MERC
-
'మీ కలలకు రెక్కలు తొడగండి'
ముంబయి: భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలను రూపొందించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహమ్మద్ సయీద్ తమ రాష్ట్ర మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు చెప్పారు. వారి కలలకు రెక్కలు జతచేయాలని, ఏదనుకుంటే అది చేయాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని సూచించారు. కాశ్మీర్‌లోని మీడియా ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్(ఎంఈఆర్సీ) యూనివర్సిటీకి చెందిన 12మంది పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విధువినోద్ చోప్రాను గుర్తు చేశారు. వినోద్ తమకు గర్వించదగిన పుత్రుడని, అతడు రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. జమ్మూకశ్మీర్ వ్యాలీలో కళలు, సంస్కృతి, భాషలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ విద్యార్థులను ముంబయిలో జరుగుతున్న 17వ మామి చిత్రోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ విధంగా వారిని ప్రోత్సహించారు. -
వచ్చే నెల నుంచి చౌక విద్యుత్
ముంబై: అధిక కరెంటు చార్జీలతో ఇబ్బందిపడుతున్న ముంబైవాలాలకు ఇది తీపికబురు. నగరంలోని తొమ్మిది క్లస్టర్ల పరిధిలోని తొమ్మిది లక్షల మందికి చౌకధరలకే కరెంటు సరఫరా కానుంది. అయితే ఇందుకోసం నెల రోజులు నిరీక్షించాల్సి ఉంటుందని టాటా పవర్ చెబుతోంది. నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వినియోగదారుల టారిఫ్‌ను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశంతో టాటా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల ఒకటి నుంచే కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. ముంబైలోని మిగతా క్లస్టర్లలో విద్యుత్ సరఫరా చేసే రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కొత్త టారిఫ్ అమలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. ఇందుకోసం సంస్థ అధికారులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేయగా, మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఈఆర్సీ)ని ఆశ్రయించాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి వివరాలు సమర్పించడానికి ఎంఈఆర్సీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుమతిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 10 వరకు వాయిదా వేసింది. ఫలితంగా చౌక టారిఫ్ అమలు మరింత ఆలస్యమవుతుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త టారిఫ్‌ను అమలు చేయడానికి టాటా పవర్ విపరీతంగా జాప్యం చేస్తోందంటూ గత నెల 30న ఎంఈఆర్సీ మండిపడింది. నిర్దేశిత సమయానికి పంపిణీ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవుతోందంటూ చీవాట్లు పెట్టింది. ఈ విషయమై శుక్రవారం ఎంఈఆర్సీలో జరిగిన విచారణ సందర్భంగా టాటా పవర్ ప్రతినిధి స్పందిస్తూ చౌక టారిఫ్ అమలు వాయిదా వేయడానికి తగిన కారణాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా వివరించాలని కోరింది. దీనిపై స్పందించిన ఎంఈఆర్సీ.. జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని రియలన్స్‌ను నిలదీసింది. కొత్త టారిఫ్ అమలుకు ఎంత సమయం పడుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిలయన్స్ మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పలేదు. ఇరువర్గాల వాదనలు విన్న మండలి రిలయన్స్‌కు ఈ నెల 30 దాకా సమయం ఇచ్చింది. టాటా పవర్ సైతం డిసెంబర్‌లోపు పంపిణీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.