలు భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అంచనాలకు తక్కువగానే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిధులు కేటాయించడం, ఆప్షన్స్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ)ను 0.07 శాతం నుంచి 0.05 శాతానికి పెంచడం, రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్లపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ను విధించడం, కార్పొరేట్లకు ఎలాంటి పన్ను ఊరట లేకపోవడం, జీఎస్‌టీ ఊసే లేకపోవడం.. ఈ అంశాలన్నీ రానున్న కాలంలో తప్పక ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
వాహనాలపై మౌలిక సెస్
ఇక వివిధ రకాల వాహనాలపై మౌలిక సెస్ విధించడంతో వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 4% వరకూ నష్టపోయాయి. పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 10-15% వరకూ పెంచడంతో ఐటీసీ, గాడ్‌ఫ్రై ఫిలిప్స్ వంటి షేర్లు ఇంట్రాడేలో 8% వరకూ పతనమయ్యాయి. చివరలో ఐటీసీ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. మరోవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ జైట్లీ కేటాయింపులు పెంచడం వ్యవసాయ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల షేర్లకు జోష్ నిచ్చింది.
కావేరి సీడ్ కంపెనీ, ర్యాలీస్ ఇండియా, శక్తి పంప్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. జైన్ ఇరిగేషన్, మోన్‌శాంటో వంటి కంపెనీల షేర్లు బాగా పెరిగి ఆ తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల పాలయ్యాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, భెల్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్, విప్రో, ఆదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, సిప్లా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీకోల్ ఇండియా షేర్లు 10% వరకూ నష్టపోయాయి. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లుపిన్, హెచ్‌డీఎఫ్‌సీ పెరిగాయి. ఆసియా మార్కెట్లు నష్టపోయాయి.