కృష్ణపట్నంపై ఏపీ పిల్లిమొగ్గలు
♦ చౌకగా విద్యుత్ ఇస్తామంటూ ప్రగల్భాలు: జగదీశ్‌రెడ్డి
♦ వానలతో విద్యుత్ శాఖకు రూ.5.5 కోట్లు నష్టం
♦ బాగా తగ్గిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం తరచూ వైఖరి మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నప్పుడు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ... తర్వాత తక్కువ ధరకే ఆ విద్యుత్ ఇస్తామని లేఖ రాసిందని చెప్పా రు. దానికి స్పందనగా 300 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాస్తే... మళ్లీ విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తం గా వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అవాంతరాలు, పునరుద్ధరణ చర్యలపై బుధవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలుత రూ.5.30కు యూనిట్ చొప్పున కృష్ణపట్నం విద్యుత్ విక్రయిస్తామంటూ ఏపీ ప్రభుత్వం టెండర్లలో పాల్గొన్నదన్నారు. కానీ రూ.4.63 చొప్పున కొనేందుకు తాము ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దీంతో ఆ ధర కన్నా పైసా తక్కువ ధరతో రూ.4.62 చొప్పున కృష్ణపట్నం విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని... తర్వాత మళ్లీ వెనుకడుగు వేసిందని మండిపడ్డారు.
20 వేల ఫిర్యాదులు:ఈ నెల 6న గాలివాన బీభత్సంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయని జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి సంబంధించి ప్రజల నుంచి 20వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టి 12 గంటల వ్యవధిలోనే 90శాతం ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఇందుకు విద్యుత్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గాలివానలు, విద్యుత్ అంతరాయాలతో డిమాండ్ ఒక్కసారిగా 6,000 మెగావాట్ల నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయిందని చెప్పారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం తప్పిందని మంత్రి తెలిపారు.
రైతులు కోరితే పగలే విద్యుత్
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని 8,900 మెగావాట్ల నుంచి 12,500 మెగావాట్లకు పెంచామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రైతులు కోరితే వ్యవసాయానికి పగలే 9 గంటలు సరఫరా చేస్తామన్నారు.