గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం
తెల్లవారుజామున ఇంటికొచ్చి తీసుకెళ్లిన ఆగంతకులు
పోలీసులుగా అనుమానిస్తున్న కుటుంబసభ్యులు
సమాచారం లేకపోవడంతో ఆందోళన
విదేశాలకు వెళ్లాల్సిన కుమారుడు తిరుగుముఖం
వల్లభాపురం (తెనాలి): ఓ రైతు కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీశ్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చి నిద్రలేపి మరీ తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ తెలియ రాలేదు. కుటుంబసభ్యులు ఫోను చేసినా సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కుమారుడు, విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు.
జగదీశ్ రెడ్డి భార్య శ్రీదేవి వివరాల ప్రకారం... వల్లభాపురానికి చెందిన జగదీశ్ రెడ్డి రైతు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ముగ్గురు ఆగంతకులు ఇంటికొచ్చి జగదీశ్ రెడ్డి కావాలని అడిగారు. స్నేహితులేమోనని భావించిన తల్లి జగదీశ్ రెడ్డిని నిద్ర లేపారు. బయటకు వచ్చిన ఆయన, లోపలకు వచ్చి షర్ట్ వేసుకుని వచ్చిన వారితోపాటు వెళ్లిపోయారు. నిద్రలో ఉన్న తనకు ఈ విషయాలేమీ తెలియదని శ్రీదేవి చెప్పారు.
మధ్యాహ్నం పొలానికి భోజనం తీసుకెళ్లే మనిషి వస్తే యధాప్రకారం క్యారేజీ ఇచ్చానని, తీరా చూస్తే పొలానికి వెళ్లలేదనీ, తెల్లవారుజామున ముగ్గురు ఆగంతకులు వచ్చి తీసుకెళ్లారని అప్పుడు తెలిసింది ఆమె చెప్పారు. దీంతో అక్కడ సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలిస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చినట్టు స్పష్టంగా కనిపించిందన్నారు. వారిని చూస్తుంటే మఫ్టీలో వచ్చిన పోలీసుల్లా ఉన్నారని భావించామనీ, దీనిపై గ్రామస్తులు, సమీప బంధువులు కొల్లిపర, తెనాలి రూరల్ పోలీసులను విచారిస్తే, తమకేమీ తెలియదని చెప్పడంతో అయోమయానికి గురయ్యామన్నారు.
ఆయన జాడ తెలియ రాలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డికి ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు లండన్‌లో చదువుతున్నారు. సెలవులని ఊరొచ్చిన కుమారుడు, లండన్ వెళ్లేందుకు ముందు రోజే హైదరాబాద్ వెళ్లారు. తండ్రి కిడ్నాప్ సమాచారంతో వారిద్దరూ వల్లభాపురం బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment