దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ | Sensex rallies over 350 points, Nifty reclaims 7600; top 20 bets | Sakshi
Sakshi News home page

దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ

Published Tue, Jul 1 2014 1:21 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ - Sakshi

దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ

నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్‌పై ఇన్వెస్టర్లకున్న భారీ అంచనాలు మార్కెట్లకు టానిక్‌లా పనిచేశాయ్. దీంతో అన్నివైపుల నుంచీ కొనుగోళ్లు పుంజుకోవడంతో ప్రధాన ఇండెక్స్‌లు ఉదయం నుంచీ పరుగందుకున్నాయి. ఫలితంగా ఏప్రిల్-జూన్’15 క్వార్టర్‌లో సెన్సెక్స్ ఏకంగా 3,027 పాయింట్లను జమ చేసుకోగలిగింది! ఇన్వెస్టర్ల సంపద సైతం రూ. 16 లక్షల కోట్లమేర ఎగసింది!!
 
బడ్జెట్‌పై ఆశలు స్టాక్ మార్కెట్లకు బుల్ జోష్‌నిచ్చాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో జూలై 10న వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంస్కరణలతో కూడిన పటిష్ట బడ్జెట్‌ను ఆశిస్తున్న ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 314 పాయింట్లు ఎగసి 25,414 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సెంచరీ(103 పాయింట్లు) కొట్టి 7,611 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, దాదాపు ఐదేళ్ల తరువాత సెన్సెక్స్ మళ్లీ ఒక క్వార్టర్‌లో అత్యధికంగా లాభపడటం విశేషం!ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దాదాపు 14%(3,027 పాయింట్లు) పుంజుకోగా, అంతక్రితం 2009 సెప్టెంబర్(రెండవ) క్వార్టర్‌లో 18% జంప్‌చేసింది. వెరసి ఈ క్యూ1లో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 16 లక్షల కోట్లమేర ఎగసి రూ. 90 లక్షల కోట్లను అధిగమించింది.
 
 చమురు ధరల ఎఫెక్ట్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దిగిరావడం కూడా సెంటిమెంట్‌కు అండగా నిలిచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 113 డాలర్లకు చేరగా, నెమైక్స్ 105 డాలర్ల వద్ద కదులుతోంది.
 
పవర్ పంచ్: పవర్ రంగ షేర్లు సీఈఎస్‌సీ, జేపీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా పవర్, అదానీ, టొర ంట్, రిలయన్స్ పవర్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎన్‌టీపీసీ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్ దిగ్గజాలు ఆల్‌స్తోమ్ టీఅండ్‌టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, పిపావవ్ డిఫెన్స్, వాటెక్, ఎస్‌కేఎఫ్, ఎల్‌అండ్‌టీ, భెల్ 6-2% మధ్య జంప్‌చేశాయి. ఇక బ్యాంకింగ్ షేర్లు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, బీవోబీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ 7-2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement