Cheap electricity
-
‘పవర్’ ఫుల్ ఏపీ ..‘రియల్ టైమ్’ హీరో
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి కూడా కేంద్ర ఇంధన శాఖ తీసుకెళ్లింది. వినియోగదారుడిపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చూడటమే చౌక విద్యుత్ కొనుగోలు ప్రధానోద్దేశం. ఈ విషయంలో తమిళనాడు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలే ముందు ఉన్నాయని కూడా కేంద్రం గుర్తించింది. వాస్తవానికి విద్యుత్ నిర్వహణ వ్యయంలో కీలకమైన విద్యుత్ కొనుగోళ్లను దారికి తేవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలో ఈ తరహా సంస్కరణలతో రూ.1,023 కోట్లమేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. రియల్ టైమ్ మార్కెట్ సద్వినియోగం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రియల్ టైమ్ మార్కెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ తీసుకోవాలంటే ఏ రాష్ట్రమైనా ముందుగా జాతీయ గ్రిడ్‌కు తెలపడం ఆనవాయితీ. గతంలో 24 గంటల ముందే ఈ విషయాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్)కు చెప్పాలి. ముందే విద్యుత్ డిమాండ్ చెప్పినా... వాస్తవ వినియోగంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. అంచనాకు మించి విద్యుత్ కొనడమో, అంతకన్నా తక్కువే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటమో జరుగుతోంది. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాలూ షెడ్యూల్ ఇవ్వడం వల్ల మార్కెట్లో విద్యుత్ డిమాండ్ పెరిగి, ఎక్కువ ధర పలుకుతోంది. రియల్ టైమ్ మార్కెట్ అందుబాటులోకొచ్చిన తర్వాత కేవలం 15 నిమిషాల ముందే బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యత తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడే కావాల్సిన విద్యుత్ తీసుకోవచ్చు. అవసరం లేకుంటే నిమిషాల్లోనే విద్యుత్ తీసుకోవడం ఆపేయవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంది. యూనిట్ కేవలం రూ.3.12కే కొనుగోలు రియల్ టైం మార్కెట్‌ను వినియోగించుకుని విద్యుత్ ధరలను తగ్గించడంలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీనే ముందుంది. రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వినియోగం దాదాపు 60 వేల మిలియన్ యూనిట్లు (ఎంయూలు)గా అంచనా వేశారు. గత జూన్ నుంచి డిసెంబర్ వరకు 6,500 (16%) ఎంయూలు యూనిట్ సగటున రూ.3.12కు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఏపీఈఆర్సీ మార్కెట్లో విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.67 వెచ్చించి కొనేందుకు కూడా అనుమతించింది. అయితే రూ.3.12కే కొనుగోలు చేయడం ద్వారా ప్రతి యూనిట్‌పైనా రూ.1.55 ఆదా చేయగలిగారు. ఈ విధంగా రూ.1,023.80 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని కేంద్ర విద్యుత్ శాఖ గుర్తించింది. తెలంగాణ సంస్థలు గరిష్టంగా 10 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో రూ. 300 కోట్లు మాత్రమే మిగిలిస్తే, తమిళనాడు 12 శాతం రియల్ టైమ్ మార్కెట్‌తో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. టీడీపీ హయాంలో రూ. 5.90 వరకు చెల్లింపు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులను లెక్కకు మించి ప్రోత్సహించారు. సౌర విద్యుత్‌కు ఏకంగా యూనిట్ రూ. 5.25 నుంచి రూ. 5.90 వరకు చెల్లించారు. పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నా యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లు చెల్లించేలా 41 దీర్ఘకాలిక పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా విద్యుత్ సంస్థలు రూ.70,250 కోట్ల అప్పుల్లోకి వెళ్లాయి. డిస్కమ్‌లు రూ.19,920 కోట్ల మేర అప్పుల పాలయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఇంత చౌకగా విద్యుత్ కొనలేదు. పక్కా ప్రణాళికతో విద్యుత్ సంస్థలు రియల్ టైమ్ మార్కెట్లో దూసుకుపోయేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు ముందు నుంచే పక్కా ప్రణాళికతో వెళ్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒప్పందాలున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వాస్తవ విద్యుత్ లభ్యతను అంచనా వేస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలు అంచనాలు పంపేందుకు కొన్ని గంటల వ్యవధి పట్టే పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇంటర్నెట్ ద్వారా ఉత్పత్తి కేంద్రాల నుంచి తక్షణ లభ్యత తెలుసుకునే విధానం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో మార్కెట్లో ఎక్కడ చౌకగా విద్యుత్ లభిస్తుందో తెలుసుకుంటున్నారు. మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తుంటే, రాష్ట్రంలో ఖరీదైన విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగ నిపుణులను వాడుకుంటున్నారు. మార్కెట్‌ను అంచనా వేసే సామర్థ్యం గల వారితో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలూ దీనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. -
పదేళ్లలో 6 వేల మెగావాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే పదేళ్లలో మరో 6 వేల మెగావాట్ల జల విద్యుదుత్పత్తి చేయాలని ఇంధనశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. స్థిర విద్యుత్ ఇవ్వాలన్న కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పంప్డ్ స్టోరేజీలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2030 జల విద్యుదుత్పత్తి ప్రణాళికను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ► ప్రస్తుతం రాష్ట్రంలో 1,700 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి 7,700 మెగావాట్లకు పెరగనుంది. ఫలితంగా చౌక విద్యుత్ లభిస్తుంది. మాచ్‌ఖండ్ కేంద్రం నుంచి మనకు యూనిట్ 90 పైసలకే లభిస్తోంది. ► పునరుత్పాదక ఇంధన వనరుల పీపీఏలు చేసుకోవాలంటే 30 శాతం వరకూ స్థిర విద్యుత్ (24 గంటలూ ఉత్పత్తి చేయగల విద్యుత్) అందుబాటులో ఉండాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. మరో 10 వేల మెగావాట్లకుపైగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అవసరం. ► ఆన్ రివర్ పంప్డ్ స్టోరేజీ, ఆఫ్ రివర్ పద్ధతుల్లో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులకు నెడ్‌క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. 29 ప్రాంతాలను గుర్తించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి 6 వేల మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుందని నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి వివరించారు. -
కృష్ణపట్నంపై ఏపీ పిల్లిమొగ్గలు
♦ చౌకగా విద్యుత్ ఇస్తామంటూ ప్రగల్భాలు: జగదీశ్‌రెడ్డి ♦ వానలతో విద్యుత్ శాఖకు రూ.5.5 కోట్లు నష్టం ♦ బాగా తగ్గిన విద్యుత్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం తరచూ వైఖరి మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నప్పుడు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ... తర్వాత తక్కువ ధరకే ఆ విద్యుత్ ఇస్తామని లేఖ రాసిందని చెప్పా రు. దానికి స్పందనగా 300 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాస్తే... మళ్లీ విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తం గా వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అవాంతరాలు, పునరుద్ధరణ చర్యలపై బుధవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలుత రూ.5.30కు యూనిట్ చొప్పున కృష్ణపట్నం విద్యుత్ విక్రయిస్తామంటూ ఏపీ ప్రభుత్వం టెండర్లలో పాల్గొన్నదన్నారు. కానీ రూ.4.63 చొప్పున కొనేందుకు తాము ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దీంతో ఆ ధర కన్నా పైసా తక్కువ ధరతో రూ.4.62 చొప్పున కృష్ణపట్నం విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని... తర్వాత మళ్లీ వెనుకడుగు వేసిందని మండిపడ్డారు. 20 వేల ఫిర్యాదులు:ఈ నెల 6న గాలివాన బీభత్సంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయని జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి సంబంధించి ప్రజల నుంచి 20వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టి 12 గంటల వ్యవధిలోనే 90శాతం ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఇందుకు విద్యుత్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గాలివానలు, విద్యుత్ అంతరాయాలతో డిమాండ్ ఒక్కసారిగా 6,000 మెగావాట్ల నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయిందని చెప్పారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం తప్పిందని మంత్రి తెలిపారు. రైతులు కోరితే పగలే విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని 8,900 మెగావాట్ల నుంచి 12,500 మెగావాట్లకు పెంచామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రైతులు కోరితే వ్యవసాయానికి పగలే 9 గంటలు సరఫరా చేస్తామన్నారు. -
వచ్చే నెల నుంచి చౌక విద్యుత్
ముంబై: అధిక కరెంటు చార్జీలతో ఇబ్బందిపడుతున్న ముంబైవాలాలకు ఇది తీపికబురు. నగరంలోని తొమ్మిది క్లస్టర్ల పరిధిలోని తొమ్మిది లక్షల మందికి చౌకధరలకే కరెంటు సరఫరా కానుంది. అయితే ఇందుకోసం నెల రోజులు నిరీక్షించాల్సి ఉంటుందని టాటా పవర్ చెబుతోంది. నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉపయోగించే వినియోగదారుల టారిఫ్‌ను తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశంతో టాటా ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల ఒకటి నుంచే కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉంది. ముంబైలోని మిగతా క్లస్టర్లలో విద్యుత్ సరఫరా చేసే రిలయన్స్ ఇన్ఫ్రా మాత్రం కొత్త టారిఫ్ అమలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. ఇందుకోసం సంస్థ అధికారులు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేయగా, మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఈఆర్సీ)ని ఆశ్రయించాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి వివరాలు సమర్పించడానికి ఎంఈఆర్సీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుమతిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 10 వరకు వాయిదా వేసింది. ఫలితంగా చౌక టారిఫ్ అమలు మరింత ఆలస్యమవుతుందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త టారిఫ్‌ను అమలు చేయడానికి టాటా పవర్ విపరీతంగా జాప్యం చేస్తోందంటూ గత నెల 30న ఎంఈఆర్సీ మండిపడింది. నిర్దేశిత సమయానికి పంపిణీ వ్యవస్థను నెలకొల్పడంలో విఫలమవుతోందంటూ చీవాట్లు పెట్టింది. ఈ విషయమై శుక్రవారం ఎంఈఆర్సీలో జరిగిన విచారణ సందర్భంగా టాటా పవర్ ప్రతినిధి స్పందిస్తూ చౌక టారిఫ్ అమలు వాయిదా వేయడానికి తగిన కారణాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా వివరించాలని కోరింది. దీనిపై స్పందించిన ఎంఈఆర్సీ.. జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని రియలన్స్‌ను నిలదీసింది. కొత్త టారిఫ్ అమలుకు ఎంత సమయం పడుతుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిలయన్స్ మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పలేదు. ఇరువర్గాల వాదనలు విన్న మండలి రిలయన్స్‌కు ఈ నెల 30 దాకా సమయం ఇచ్చింది. టాటా పవర్ సైతం డిసెంబర్‌లోపు పంపిణీ వ్యవస్థను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.