ముంబై: అధిక కరెంటు చార్జీలతో ఇబ్బందిపడుతున్న ముంబైవాలాలకు ఇది తీపికబురు. నగరంలోని తొమ్మిది క్లస్టర్ల పరిధిలోని తొమ్మిది లక్షల మందికి చౌకధరలకే కరెంటు సరఫరా కానుంది. అయితే ఇందుకోసం నెల రోజులు నిరీక్షించాల్సి ఉంటుందని టాటా పవర్ చెబుతోంది. నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వినియోగదారుల టారిఫ్‌ను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశంతో టాటా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల ఒకటి నుంచే కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. ముంబైలోని మిగతా క్లస్టర్లలో విద్యుత్ సరఫరా చేసే రిలయన్స్ ఇన్‌ఫ్రా మాత్రం కొత్త టారిఫ్ అమలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. ఇందుకోసం సంస్థ అధికారులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేయగా, మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఈఆర్సీ)ని ఆశ్రయించాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి వివరాలు సమర్పించడానికి ఎంఈఆర్సీ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు అనుమతిచ్చింది.
తదుపరి విచారణను డిసెంబర్ 10 వరకు వాయిదా వేసింది. ఫలితంగా చౌక టారిఫ్ అమలు మరింత ఆలస్యమవుతుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త టారిఫ్‌ను అమలు చేయడానికి టాటా పవర్ విపరీతంగా జాప్యం చేస్తోందంటూ గత నెల 30న ఎంఈఆర్సీ మండిపడింది. నిర్దేశిత సమయానికి పంపిణీ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవుతోందంటూ చీవాట్లు పెట్టింది. ఈ విషయమై శుక్రవారం ఎంఈఆర్సీలో జరిగిన విచారణ సందర్భంగా టాటా పవర్ ప్రతినిధి స్పందిస్తూ చౌక టారిఫ్ అమలు వాయిదా వేయడానికి తగిన కారణాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రా వివరించాలని కోరింది. దీనిపై స్పందించిన ఎంఈఆర్సీ.. జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని రియలన్స్‌ను నిలదీసింది. కొత్త టారిఫ్ అమలుకు ఎంత సమయం పడుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిలయన్స్ మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పలేదు. ఇరువర్గాల వాదనలు విన్న మండలి రిలయన్స్‌కు ఈ నెల 30 దాకా సమయం ఇచ్చింది. టాటా పవర్ సైతం డిసెంబర్‌లోపు పంపిణీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.