Reliance Infra
-
ఎట్టకేలకు.. అనిల్ అంబానీకి భారీ ఊరట
అప్పుల భారం తగ్గించుకుంటున్న అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) వివాదంలో తమకు అనుకూలంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు వెలువరించినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. డీవీసీ-రియలన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కేసుపై కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా డీవీసీ.. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కోల్కత్తా హైకోర్టు సమర్ధించింది.పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దశాబ్దం క్రితం రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఈ సమయంలో డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నష్టాన్ని కోరింది. దీన్ని సవాలు చేస్తు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్టును ఆశ్రయించింది. 2019లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అనిల్ అంబానీ కంపెనీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ.896 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది. కానీ డీవీసీ దీనిపైన కోల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు అనిల్ అంబానీకి భారీ ఊరట దక్కేలా గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని సమర్థించింది. -
అనిల్ అంబానీ కంపెనీలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోటర్లు ఈక్విటీ రూపేణా రూ. 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి జతగా ముంబైకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రూ. 1,900 కోట్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ. 6,000 కోట్ల సమీకరణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది.వీటిలో రూ. 3,014 కోట్లు ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా అందుకోనుంది. మిగిలిన రూ. 3,000 కోట్లు సంస్థాగత కొనుగోలుదారుల నుంచి సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 3,014 కోట్లు సమకూర్చుకోనుంది. వీటిలో ప్రమోటర్ సంస్థ రైజీ ఇన్ఫినిటీ ప్రయివేట్ 4.6 కోట్ల షేర్లకు సబ్స్క్రయిబ్ చేయనుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?ఈ బాటలో ముంబై సంస్థలు ఫార్చూన్ ఫైనాన్షియల్ అండ్ ఈక్విటీస్ సర్వీసెస్(4.41 కోట్ల షేర్లు– రూ. 1,058 కోట్లు), ఫ్లోరిన్‌ట్రీ ఇన్నొవేషన్స్ ఎల్ఎల్పీ(3.55 కోట్ల షేర్లు– రూ. 582 కోట్లు) చొప్పున ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంకానున్నాయి. పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ సైరియా ఫ్లోరిన్ట్రీని ఏర్పాటు చేయగా.. ఫార్చూన్ ఫైన్షాఇయల్ను నిమిష్ షా నెలకొల్పారు. రిలయన్స్ ఇన్ఫ్రాలో ప్రమోటర్లకు ప్రస్తుతం 21.34 శాతం వాటా ఉంది. -
హమ్మయ్య.. అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పుల భారం భారీగా తగ్గింది. గ్రూప్‌లోని రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారింది. అలాగే మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తన రుణాన్ని 87 శాతం తగ్గించుకుంది.ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర రుణదాతల బకాయిలను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసింది. మొత్తం బాకీ తీర్చేందుకు ఒక్క ఎల్ఐసీకే రూ.600 కోట్లు చెల్లించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్, ప్రెస్ స్టేట్మెంట్లలో రిలయన్స్ ఇన్ఫ్రా తమ స్వతంత్ర బాహ్య రుణం రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తత్ఫలితంగా కంపెనీ నికర విలువ రూ. 9,041 కోట్ల వద్ద నిలిచింది.ఈ వార్తలు వచ్చిన తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా షేరు ధర బుధవారం 20 శాతం పెరిగింది. రూ.47.12 పెంపుతో రూ.282.73 వద్ద ముగిసింది. సెప్టెంబర్ 18 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.11189 కోట్లకు చేరుకుంది. ఇక ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రూ. 385 కోట్లతో జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి ఆ కంపెనీతో వన్-టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ సెటిల్మెంట్ సెప్టెంబర్ 30లోపు పూర్తికానున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!అలాగే ఎడిల్వీస్కు చెల్లించాల్సిన మరో రూ.235 కోట్ల అప్పును కూడా రిలయన్స్ ఇన్ఫ్రా సెటిల్ చేసుకుంది. ఇందులో భాగంగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని తర్వాత రెండు కంపెనీలు పరస్పర మధ్యవర్తిత్వ దావాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. -
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
రిలయన్స్ ఇన్ఫ్రా.. గాడిన పడేనా
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తన సంస్థలను మళ్లీ గాడిన పెట్టేందుకు అనిల్ అంబానీ సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా నిధుల సమీకరణ చేస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఇన్‌ఫ్రాలోకి రూ. 550 కోట్ల నిధులు అనిల్ తెచ్చారు. ప్రమోటర్ల నుంచి ప్రమోటర్లకు వాటాలు విక్రయించడం ద్వారా రూ, 550.56 కోట్లు నిధులు సమీకరించేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫెరెన్షియల్ ఎలాట్మెంట్ ద్వారా 8.88 కోట్ల షేర్లను ప్రమోటర్లుగా ఉన్న వీహెచ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇవ్వనుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రా దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. జాతీయ రహదారులు, పవర్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టింది. ఈ పనుల్లో ఎక్కువ శాతం బీవోటీ పద్దతిలోనే రిలయన్స్ ఇన్ఫ్రా చేపడుతోంది. చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం -
రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే
ముంబై: దాదాపు రూ. 7,500 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికకు రుణదాతలు ఆమోదం తెలిపినట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్–క్రెడిటార్ ఒప్పందం (ఐసీఏ)పై రుణాలిచ్చిన మొత్తం 16 సంస్థలు సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఆర్బీఐ కొత్త సర్క్యులర్ ప్రకారం రుణగ్రహీత ఏ ఒక్క బ్యాంకుకైనా డిఫాల్ట్ అయిన పక్షంలో 30 రోజుల్లోగా మిగతా రుణదాతలు సదరు ఖాతాను సమీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకులు నిర్దిష్ట పరిష్కార ప్రణాళికను నిర్ణయించి, ఐసీఏ కుదుర్చుకోవాలి. రుణ విలువలో దాదాపు 75 శాతం ఇచ్చిన రుణదాతలు, సంఖ్యాపరంగా 60 శాతం మంది రుణదాతలు .. పరిష్కార ప్రణాళికపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కన్సార్షియంలో మిగతా రుణదాతలు కూడా ఈ పరిష్కార ప్రణాళికకు కట్టుబడాల్సి ఉంటుంది. వివిధ అసెట్స్‌ను విక్రయించడం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో నిధుల సమీకరణ ద్వారా నిర్దేశిత 180 రోజుల డెడ్‌లైన్ లోగానే పరిష్కార ప్రణాళికను అమలు చేయగలమని రిలయన్స్ ఇన్ఫ్రా ధీమా వ్యక్తం చేసింది. -
రిలయన్స్ ఇన్ఫ్రా మరో భారీ డిఫమేషన్
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూపు మరోసారి భారీ డిఫమేషన్ సూట్‌ను దాఖలు చేసింది. రాఫెల్ డీల్ పై అవాస్తవాలను, అబద్ధాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్డీటీవీ పై 20వేల కోట్ల రూపాయల దావా వేసిన అనిల్ రిలయన్స్ గ్రూపు ఇపుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ది సిటిజెన్ వ్యవస్థాపకుడు-సంపాదకుడు సీమా ముస్తఫాకు వ్యతిరేకంగా 7వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. రాఫెల్ ఒప్పందంలో తమ కవరేజ్ నేపథ్యంలో తమపై ఈ దావా నమోదైనట్టు సిటిజెన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తమకు మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అంబానీ అరోపణలను తిరస్కరించిరన సిటిజన్ తాము వాస్తవాలకు కట్టుబడి నిజాలను నిర్భీతిగా ప్రజలకు అందించేందుకు, నిజాయితీ, జవాబుదారీతనం, సమగ్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. అలాగే రాజకీయ లేదా కార్పొరేట్ నిధులు లేని స్వతంత్ర మీడియా జర్నలిజం భవిష్యత్తు కీలకమైనదని విశ్వసిస్తున్నామని పేర్కొంది. -
అదానీ చేతికి రిలయన్స్ ఇన్ఫ్రా విద్యుత్ ఆస్తులు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ట్రాన్సిమిషన్ ఆస్తుల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన వెస్టర్న్ రీజియన్ స్ట్రెగ్తనింగ్ సిస్టమ్ స్కీమ్స్(డబ్ల్యూఆర్ఎస్ఎస్)కు చెందిన ట్రాన్స్మిషన్ ఆస్తులను రూ.1,000 కోట్లకు కొనుగోలు చేశామని అదానీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్(ఏటీఎల్) తెలిపింది. ఈ ట్రాన్సిమిషన్ ఆస్తుల కొనుగోలుతో తమ పవర్ వీలింగ్ నెట్వర్క్ 8,500 సర్క్యూట్ కిలోమీటర్లను దాటేసిందని వివరించింది. కాగా రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ముంబై విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణి వ్యాపారాన్ని కొనుగోలు ప్రతిపాదిత ఒప్పందాన్ని అదానీ ట్రాన్స్మిషన్ ఇటీలనే కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కాలవ్యవధి వచ్చే ఏడాది జనవరి 15 వరకూ ఉంటుంది. కాగా డబ్ల్యూఆర్ఎస్ఎస్ఎస్ ట్రాన్స్మిషన్ వ్యాపార విక్రయం పూర్తయిందని రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఈ డీల్ విలువ సుమారుగా రూ.1,000 కోట్లు ఉంటుందని, ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగిస్తామని వివరించింది. ఈ లావాదేవీ నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు రెండూ నష్టాల్లోనే ముగిశాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 1.2 శాతం నష్టంతో రూ.205 వద్ద ముగియగా, రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 0.7 శతం నష్టపోయి రూ.498 వద్ద ముగిసింది. -
ఆన్లైన్లో రిలయన్స్ సిమెంట్
లక్నో: సిమెంట్ ఆన్లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఆన్లైన్ అమ్మకాలను ప్రారంభించిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఈ-టైలింగ్ సౌలభ్యం తదుపరి దశల్లో విస్తరిస్తామని ఆయన తెలిపారు. కనీసం 25 బ్యాగులు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లో లోడ్ డెలివరీ అవుతుంది. సంస్థకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.5 మిలియన్ టన్నులు. -
మెట్రో చార్జీలు తగ్గించాలి
- సిఫార్సు చేసిన సలహా కమిటీ - చార్జీల పెంపునకు జాప్యమే కారణమని వివరణ సాక్షి, ముంబై: పెంచిన మెట్రో చార్జీలను తగ్గించాలని చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన సలహా కమిటీ సిఫార్సు చేసింది. చార్జీలు పెంచడానికి మెట్రో నిర్మాణ వ్యయం కారణం కాదని, నిర్మాణంలో జాప్యమే కారణమని తేల్చి చెప్పింది. వర్సోవా-అంధేరి-ఘట్కోపర్ మెట్రో రైలు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం సలహా కమిటీని నియమించిన సంగతి తెలిసింది. మెట్రో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్ఫ్రా మధ్య 2007లో ఒప్పందం కుదిరింది. అయితే పనులు మాత్రం 2008లో ప్రారంభమయ్యాయి. దీంతో మొదట్లో అనుకున్న వ్యయం రూ. 2,356 కోట్లు జాప్యం కారణంగా రూ. 4,329 కోట్లకు చేరుకుంది. పెరిగిన వ్యయాన్ని రాబట్టుకోడానికి చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తెరమీదకు తెచ్చింది. ఆ ప్రకారం రూ.9, 11, 13 ఉన్న చార్జీలను పెంచి రూ.10, 20, 30, 40 అమలు చేసింది. ఇష్టానుసారంగా మెట్రో చార్జీలు పెంచడంతో అన్ని రంగాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో చార్జీలు ఎంతమేర ఉండాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కమిటీ నియామకంపై తీవ్ర జాప్యం చేసిన కేంద్రం చివరకు రెండు నెలల కిందట ఏర్పాటు చేసింది. మెట్రో నిర్మాణంపై అధ్యయనం చేపట్టిన కమిటీ అందులోని లొసుగులు, వాస్తవాలను వెలికి తీసింది. ముంబైకర్లపై చార్జీల భారం మోపడానికి వ్యయం పెరగడం కారణం కాదని చెప్పింది. పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది. -
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్ఫ్రా ఓపెన్ ఆఫర్
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్ఫ్రా ఓపెన్ ఆఫర్ముంబై: పిపావవ్ డిఫెన్స్ కొనుగోలు ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రామంగళవారం మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 1,263 కోట్లుగా ఉండనుంది. షేరు ఒక్కింటికి రూ. 66 చొప్పున మొత్తం 19.14 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. తాజా వార్తలతో బీఎస్ఈలో మంగళవారం పిపావవ్ షేర్లు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 61.3 వద్ద ముగిశాయి. -
రిలయన్స్ ఇన్ఫ్రా చేతికి పిపావవ్ డిఫెన్స్
- రూ. 2,082 కోట్ల మేర డీల్ విలువ - తొలుత 18 శాతం వాటాల కొనుగోలు - తర్వాత మరో 26% వాటాలకు ఓపెన్ ఆఫర్ - లావాదేవీ పూర్తయ్యాక రిలయన్స్ డిఫెన్స్‌గా పేరు మార్పు - చైర్మన్‌గా అనిల్ అంబానీ న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా దేశీ రక్షణ రంగంలో అతి పెద్ద డీల్‌కు తెర తీసింది. పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2,082.3 కోట్ల మేర ఉండనుంది. ఒప్పందం కింద పిపావవ్ డిఫెన్స్‌లో రిలయన్స్ ఇన్ఫ్రా ఒక్కో షేరుకు రూ. 63 వెచ్చించి 18 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం సుమారు రూ. 819 కోట్లు అవుతుంది. ఇక, ఆ తర్వాత షేరుకి రూ. 66 చొప్పున అదనంగా 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. దీనికి రూ. 1,263.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓపెన్ ఆఫర్‌కి స్పందన లేకపోయిన పక్షంలో ప్రమోటర్ల దగ్గర్నుంచే అదనంగా 7.1 శాతం వాటాలను కొనుగోలు చేస్తుంది. తద్వారా మొత్తం మీద 25.10 శాతం వాటాలు దక్కించుకోనుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ డీల్ పూర్తి కానుంది. ప్రస్తుతం రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఉన్న పిపావవ్ డిఫెన్స్‌లో ప్రమోటర్లకు 44.50 శాతం వాటాలు ఉన్నాయి. ఇక మైనారిటీ వాటాదార్లుగా ప్రమోటర్లు.. లావాదేవీ పూర్తయిన తర్వాత పిపావవ్ డిఫెన్స్ ప్రస్తుత ప్రమోటర్లు.. మైనారిటీ వాటాదార్లుగా ఉంటారు. ప్రమోటర్లకు సంబంధించి కంపెనీ బోర్డులో ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పేరు రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌గా మారుతుంది. సంస్థ చైర్మన్‌గా అనిల్ అంబానీ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు ఈ కొనుగోలు ఉపకరించగలదని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల క్రితం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు తాజా పరిణామం దోహదపడగలదని పిపావవ్ డిఫెన్స్ వ్యవస్థాపక ప్రమోటర్, చైర్మన్ నిఖిల్ గాంధీ చెప్పారు. రోడ్లు, మెట్రో రైలు, సిమెంటు తదితర రంగాల్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలు ఉన్నాయి. -
డిఫెన్స్ రంగంలోకి అనిల్ అంబానీ గ్రూప్
మూడు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన రిలయన్స్ ఇన్ఫ్రా న్యూఢిల్లీ: రక్షణ, విమానయాన విడిభాగాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ గురువారం ప్రకటించింది. భారీగా వృద్ధి అవకాశాలున్న ఈ రంగం మార్కెట్ పరిమాణం వచ్చే పదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా. దీనికోసం గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాక్చర్ నేతృత్వంలో మూడు అనుబంధ సంస్థ(సబ్సిడరీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం.. దేశంలో సమగ్ర రక్షణ పరికరాల పరిశ్రమ రూపుదిద్దుకోవడానికి అత్యం త సానుకూల పరిస్థితులను కల్పిస్తోంది. తయారీ రంగానికి జోష్‌నిచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో అడాగ్ గణనీయమైన పాత్రను పోషిస్తుంది. భారత భద్రత దళాలకు అత్యుత్తమ సేవలను అందించడంతో పాటు రక్షణ పరికరాల దిగుమతులను భారీగా తగ్గించడం, ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణులను తయారు చేయడం మా లక్ష్యం’ అని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. -
‘మెట్రో-2’ పనులు మొదటికి..
సాక్షి, ముంబై: మెట్రో-2 పనుల విషయమై ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే), రిలయన్స్ మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో-2 ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. దీంతో రెండోసారి టెండర్లను ఆహ్వానించేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెమ్మార్డీయే కొత్తగా విధించిన షరతుల నేపథ్యంలో ఐదేళ్లుగా చార్కోప్-బాంద్రా- మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టు పెండింగులో ఉంది. అప్పట్లో దీని అంచనా వ్యయం రూ.7,660 కోట్లు కాగా ఇప్పుడది త డిసి మోపెడైంది. ప్రస్తుతం రూ.12,000 కోట్లు వ్యయం కావచ్చని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. కాని టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఈ వ్యయం సుమారు రూ.20 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ ప్రాజెక్టుకు 2006 నవంబర్‌లో మంజూరు నివ్వగా, దీని నిర్మాణ పనుల కాంట్రాక్టును 2010లో రిలయన్స్‌కు ఇచ్చారు. కాని కార్ డిపో స్థలం సీఆర్‌జెడ్ పరిధిలో ఉండడంవల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్‌లో పడిపోయింది. పర్యావరణ శాఖ కూడా కొన్ని షరతులకు కట్టుబడి ఉంటే కార్ డిపోకు అనుకూలమైన స్థలం ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇలాంటి ఇబ్బందుల మధ్య ప్రాజెక్టు పనులు చేపట్టడం సాధ్యం కాదని రిలయన్స్ చేతులెత్తేసింది. అప్పటి నుంచి మెట్రో-2 ప్రాజెక్టుపై రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. దీంతో రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే ఆలోచించడం ప్రారంభించింది. చివరకు రిలయన్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఎమ్మెమ్మార్డీయేకు మార్గం సుగమమైంది. కాని రిలయన్స్‌ను ఒప్పించే ప్రయత్నాలు ఎమ్మెమ్మార్డీయే చేయలేదనే అనేక ఆరోపణలు వచ్చాయి. మరోపక్క ఈ ప్రాజెక్టు పెండింగులో పడిపోవడానికి రిలయన్స్ సంస్థే కారణమని ఎమ్మెమ్మార్డీయే పేర్కొంది. కాగా ఈ ప్రాజెక్టు కోసం బ్యాంక్ గ్యారంటీగా చెల్లించిన రూ.160 కోట్లు వెంటనే చెల్లించాలని రిలయన్స్ పట్టుబట్టింది. ముంబై మెట్రో ట్రాన్స్‌పోర్టు ప్రై.లి. నుంచి అధికారికంగా పత్రాలు లభించగానే బ్యాంక్ గ్యారంటీ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేసింది. -
మెట్రో చార్జీలపై మళ్లీ కోర్టుకు..
సాక్షి, ముంబై: ముంబై మెట్రో చార్జీల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ‘ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఎంఎంఓపీఎల్) కనీస చార్జీగా రూ.10, గరిష్టంగా రూ.40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెమ్మార్డీయే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాని ఈ పిటిషన్‌ను గత నెల 24న బాంబే హై కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో మెట్రో చార్జీలు పెంచేందుకు రిలయన్స్ ఇన్ఫ్రాకు మార్గం సుగమమైంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు, రైలు చార్జీల పెంపు, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. దీనికి తోడు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మెట్రో కొత్త చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఈ లోగానే హైకోర్టు న్యాయమూర్తుల బెంచి ఎదుట మరోసారి అప్పీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యు.పి.ఎస్.మదన్ చెప్పారు. మెట్రో రైలు ప్రారంభానికి ముందే చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇన్ఫ్రా మధ్య వాగ్వాదం జరిగింది. కనీస చార్జీలు రూ.తొమ్మిది, గరిష్ట చార్జీలు రూ.13 నిర్ణయించాలని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. కాని ఈ ప్రాజెక్టు పనులు జాప్యం జరగడంతో వ్యయం పెరిగిపోయి ప్రభుత్వం సూచించిన మేరకు తక్కువ చార్జీల వసూలు వీలుకాదని రిలయన్స్ తేల్చి చెప్పింది. అందుకు ముఖ్యమంత్రి చవాన్ నిరాకరించడమే గాకుండా ప్రారంభోత్సవం కూడా చేయనని మొండికేశారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన రిలయన్స్ ఇన్ఫ్రా ప్రారంభోత్సవం వాయిదా పడకుండా జాగ్రత్త పడింది. అందుకు ఒక నెల రోజుల వరకు కేవలం రూ.10ల నామమాత్ర చార్జీలకే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య ఎక్కడైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకారం ఈ నెల ఏడో తేదీన గడువు ముగియనుంది. ఎనిమిదో తేదీ నుంచి చార్జీలు మండిపోతాయి. అంతకు ముందే కోర్టును తిరిగి ఆశ్రయించాలని ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకున్నాయి. -
దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ
-
దుమ్మురేపిన మార్కెట్ - నిఫ్టీ సెంచరీ
నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్‌పై ఇన్వెస్టర్లకున్న భారీ అంచనాలు మార్కెట్లకు టానిక్‌లా పనిచేశాయ్. దీంతో అన్నివైపుల నుంచీ కొనుగోళ్లు పుంజుకోవడంతో ప్రధాన ఇండెక్స్‌లు ఉదయం నుంచీ పరుగందుకున్నాయి. ఫలితంగా ఏప్రిల్-జూన్’15 క్వార్టర్లో సెన్సెక్స్ ఏకంగా 3,027 పాయింట్లను జమ చేసుకోగలిగింది! ఇన్వెస్టర్ల సంపద సైతం రూ. 16 లక్షల కోట్లమేర ఎగసింది!! బడ్జెట్‌పై ఆశలు స్టాక్ మార్కెట్లకు బుల్ జోష్‌నిచ్చాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో జూలై 10న వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంస్కరణలతో కూడిన పటిష్ట బడ్జెట్‌ను ఆశిస్తున్న ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 314 పాయింట్లు ఎగసి 25,414 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సెంచరీ(103 పాయింట్లు) కొట్టి 7,611 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల గరిష్టంకాగా, దాదాపు ఐదేళ్ల తరువాత సెన్సెక్స్ మళ్లీ ఒక క్వార్టర్లో అత్యధికంగా లాభపడటం విశేషం!ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దాదాపు 14%(3,027 పాయింట్లు) పుంజుకోగా, అంతక్రితం 2009 సెప్టెంబర్(రెండవ) క్వార్టర్లో 18% జంప్‌చేసింది. వెరసి ఈ క్యూ1లో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 16 లక్షల కోట్లమేర ఎగసి రూ. 90 లక్షల కోట్లను అధిగమించింది. చమురు ధరల ఎఫెక్ట్ అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు దిగిరావడం కూడా సెంటిమెంట్‌కు అండగా నిలిచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 113 డాలర్లకు చేరగా, నెమైక్స్ 105 డాలర్ల వద్ద కదులుతోంది. పవర్ పంచ్: పవర్ రంగ షేర్లు సీఈఎస్సీ, జేపీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా పవర్, అదానీ, టొర ంట్, రిలయన్స్ పవర్, సీమెన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎన్టీపీసీ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్ దిగ్గజాలు ఆల్‌స్తోమ్ టీఅండ్‌టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, పిపావవ్ డిఫెన్స్, వాటెక్, ఎస్కేఎఫ్, ఎల్అండ్టీ, భెల్ 6-2% మధ్య జంప్‌చేశాయి. ఇక బ్యాంకింగ్ షేర్లు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, బీవోబీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ 7-2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. -
ఇక మెట్రో వాత!
- ఎమ్మెమ్మార్డీయే పిటిషన్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు - వ్యయం పెరిగినందున చార్జీల పెంపు సబబేనన్న ధర్మాసనం - దీంతో ముంబైకర్ల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ సాక్షి, ముంబై: మెట్రోరైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) దాఖలుచేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. దీంతో మెట్రో చార్జీలు పెంచేందుకు రిలయన్స్ ఇన్ఫ్రాకు మార్గం సుగమమైంది. మెట్రో చార్జీలపై ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని రిలయన్స్ ఉల్లంఘించిందని ఎమ్మెమ్మార్డీయే తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కాని విపరీతంగా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని చార్జీలు పెంచడం సమంజసమేనంటూ హై కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం జూలై ఎనిమిదో తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని మెట్రో అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం పెంచిన లోకల్ రైలు చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. రెట్టింపుగా పెరిగిన చార్జీలను తాము భరించలేమంటూ జనం రోడ్డెక్కుతుంటే మరోవైపు మెట్రో చార్జీల పెంపునకు మార్గం సుగమం కావడం గమనార్హం. రిలయన్స్ ఇన్ఫ్రా నిర్ణయం ప్రకారం జూలై ఎనిమిదో తేదీ నుంచి కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.40గా ఉండనుంది. ఈ ప్రకారమే చార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ ఇన్ఫ్రా అధికారులు చెబుతున్నారు. మెట్రో చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇన్ఫ్రా మధ్య చాలాకాలంగా వాగ్వాదం జరుగుతోంది. కనీస చార్జీ రూ.9, గరిష్ట చార్జీ రూ.13 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం అప్పట్లో సూచించింది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడం, నిర్మాణ వ్యయం తడిసి మోపెడు కావడంతో అప్పట్లో నిర్ణయించిన చార్జీల మేర వసూలు చేస్తే లాభాలమాట అటుంచి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రిలయన్స్ వాదిస్తోంది. కనీస చార్జీ రూ.10, ఆ తరువాత ప్రయాణ దూరాన్ని బట్టి రూ.20, 30, 40 చొప్పున వసూలు చేస్తామంటోంది. అందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ససేమిరా అన్నా రిలయన్స్ తన పట్టును వీడేలా కనిపించలేదు. ప్రారంభోత్సవం వాయిదా పడకుండా అప్పట్లో కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించినా కోర్టు తీర్పు నేపథ్యంలో రిలయన్స్ తాను అనుకున్న మేరకే చార్జీలు వసూలు చేసే అవకాశముంద ని చెబుతున్నారు. ఒక నెల రోజుల వరకు కేవలం రూ.10ల నామమాత్ర చార్జీకే వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ల మధ్య ఎక్కడైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించిన రిలయన్స్ జూలై ఏడు నుంచి చార్జీల మోత మోగిం చనుంది. మెట్రో చార్జీలు నిర్ణయించండి: హైకోర్టు ముంబై: ఘాట్కోపర్-వర్సోవా మధ్య ఉన్న 11.4 కి.మీ.ల ముంబై మెట్రో రైల్ కారిడార్‌కు చార్జీలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని మంగళవారం బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నెలలోనే మెట్రో సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంఎంఓపీఎల్ వసూలుచేస్తున్న మెట్రో చార్జీలను సవాలు చేస్తూ ఎమ్మెమ్మార్డీయే వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.డి. ధనూకా మంగళవారం తిరస్కరించారు. వచ్చే 9వ తేదీవరకు నిర్దేశిత దూరానికి కనిష్టంగా రూ.10, గరిష్టంగా 40 లు చార్జీ వసూలు చేయాలని ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఎంఓపీఎల్) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇతర భాగస్వాములైన ఎమ్మెమ్మార్డీయే వ్యతిరేకిస్తోంది. ఈ రైల్ కారిడార్‌కు కనిష్టంగా రూ.9, గరిష్టంగా రూ.13 వసూలు చేయాలని ఎంఎంఓపీఎల్ ప్రతిపాదించగా, మెట్రోను నడుపుతున్న ఎంఎంఓపీల్ మాత్రం చార్జీలను రూ.10 నుంచి రూ.40 వరకు వసూలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ఎమ్మెమ్మార్డీయేకు సంబంధించి .. మెట్రో కారిడార్ చార్జీలను భాగస్వామ్య సంస్థలన్నీ నిర్ణయించాయి కాబట్టి తగిన విధానాన్ని పాటించకుండా ఆర్ ఇన్ఫ్రా ఆ చార్జీలను మార్చలేదు. మెట్రో రైలును నడుపుతున్న ఎంఎంఓపీఎల్ విడుదల చేసిన విధివిధానాల చట్టబద్ధత, విలువలపై ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తగిన నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. దీని నిమిత్తం మధ్యవర్తులను నియమించుకోవాలని కోర్టు ఆదేశించింది. తమ తరఫున మధ్యవర్తుల పేర్లను సూచించాలని కోర్టు కోరగా భాగస్వామ్య సంస్థలేవీ ముందుకు రాలేదు. కాగా, ఈ మెట్రో ప్రాజెక్టును ప్రజా సంక్షేమం కూడా నిర్మించామని, లాభాపేక్షతో కాదని ఎమ్మెమ్మార్డీయే న్యాయవాది ఈపీ బరూచా వాదించారు. నామమాత్ర లాభాలపై నడిపే ఉద్దేశంతోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించామని కోర్టుకు విన్నవించారు. చార్జీల నిర్ణాయక కమిటీ సూచనల తర్వాత మాత్రమే చార్జీలను సవరించేందుకు అవకాశముందని ఆయన వాదించారు. దీనిపై రిలయన్స్ ఇన్ఫ్రా ప్రతివాదన చేస్తూ తాము నిర్ణయించిన చార్జీలు బెస్ట్ మున్సిపల్ బస్సులు, ఇతర రైల్వే చార్జీల కన్నా తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. వర్సోవా -ఘాట్కోపర్ మధ్య సాధారణ బస్సు చార్జీ రూ.25 ఉందని, అదే ఏసీ బస్సు అయితే రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఆటోలో వెళితే రూ.163, ట్యాక్సీలో వెళితే రూ.204 ఖర్చు అవుతుందన్నారు. వీటితో పోలిస్తే తాము వసూలు చేస్తున్న రూ.40 చాలా తక్కువ అని ఆర్ ఇన్ఫ్రా తరఫు న్యాయవాది ఇక్బాల్చాగ్లా వాదించారు -
తగ్గిస్తేనే వస్తా!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రా నిర్ణయించిన మెట్రో చార్జీలు ఆమోదయోగ్యంగా లేవని, నిర్హేతుకమైన చార్జీల పెంపుదల విషయంలో వెనక్కు తగ్గకపోతే ప్రారంభోత్సవానికి తాను వచ్చేదిలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంకేతాలిచ్చారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకొని పరుగు తీయడానికి సిద్ధమైన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చవాన్ ఇచ్చిన ఈ సంకేతాలు ఇప్పుడు నగరంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. 11.40 కిలోమీటర్ల మేర రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ మార్గంలో కనీస చార్జీ రూ. 9 గరిష్ట చార్జీ రూ. 13గా వసూలు చేయాలని మొదట నిర్ణయించారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కనీస చార్జీ రూ. 10, గరిష్ట చార్జీ రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్జీల పెంపుదల నిర్హేతుకమైనదని, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ ఇన్ఫ్రా కట్టుబడి ఉండాలని, లేదంటే తాను ప్రారంభోత్సవానికి రాననే సంకేతాలనిచ్చారు. బీజేపీ ఎంపీలు కిరీట్ సోమయ్య, గోపాల్‌శెట్టి అండదండలు, ప్రోత్సాహంతోనే రిలయన్స్ ఇన్ఫ్రా చార్జీలను పెంచే సాహసం చేస్తోందని చవాన్ ఆరోపించారు. చార్జీల పెంపుదలపై బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చవాన్ డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకున్న తర్వాతే పెంపుదల విషయమై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే టికెట్ల రేట్లు ఉండాలన్నారు. ఇదిలాఉండగా ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్, మెట్రో రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి అభయ్ మిశ్రా మాట్లాడుతూ.... ‘ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై నగరంలో మెట్రో సేవలను జూన్ 8, మధ్యాహ్నం 12 నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలను లక్షలాదిమంది నగరవాసులకు అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మెట్రో ప్రయాణంపై చేసే ప్రచారంలో భాగంగా మొదటి నెల రోజులు కేవలం రూ. 10 మాత్రమే చార్జీగా వసూలు చేస్తాం. ఈ చార్జీతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీలోని ఏ స్టేషన్ వరకైనా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం ప్రచారం కోసం నిర్ణయించిన చార్జీ మాత్రమే. ఆ తర్వాత మెట్రో చార్జీలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తామ’న్నారు. -
రిలయన్స్ ఇన్ఫ్రా లాభం రూ. 621 కోట్లు
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 621 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 721 కోట్లతో పోలిస్తే ఇది 24% క్షీణత. ఇదే కాలంలో ఆదాయం కూడా 24% తగ్గి రూ. 4,708 కోట్లకు పరిమితమైంది. ఆదాయంలో ఈపీసీ విభాగం నుంచి రూ. 883 కోట్లు మాత్రమే లభించాయని, గతంలో రూ. 2,267 కోట్లను సాధించామని కంపెనీ సీఈవో లలిత్ జలాన్ చెప్పారు. ఇక ఇతర ఆదాయం రెట్టింపై రూ. 328 కోట్లను తాకినప్పటికీ, రూ. 51 కోట్లమేర ఫారె క్స్ నష్టాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కాగా, పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 1,914 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 15% తగ్గి రూ. 19,034 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 17% జంప్‌చేసి రూ. 732 వద్ద ముగిసింది. -
ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ఆత్మాహుతి
కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ హెచ్చరిక సాక్షి, ముంబై: ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించనట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా అధినేత అనిల్ అంబానీ ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సర్కారును హెచ్చరించారు. ముంబైలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాందివలిలోని రిలయన్స్ ఇన్ఫ్రా కార్యాలయం ఎదుట ఆయన మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆయన ఆత్మాహుతికి పాల్పడతానంటూ శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న కంపెనీలు ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా అధినేత అనిల్ అంబానీపై నిరుపమ్ నిరసన వ్యక్తం చేశారు. -
వచ్చే నెల నుంచి చౌక విద్యుత్
ముంబై: అధిక కరెంటు చార్జీలతో ఇబ్బందిపడుతున్న ముంబైవాలాలకు ఇది తీపికబురు. నగరంలోని తొమ్మిది క్లస్టర్ల పరిధిలోని తొమ్మిది లక్షల మందికి చౌకధరలకే కరెంటు సరఫరా కానుంది. అయితే ఇందుకోసం నెల రోజులు నిరీక్షించాల్సి ఉంటుందని టాటా పవర్ చెబుతోంది. నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వినియోగదారుల టారిఫ్‌ను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశంతో టాటా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల ఒకటి నుంచే కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. ముంబైలోని మిగతా క్లస్టర్లలో విద్యుత్ సరఫరా చేసే రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కొత్త టారిఫ్ అమలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. ఇందుకోసం సంస్థ అధికారులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేయగా, మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఈఆర్సీ)ని ఆశ్రయించాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి వివరాలు సమర్పించడానికి ఎంఈఆర్సీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుమతిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 10 వరకు వాయిదా వేసింది. ఫలితంగా చౌక టారిఫ్ అమలు మరింత ఆలస్యమవుతుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త టారిఫ్‌ను అమలు చేయడానికి టాటా పవర్ విపరీతంగా జాప్యం చేస్తోందంటూ గత నెల 30న ఎంఈఆర్సీ మండిపడింది. నిర్దేశిత సమయానికి పంపిణీ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవుతోందంటూ చీవాట్లు పెట్టింది. ఈ విషయమై శుక్రవారం ఎంఈఆర్సీలో జరిగిన విచారణ సందర్భంగా టాటా పవర్ ప్రతినిధి స్పందిస్తూ చౌక టారిఫ్ అమలు వాయిదా వేయడానికి తగిన కారణాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా వివరించాలని కోరింది. దీనిపై స్పందించిన ఎంఈఆర్సీ.. జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని రియలన్స్‌ను నిలదీసింది. కొత్త టారిఫ్ అమలుకు ఎంత సమయం పడుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిలయన్స్ మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పలేదు. ఇరువర్గాల వాదనలు విన్న మండలి రిలయన్స్‌కు ఈ నెల 30 దాకా సమయం ఇచ్చింది. టాటా పవర్ సైతం డిసెంబర్‌లోపు పంపిణీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. -
డిసెంబర్లో ‘మెట్రో’ పరుగులు
సాక్షి, ముంబై: తరచూ వాయిదాపడుతూ వస్తున్న ‘వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్’ మెట్రోరైలు ఈ ఏడాది డిసెంబరులో కచ్చితంగా పరుగులు తీస్తుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) భరోసా ఇచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమలు చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను మరింత వేగవంతం చేయాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ముంబై మెట్రో-వన్ (రిలయన్స్ ఇన్ఫ్రా) కంపెనీని ఎమ్మెమ్మార్డీయే హెచ్చరించింది. కనీసం డిసెంబరు ఆఖరు వరకు మెట్రోరైళ్లను పరుగులు తీయించాలనే ధృడసంకల్పంతో ఈ సంస్థ ఉంది. దీనిపై చర్చించేందుకు బుధవారం పలువురు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మెట్రోరైలు డిసెంబరు నుంచి కచ్చితంగా పరుగులు తీస్తుందని సమావేశం అనంతరం ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యు.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారులు అనేక డెడ్లైన్లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క డెడ్లైన్నూ రిలయన్స్ పాటించలేకపోయింది. అనుకున్న విధంగా పనులు పూర్తికాకపోవడంతో మెట్రోరైలు ప్రారంభం తరచూ వాయిదా పడుతుండడం తెలిసిందే. మోనో రైలు ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అసలు ఈ మెట్రో, మోనో రైళ్లు పరుగెత్తుతాయా..? అనే సందిగ్ధంలో ముంబైకర్లు పడిపోయారని బాంద్రావాసి ఒకరు అన్నారు. ఈ నేపథ్యంలో రెండు కీలక ప్రాజెక్టుల్లో ఒకటి డిసెంబరులోపే అందుబాటులోకి వస్తుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ మదన్ స్పష్టంగా ప్రకటించారు. మోనోరైలు కూడా లేటే మోనోరైలు ప్రాజెక్టు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. అనుమతులు రాకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో సమస్యలు ఎదరవుతున్నాయి. ఇదిలా ఉంటే డెడ్లైన్లు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ అండ్ టీ కాంట్రాక్టు కంపెనీకి ఎమ్మెమ్మార్డీయే ఇటీవల రూ.25 వేలు జరిమానా విధించింది. అంతటితో ఊరుకోకుండా షోకాజ్ నోటీసు జారీచేసింది. చెంబూర్-వడాలా-సాత్‌రాస్తా మోనోరైలు ప్రాజెక్టు పనులు నగరంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అందులో భాగంగా జూలైలో బోయివాడ ప్రాంతంలో రెండు క్రేన్ల ద్వారా మోనో రైలు పిల్లర్లపై ఓ భారీ దిమ్మెను అమరుస్తుండగా అది అదుపుత ప్పి నేలపై పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ భారీ దిమ్మె క్రేన్‌పై పడడంతో అది పాక్షికంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఎల్ అండ్ టీకి జరిమానా, షోకాజ్ నోటీసు జారీచేసినట్లు ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు వివరించారు.