Jagdish Reddy
-
వల్లభాపురం రైతు కిడ్నాప్
వల్లభాపురం (తెనాలి): ఓ రైతు కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీశ్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చి నిద్రలేపి మరీ తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ తెలియ రాలేదు. కుటుంబసభ్యులు ఫోను చేసినా సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కుమారుడు, విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. జగదీశ్ రెడ్డి భార్య శ్రీదేవి వివరాల ప్రకారం... వల్లభాపురానికి చెందిన జగదీశ్ రెడ్డి రైతు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ముగ్గురు ఆగంతకులు ఇంటికొచ్చి జగదీశ్ రెడ్డి కావాలని అడిగారు. స్నేహితులేమోనని భావించిన తల్లి జగదీశ్ రెడ్డిని నిద్ర లేపారు. బయటకు వచ్చిన ఆయన, లోపలకు వచ్చి షర్ట్ వేసుకుని వచ్చిన వారితోపాటు వెళ్లిపోయారు. నిద్రలో ఉన్న తనకు ఈ విషయాలేమీ తెలియదని శ్రీదేవి చెప్పారు. మధ్యాహ్నం పొలానికి భోజనం తీసుకెళ్లే మనిషి వస్తే యధాప్రకారం క్యారేజీ ఇచ్చానని, తీరా చూస్తే పొలానికి వెళ్లలేదనీ, తెల్లవారుజామున ముగ్గురు ఆగంతకులు వచ్చి తీసుకెళ్లారని అప్పుడు తెలిసింది ఆమె చెప్పారు. దీంతో అక్కడ సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలిస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చినట్టు స్పష్టంగా కనిపించిందన్నారు. వారిని చూస్తుంటే మఫ్టీలో వచ్చిన పోలీసుల్లా ఉన్నారని భావించామనీ, దీనిపై గ్రామస్తులు, సమీప బంధువులు కొల్లిపర, తెనాలి రూరల్ పోలీసులను విచారిస్తే, తమకేమీ తెలియదని చెప్పడంతో అయోమయానికి గురయ్యామన్నారు. ఆయన జాడ తెలియ రాలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డికి ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు లండన్‌లో చదువుతున్నారు. సెలవులని ఊరొచ్చిన కుమారుడు, లండన్ వెళ్లేందుకు ముందు రోజే హైదరాబాద్ వెళ్లారు. తండ్రి కిడ్నాప్ సమాచారంతో వారిద్దరూ వల్లభాపురం బయలుదేరారు. -
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా?
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, మహాలక్ష్మి అమలు చేసి మహిళమధ్యే పంచాయతీ పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వాళ్లంతా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా? అని సూటిగా ప్రశ్నించారు. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు డబ్బులు ఇవ్వలేనపుడు కాళ్లు పట్టుకుని చెప్పుకోవాలన్నారు. రైతుబంధు పడట్లేదు.. కరెంట్ పోతుందని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తా అన్నారు ఏమైంది? అని నిలదీశారు. వారం పది రోజుల్లోనే కేసీఆర్ బయటకు వస్తారని చెప్పారు. తొందరలోనే నల్లగొండ వస్తానని చెప్పారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని అన్నారు. చదవండి: Amit Shah's Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు -
సగానికిపైగా అప్పులు తీర్చాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకే అప్పులు తెచ్చినట్లు మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పుల్లోనూ సగానికిపైగా తీర్చేశామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కింద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సైతం స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు అరకొరగా అందుతున్న విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని... అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వలేమని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుందా లేక అప్పుల సాకుతో కోతలు పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆస్తుల విలువ పెంచాం... 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉండగా అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ. 81,016 కోట్లకు పెరగ్గా ఆస్తుల విలువ రూ. 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని చెప్పారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ , క్యాండిల్స్ కొనుక్కురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోరుబావుల్లో నీళ్లు లేకపోతే ఇంట్లో ఎసరు పెట్టే పరిస్థితి లేదని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. బండెడ్లు అమ్ముకునే స్థితి నుంచి... బండెడ్లు అమ్మడం నుంచి పుస్తెలు అమ్ముకునే దాకా... ఏ బోరు వేశారో ఆ భూమి అమ్ముకొనే దాకా పరిస్థితి అప్పట్లో ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రైతులు దేశమంతా వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్ ద్వారా విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. 133 కేవీ, 220 కేవీ, 400 కేవీ అందుబాటులో లేక, బ్యాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదు.. జెన్కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్... తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే విద్యుదుత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రిడ్‌ను అనుసంధానించి విద్యుత్ సరఫ రా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవ స్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తరువాత 9 గంటల కరెంటు ఇవ్వగలిగామని, రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు. -
ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. సాధ్యమైనంత త్వరగా రిటైర్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రికి విన్నవించే సాహసం చేయలేకపోతున్నా. నా విన్నపాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రిని కోరుతున్నా..’ అని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. తాను బాధ్యతల నుంచి విరమించుకుంటున్నట్టు వార్తలు వస్తే మరోలా భావించరాదని విద్యుత్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జెన్కో ఆడిటో రియంలో జరిగింది. మంత్రి జగదీ శ్‌రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా మంత్రి సమక్షంలో ప్రభాకర్‌రావు చేసిన వ్యాఖ్యలు విద్యుత్ ఉద్యోగు లతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పదవీ విరమణ ఆలోచనను విరమించుకోవాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు సభా వేదికపై నుంచి ప్రభాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గత నెల 5న విద్యుత్ సౌధలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల్లో సైతం ప్రభాకర్‌రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించకపోవడంతో అప్పట్లో పెద్దగా చర్చ నీయాంశం కాలేదు. ప్రభాకర్‌రావు 2014 జూన్ 5 నుంచి జెన్కో, 2014 అక్టోబర్ 25 నుంచి ట్రాన్స్‌కో ఇన్చార్జి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలోనే ఆయన సీఎండీగా 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలుత ఆయ న్ను రెండేళ్ల పదవీ కాలానికి సీఎండీగా నియమించినా, ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. చివరిసారి పొడి గింపు సమయంలో తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆయనే సీఎండీగా కొనసాగుతారని పేర్కొంది. సూర్యుడి మీద ఉమ్మేయడమే: మంత్రి జగదీశ్‌రెడ్డి కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్‌స్టాండర్డ్ గాళ్లు.. సీఎండీ ప్రభాకర్‌రావు వంటివారి మీద అవాకు లు చెవాకులు పేలడం సూర్యుడి మీద ఉమ్మేయడ మే నని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆశించినదానికంటే అధిక పీఆర్సీ: ప్రభాకర్‌రావు విద్యుత్ ఉద్యోగులు ఆశించినదానికంటే అధిక పీఆర్సీ ఇచ్చామని ప్రభాకర్‌రావు చెప్పారు. వెయిటేజీ లేకుండా 10 నుంచి 15 శాతం పీఆర్సీని ఉద్యోగులు ఊహించు కుంటే, జీతాలు మాత్రం 18.5 శాతం పెరిగాయని అ న్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా, కో–చైర్మన్ శ్రీధర్, కో–కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ ఎడమ కాల్వకు నీరు
నాగార్జునసాగర్: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, అధికారులతో కలసి నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు హెడ్‌రెగ్యులేటర్ అంతర్భాగంలో గల స్విచ్‌బోర్డు వద్ద మంత్రి పూజలు చేశారు. నీటిని విడుదల చేసిన అనంతరం కృష్ణమ్మకు వాయినమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణాజలాల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరందుతోందని తెలిపారు. 2 దశాబ్దాల కాలంలో జూలైలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముందస్తుగా నీటిని విడుదల చే యడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎడమ కాల్వ పరిధిలో 6.16 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు రచించినట్లు వివరించారు. దీని ప్రకారం ఎడమ కాల్వ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, కలెక్టర్ రాహుల్‌శర్మ, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మంత్రిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కేక్ కట్ చేసి తినిపించగా, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు జగదీశ్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. -
మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజగొపాల్‌రెడ్డి సవాల్
నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌పాల్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీష్‌రెడ్డికి దమ్ముంటే మళ్లీ సూర్యాపేటలో గెలిచి చూపించమని అన్నారు. గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని, గత ఎన్నికల్లో నకిరేకల్‌లో ఛాలెంజ్ చేసి చూపించానని ధైర్యముంటే మళ్లీ తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. జగదీష్‌రెడ్డికి ఇదే చివరి ఎన్నికని మునుగోడులో పిచ్చి పిచ్చి వేశాలు మానుకోవాలని మండిపడ్డారు. ఇప్పటికైనా జగదీష్‌రెడ్డి వైఖరి మార్చుకోవాలని, టీఆర్ఎస్ నేతలు రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారని, అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. హుజురాబాద్ మాదిరిగా మునుగోడులో కూడా దళిత బంధు పథకం అమలు చేయలని డిమాండ్ చేశారు. అమలైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించానని గుర్తుచేశారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. -
'కాంగ్రెస్‌కు బ్రేకులు వేస్తున్నాం'
సాక్షి, సూర్యాపేట : ‘హూజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు బ్రేక్‌లు వేస్తున్నాం. 2018 ఎన్నికల్లోనే టీఆర్ఎస్ గెలుపునకు దగ్గరగా వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా కేసీఆర్ వెంటనే నడవాలని నాడు ఫలితాలు వచ్చాయి. మా పార్టీ గుర్తుకు సమీపంలో ఉండే గుర్తుతో అభ్యర్థిని బరిలోకి దింపి నాడు ఉత్తమ్ గెలిచాడు. అప్పుడు సీఎం అయితానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో ప్రజలు కొంత టర్న్ అయ్యారు. గుర్తుల కన్ఫ్యూషన్ కొంత దెబ్బతీసింది. టెక్నికల్‌గా గెలిచాడు తప్పా.. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేంద్ర మంత్రిని అవుతానని చెప్పి ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు ఆయన ప్రజలను మోసగించడానికి ఏమీ లేవు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయం’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. నియోజకవర్గ అభివృద్ధిని ఉత్తమ్ కోరలేదు.. ఉత్తమ్ గతంలో ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఏ పనులు చేయకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఆరేళ్లలో ఏ ఒక్క రోజు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించలేదు. హుజూర్‌నగర్‌లో ఈ సమస్య ఉంది.. పరిష్కారం చేయండని ముఖ్యమంత్రికి ఏనాడూ విజ్ఞాపన పత్రం ఇవ్వలేదు. జిల్లా మంత్రిగా నా దృష్టికి తీసుకురాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏనాడు జెడ్పీ సమావేశాలు, అధికారుల సమీక్షలకు హాజరుకాలేదు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ లేదు. ప్రజలంటే ఆయనకు నిర్లక్ష్యం. ఇవన్నీ ప్రజల్లో చర్చ జరుగుతుంది. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అభివృద్ధి జరగలేదని అతను ఒప్పుకుంటే అతనే చేయలేదన్న భావన ప్రజలకు చెప్పనట్లయింది. ఇవన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. సైదిరెడ్డి పుట్టింది.. పెరిగింది హుజూర్నగర్ నియోజవర్గంలోనే. వాళ్ల ఊరికి వాళ్ల నాన్న, అమ్మ సర్పంచ్‌గా చేశారన్నది అందరికి తెలుసు. వాళ్ల నాన్న పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. దీనిపై ఉత్తమ్ పొరపాటున మాట్లాడి నాలుక కరుచుకున్నాడు. సైదిరెడ్డిది ఏ ఊరంటే మఠంపల్లి మండలం గుండ్లపల్లి అన్ని ఎవరైనా చెబుతారు. అదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతిలది ఏ ఊరు అం టే చెప్పగలిగిన వారు వేళ్లమీద లెక్కపెట్టే వారు లేరు. ఇప్పుడు సైదిరెడ్డి రెండోసారి బరిలోకి దిగడంతో ఉత్తమ్‌కు నిద్ర పట్టడం లేదు. మేం బలోపేతమయ్యాం.. 2018 ముందు మాకు బూత్ స్థాయిలో పటిష్ట యంత్రాంగం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వా త జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము హుజూర్‌నగర్‌లో మెజార్టీ స్థానాలు సాధించుకున్నాం. 143 సర్పంచ్‌ల్లో 100 పైగా సర్పంచ్‌ల్లో మేమే ఉన్నాం. మెజార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు మేమే. బూత్ కమిటీలతో సహా నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఉత్తమ్ ఏదో రెండు రోజుల ముందు జిమ్మిక్కులు చేస్తాడన్నది ఇప్పుడు పారవు. కాంగ్రెస్ పార్టీ కన్నా సంస్థాగత నిర్మాణంలో మేమే బలంగా ఉన్నాం. బూత్‌ల దగ్గర ఉత్తమ్ ఆటలు సాగవు. బీజేపీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రోజు మాట్లాడుకుంటున్నారు. మా అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబు పాలనలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కిం ద వరుసగా ఏడేళ్లు ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టినా ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు వరి నాట్లు వేస్తే దాన్ని రక్షించడానికి డెడ్ స్టోరేజీలో కూడా నీళ్లను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల పంటను కాపాడాం. రైతులు ఈ మార్పును స్పష్టంగా గమనించారు. సైదిరెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారు.. హుజూర్నగర్ చైతన్యవంతమైన ప్రాంతం. ఉత్తమ్ గతంలో వరుసగా గెలుస్తుండడానికి ప్రధాన కారణం ఉంది. అక్కడ ఒక్కసారి పోటీ చేసిన వారు రెండోసారి పోటీ చేయలేదు. సైదిరెడ్డి.. ఇప్పుడు రెండోసారి పోటీలో ఉన్నారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత సైదిరెడ్డి నిత్యం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండి ఒక్కో గ్రామాన్ని ఐదారుసార్లు సందర్శించారు. స మస్యలను మంత్రిగా నాదృష్టికి, సీఎం దృష్టికి తీసుకొచ్చి పరిష్కా రానికి కృషిచేశారు. ఈ మార్పు ను ప్రజలు గమనిస్తున్నారు. -
‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’
సాక్షి, సూర్యపేట : ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మరణం పట్ల మంత్రి జగదీష్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హాస్యప్రపంచానికి వేణుమాధవ్ మరణం తీరని లోటు అన్నారు. సినీ గగన నీలాకాశంలో హాస్యాన్ని పండించిన నటుడు వేణుమాధవ్ సూర్యపేట జిల్లా బిడ్డ కావడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తి వేణుమాధవ్ అని కొనియాడారు. కళామతల్లి ఒడిలో ఒరిగిపోయిన వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి వేణుమాధవ్ మరణం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. వేణుమాధవ్ తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మంత్రి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. -
‘నల్లగొండ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తా’
సాక్షి, నల్లొండ : ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా సోమవారం ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవలో సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు, గొంగిడి సునీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఎంసెట్ వెబ్ ఆప్షన్లు వాయిదా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సజావుగా జరిగేనా? షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందా? అంటే ఉన్నతాధికారుల నుంచి ఏమోనన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు అడ్డంకిగా మారింది. కాలేజీలవారీగా ఫీజులను తేల్చకుండా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ఈనెల 27 నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్లు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ అర్హత సాధించి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్ష మందికిపైగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. ఫీజులు ఖరారు కాకపోవడం వల్లే... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను ఎంసెట్ కమిటీ ఈ నెల 9న ప్రకటించింది. దానికి అనుగుణంగా ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ ప్రవేశాల కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల 22న ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశాయి. అయితే వచ్చే మూడేళ్లలో ఏటా వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయకుండా ఆరు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి చైర్మన్‌ను నియమించకుండా జాప్యం చేసినందున యాజమాన్యాలు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేశాక ఎక్కువ తక్కువలు ఉంటే సర్దుబాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతు న్నాయి. అయితే ఆ తీర్పు కాపీ ఇంతవరకు ప్రభుత్వానికే అందలేదని అధికారులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు కాపీ అందగానే అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంటే ఈ నెల 27 నాటికి తీర్పు కాపీ అందుతుందా? అప్పీల్‌కు వెళతారా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. మరోవైపు ఆరు కాలేజీలే కాకుండా మరో 75 కాలేజీలు కూడా అవే ఉత్తర్వులను తమకు వర్తింపజేయాలంటూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేస్తే యాజమాన్య ప్రతిపాదిత ఫీజును 81 కాలేజీల్లో అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే తల్లిదండ్రులపై అధిక భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం, వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు వ్యవహారం, హైకోర్టు ఉత్తర్వులు తదితర అంశాలేవీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మంగళవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రి కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని, సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రేపటికల్లా స్పష్టత వచ్చేనా? ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభించేలా ప్రవేశాల కమిటీ ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది. ఇప్పటివరకు 37,909 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. 27వ తేదీన వెరిఫికేషన్ చేయించుకున్న వారు అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఫీజుల వ్యవహారమే తేలలేదు. ఫీజుల వ్యవహారంలో కోర్టు తీర్పు కాపీనే అందలేదంటున్న అధికారులు దానిపై అప్పీల్‌కు వెళ్లడం ఈ రెండు రోజుల్లో సాధ్యం కాకపోవచ్చన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వాయిదా వేయకుండా 27వ తేదీ నుంచి వెబ్ఆప్షన్లు ప్రారంభించాలంటే కోర్టు ఉత్తర్వుల అమలుతోనే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇప్పటివరకు కోర్టు తీర్పు కాపీ అధికారికంగా అందలేదని చెబుతున్నారు కాబట్టి కొత్త ఫీజులు ఖరారు చేసే వరకు పాత ఫీజులే అన్న ఆప్షన్‌ను పెట్టి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు వ్యవహారం అయినందున ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందా? లేదా? అన్నది బుధవారం తేలనుంది. మరోవైపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేయకుండా ఏమేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
వచ్చే రబీ నుంచి సాగుకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. 2018 రబీ సీజన్ నుంచి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు. సరఫరాలో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. సోమవారం శాసనమండలిలో విద్యుత్‌పై జరిగిన చర్చలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. వ్యవసాయానికి నిరంతరం కరెంటు సరఫరా వల్ల ఇబ్బందులు ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ.. వ్యవసాయంతో పాటు అన్ని రకాల అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులను టీడీపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందని, వైఎస్ రూ.1,200 కోట్ల బకాయిలను రద్దు చేశారని చెప్పారు. ప్రస్తుతం 14,133 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి సామర్థ్యముందని, 2024 వరకు దీన్ని 27,158 మెగావాట్లకు పెంచనున్నట్లు తెలిపారు. -
వృత్తిదారుల జీవనోపాధికి కృషి
మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటవ్యసాయం : వృత్తిదారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర విద్యుత్,ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువులో చేప పిల్లలను వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. మత్స్యకారుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేప పిల్లల పంపిణీకీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. జిల్లాలో 2017లో 2కోట్లు 11లక్షల చేప పిల్లలను పెంచడం ద్వారా 13 వేల కుటుంబాలకు రూ.10కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలోని చెరువులలో 5కోట్ల చేప పిల్లలను వదులుతున్నట్లు తె లిపారు. గతంలో చేప పిల్లలు విత్తనా లు, మార్కెటింగ్ కొరకు దళారులపై ఆ« దారపడినారని తెలిపారు. తెలంగాణ ప్ర భుత్వం వృత్తిదారుల జీవనోపాధిని, ఆ దాయాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అందులో భా గంగానే వందశాతం సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలనలో సాగునీటి రంగంపై చూపిన వి వక్ష వలన వ్యవసాయం, దాని అనుబం ధ రంగాలు దెబ్బతిని ఆర్థిక వ్య వస్థ చితి కిపోయినట్లయ్యిందన్నారు. అనంతరం చేప పిల్లల కార్యక్రమంపై ముద్రించిన మార్గదర్శకాల కరపత్రాన్ని మంత్రి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, ము న్సిపల్‌చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లిక, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, గ్రంధాలయ కమిటీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆర్డీవో మోహన్‌రావు, మత్స్యశాఖ అధికారి సౌజన్య పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌కు అవార్డు
కాంగ్రెస్ నేతలపై మండిపడిన మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన పార్టీగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి అవార్డు దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పోరాడటానికి ప్రజా సమస్యలేవీ లేక కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావకు వ్యవసాయ నాయకత్వ అవార్డు రావడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేస్తున్న విమర్శలు హుందాగా లేవన్నారు. గతంలో ఇలాంటి అవార్డు ఆ పార్టీ సీఎంలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండబోరని జోస్యం చెప్పారు. కేసీఆర్‌కు అవార్డు వస్తే ఉత్తమ్‌కు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశం లో మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు. -
దేశానికే తలమానికం
అంబేడ్కర్ విగ్రహ స్థాపనపై మంత్రి జగదీశ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దా లని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ విగ్రహ స్థాపన తెలంగాణకి ఓ రోల్ మోడల్ కావాలని ఆయన ఆకాంక్షిం చారు. శుక్రవారం సచివాలయంలో జగదీశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన విగ్రహ కమిటీ సభ్యులు డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. నమూనా లో కొన్ని మార్పులు చేయడంతో పాటు అంతిమంగా ఎలా ఉండాలి, ఎంత స్థలంలో నిర్మిం చాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లె్లపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, వేముల వీరేశం, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, జేఎన్టీయూ శిల్పి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఢిల్లీకి చెందిన డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతును రాజు చేసింది సీఎం కేసీఆరే..
మంత్రి జగదీశ్‌రెడ్డి సత్తుపల్లి: తెలంగాణ ఉద్యమం పుట్టిందే రైతుల కోసం.. రైతు ను రాజు చేసింది సీఎం కేసీఆరే అని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తు పల్లిలో డీసీసీబీ బ్రాంచ్ నూతన భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి ఆది వారం ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్ల పాల నలో పాలకులు రైతుల బాధలు పట్టించుకో లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాని కరెంట్‌కు బిల్లులు వసూలు చేసిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయంపై దృష్టిపెట్టి రైతులకు మేలు చేయాలనే తపనతో పని చేస్తున్నారన్నారు. రైతు రాజ్యమంటే తెలంగాణ ఒక్కటే అని.. వ్యవ సాయంలో రైతులను అన్ని విధాలుగా ఆదు కుంటూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రైతు లకు పంట రుణాలతో పాటు వ్యవసాయ ఆధారిత రుణాలను అందిస్తూ రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నర్సరీలకు ఉచిత విద్యుత్ దమ్మపేట(అశ్వారావుపేట): రాష్ట్రంలో నర్స రీలకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లి పల్లిలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక చాలామంది నర్సరీలను మూసివేసే పరిస్థితి ఉందన్నారు. -
కటింగ్ బాబూ.. కటింగ్..
సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట పట్టణంతో పాటు మండలంలో కూలి పనులు చేశారు. వివిధ రకాల పనులు చేసి రూ.2,37,500 సంపాదించారు. సూర్యాపేట బిగ్‌బాస్ క్షౌ రశాలలో బాలుడికి కటింగ్ కూడా చేశారు. చాయ్.. గరమ్ చాయ్.. హైదరాబాద్: వరంగల్ టీఆర్ఎస్ బహిరంగసభకు నిధుల సమీకరణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం పలుచోట్ల కూలి పనులు చేశారు. రికార్డు స్థాయిలో రూ.16.50 లక్షలు సంపాదించి కూలి నంబర్–1గా నిలిచారు. సనత్‌నగర్ టిఫిన్ సెంటర్లో టిఫిన్, లక్కీ హోటల్లో చాయ్, బీకేగూడలో పుస్తకాల అమ్మకం, జలవిహార్ వాటర్ జోన్లో టికెట్ల అమ్మారు. చేపలమ్మా.. చేపలూ.. హైదరాబాద్: బౌద్ధనగర్ వీధుల్లో మంత్రి పద్మారావుగౌడ్ మంగళవారం చేపలు విక్రయించారు. దీంతో పాటు వివిధ కూలీ పనులు చేసిన మంత్రి రూ.15 లక్షల ఆదాయం ఆర్జించారు. చిటికెలో చేస్తా.. సిమెంట్ పని.. హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గాంధీనగర్‌లో కూలీగా పనిచేసి మొత్తం రూ.3,51,232 సంపాదించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసినందుకు గాను రూ.1,00,116 చెక్కును అందుకున్నారు. గాంధీనగర్‌లోని ఉదయ్ ఆదితి డెవలపర్స్ వద్ద సిమెంట్ పని చేసి రూ. 2,51,116 సంపాదించారు. కూల్ కూల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాద్: గులాబీ కూలిలో భాగంగా ఎంపీ కే.కేశవరావు బంజారాహిల్స్ ఓరిస్ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌క్రీమ్‌కు తెలంగాణ ఐస్‌క్రీమ్‌గా నామ కరణం చేశారు. ఇందుకు గాను కేకే రూ.2 లక్షలు అందుకున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన వెంట ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నోవా ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పి మరో రూ.2 లక్షలు సంపాదించారు. -
తండ్రీకొడుకులు మృతి
తొండూరు: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తొండూరు మండలం సైదాపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై తండ్రీ కొడుకులు మృతిచెందారు. గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు శివనారాయణరెడ్డి, జగదీష్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
బీసీలంటే చులకన ఎందుకు?
‘కల్యాణలక్ష్మి’పై చర్చలో షబ్బీర్ - ఆదాయ పరిమితి పెంచాలి: పొంగులేటి - అర్హుల ఎంపికలో ఎమ్మెల్సీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ - ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వలేం: జగదీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. బీసీల కోసం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులను 12 శాతానికి మించి ప్రభుత్వం ఖర్చు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమని విమర్శిం చారు. కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ వర్గాలకు రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.34 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని, మరో రెండు నెలల్లో కొత్త బడ్జెట్ కూడా రాబోతుందని తెలిపారు. ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 49 శాతం ఖర్చు చేసిన సర్కారు, ఎస్సీలకు కేటా యించిన నిధుల్లో 69 శాతం ఖర్చు చేయలేదన్నారు. మైనార్టీలకు సంబంధించి షాదీ ముబారక్ పథకం కింద 25 వేల దరఖాస్తులు వస్తే కేవలం 9 వేల (30 శాతం) దరఖాస్తులనే క్లియర్ చేసిందని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మా యిల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ హయాంలోనే ఇలాంటి పథకాన్ని అమలు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన పథకం మంచిదే అయినప్పటికీ, అమలు తీరు ఘోరంగా ఉందని విమర్శించారు. ఆధార్ ఆధారంగానే పరిశీలన: జగదీశ్‌రెడ్డి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయా పథకాలకు అర్హులైన ఆడపిల్లల కుటుంబాలకు రూ.51 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని చెప్పారు. 2014–15లో 5,779 మంది, 2015–16లో 76,182 మంది, 2016–17లో 32,513 మంది ఆడపిల్లలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా లబ్ది పొందినట్లు వివరించారు. వివాహ సమయానికి సొమ్ము అందాలంటే నెల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతేడాది అందిన దరఖాస్తుల మేరకు ఈ ఏడాది అంచనాలను రూపొం దించి బడ్జెట్లో నిధులు (ప్రొవిజన్) కేటాయించా మని, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరికీ లబ్ది చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిర్ధిష్టమైన పరిధిలో అర్హు లను గుర్తించేందుకు ఎమ్మె ల్యేలకు మాత్రమే వీలున్నం దున, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిం చలేమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదాయ పరిమితి 3 లక్షలకు పెంచాలి పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఉద్దేశించిన ఈ పథకంలో ఆయా కుటుంబాల ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ.2.5 లక్షలకు, పట్టణాల్లో రూ.3 లక్షలకు పెంచాలని పొంగులేటి కోరారు. మజ్లిస్ సభ్యుడు రజ్వీ మాట్లాడుతూ.. మైనార్టీలు సమర్పించిన దర ఖాస్తుల పరిశీలనను సులభతరం చేయాలన్నారు. ఎమ్మెల్సీ లకు కూడా ఆయా పథకాల అమలు బాధ్య తలను అప్పగించాలని రామచంద్ర రావు కోరారు. -
వందేళ్ల వెలుగులకు పునాది
మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: జగదీశ్‌రెడ్డి • మా ప్రణాళికతోనే గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటల విద్యుత్ • ఏపీ సీఎంకు జానారెడ్డి వంతపాడుతున్నారని విమర్శ • ఇప్పుడొచ్చిన వెలుగులన్నింటికీ పునాదులు మావే: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. గత అరవైఏళ్ల నష్టాన్ని పూడుస్తూ.. వందేళ్ల వెలుగులకు పునాదులు వేస్తున్నామన్నారు. గృహాలకు 24 గంటలు, సాగుకు 9 గంటలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు చేపట్టామ ని తెలిపారు. శనివారం అసెంబ్లీలో విద్యుత్ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘కాకతీయ థర్మల్ ప్రాజెక్టు నుంచి 2,400 మెగావాట్లు, సింగరేణిలో 1,200, జూరాలలో 240, పులిచింతలలో 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేశాం. సోలార్ ద్వా రా వెయ్యి మెగావాట్లు, పవన విద్యుత్ ద్వారా 99 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాం. మణు గూరు, కొత్తగూడెం, దామరచర్ల ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్లు, ఎన్టీపీసీ 4,000, సౌర విద్యుత్ ద్వారా 2,200 మెగావాట్ల విద్యు దుత్పత్తికి పనులు మొదలయ్యాయి’ అని పే ర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల విద్యు త్ డిమాండ్ 2 వేల మెగావాట్లు పెరిగిందని, గత సెప్టెంబర్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 8,484 మెగావాట్ల డిమాండ్ రికార్డయిందని తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు 7,500 మెగా వాట్లు అవసరమని, ఆ మేరకు సరఫరా చేసే లా చర్యలు మొదలుపె ట్టామని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సెకను కూడా కరెంట్ పోని పరిస్థితి తెస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణ యం తీసుకున్నారని.. ఇప్పటికే 1,175 మంది జేఎల్ఎంఈలను క్రమబద్ధీకరించారన్నారు. పక్క రాష్ట్ర సీఎంపై జానాకు ప్రేమ ప్రతిపక్ష నేత జానారెడ్డిపై జగదీశ్‌రెడ్డి విరుచు కుపడ్డారు. జానారెడ్డి పక్క రాష్ట్ర సీఎంకు వంత పాడుతున్నారని, ఆ రాష్ట్రం తెలంగాణపై చేసిన కుట్రలు మరిచి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకట్లో ఉంచిన తోడు దొంగలు ఈ చర్చలో తలెత్తుకునే పరిస్థితి లేదని తెలిసి పారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రణాళిక లేకుంటే గ్రిడ్లాప్రభుత్వం కూలుతుంది: జానారెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత అదనంగా ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి జరగలేదని... ఇటీవ ల అందుబాటులోకి వచ్చిన 2 వేల మె.వా. విద్యుత్‌కు తామే పునాదులు వేశామని జానారె డ్డి స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం దేశమంతా అవస రానికి మించి విద్యుత్ ఉంది. దానికి కారణం మేము, మా ప్రభుత్వాలు కాదా? మాహయాం లో మొదలుపెట్టిన విద్యుత్ కేంద్రాల్లోనే నేడు ఉత్పత్తి జరుగుతోంది’ అని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకుంటే గ్రిడ్ కుప్పకూ లినట్లే ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. రెండోమారు వాకౌట్ విద్యుత్ అంశంపై 40 నిమిషాలు మాట్లాడిన జానారెడ్డి.. అనంతరం సభ నుంచి మరోసారి వాకౌట్ చేశారు. ‘మా సభ్యులు సభలో లేనప్పుడు ఇంతకు మించి మాట్లాడటం సబబు కాదు. సభ గౌరవంగా జరగాలంటే కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి.’’ అని డిమాండ్ చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ఉత్తమ్ కూడా బయటికి వెళ్లారు. మాట్లాడిందంతా మాట్లాడి, ప్రభుత్వం సమాధానం చెప్పే సమయంలో వాకౌట్ చేయడం సరికాదని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఒక్క యూనిట్ పెరగలేదు: బీజేపీ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా ఉత్పత్తి చేయలేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 13 ఏళ్ల కనిష్ట ఉత్పత్తికి పడిపోయామని, వ్యవసాయ వినియోగం పడిపోయిందన్నారు. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నా మని చెబుతున్నా 6 గంటలకు మించి ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌లో భారీగా విద్యుత్ కోతలు హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ ఏడాది 6,518 బ్రేక్డౌన్లు నమోదయ్యాయని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశా రు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరగా.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగిరం చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. విద్యుత్‌పై చర్చకు ఒకే ఒక్కడు కాంగ్రెస్ సభ్యులు వారించినా సభకు వెళ్లి మాట్లాడిన జానా.. సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసినందున విద్యు త్‌పై చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరిన సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి చాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వి ద్యుత్‌పై చర్చలో జానారెడ్డి పాల్గొనాలా? వద్దా అన్న అంశంపై చర్చ జరిగింది. విద్యుత్‌పై చర్చ ను బహిష్కరించాలని సభ్యులు సూచించారు. సభ్యుల ప్రతిపాదనను జానారెడ్డి వ్యతిరేకిం చారు. విద్యుత్ వంటి సమస్యపై మాట్లాడే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని, ప్రభుత్వా న్ని ఎండగట్టే అవకాశాన్ని వాడుకుందామని వ్యాఖ్యానించారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయా లను పట్టించుకోకుండానే సభలోకి వెళ్లి జానారెడ్డి మాట్లాడారు. తర్వాత వాకౌట్ చేశారు. -
మంత్రి జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై దాడి
- ఆరుగురికి గాయూలు -నల్లగొండ జిల్లా ఇంద్రపాలనగరంలో ఘటన రామన్నపేట (నల్గొండ జిల్లా) రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బంధువు ఇంటిపై ఆదివారం రాత్రి ప్రత్యర్థులు దాడి చేసి ఆరుగురిని గాయపరిచారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వివరాలు.. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మంత్రి బంధువు మందడి విద్యాసాగర్‌రెడ్డి, తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్ మధ్య కొంతగాలంగా విభేదాలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అదికాస్త పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. స్టేషన్లోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోగా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. కాగా, ఆగ్రహించిన పూలబాలకిషన్‌తో పాటు అతడి వర్గీయులు 30 మంది బైక్‌లపై విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. కాంపౌండ్‌లో ఉన్న మంత్రి బంధువులకు చెందిన ఇన్నోవా, ఐ ట్వంటీ కార్లను, ఇంటికిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ దొరికిన పొయ్యిలకట్టెలు,ఇనుపరాడ్, కంకరరాళ్లతో దాడిచేయడంతో విద్యాసాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, వారి బంధువులు బేతి మదన్‌మోహన్‌రెడ్డి, శోభ, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి సోదరుడు జయచందర్‌రెడ్డికి గాయూలయ్యాయి. దాడి జరిగిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం ఘటన స్థలాన్ని ఎస్పీ ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. -
కృష్ణపట్నంపై ఏపీ పిల్లిమొగ్గలు
♦ చౌకగా విద్యుత్ ఇస్తామంటూ ప్రగల్భాలు: జగదీశ్‌రెడ్డి ♦ వానలతో విద్యుత్ శాఖకు రూ.5.5 కోట్లు నష్టం ♦ బాగా తగ్గిన విద్యుత్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చే విషయంలో ఏపీ ప్రభుత్వం తరచూ వైఖరి మారుస్తూ పిల్లిమొగ్గలు వేస్తోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నప్పుడు కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ... తర్వాత తక్కువ ధరకే ఆ విద్యుత్ ఇస్తామని లేఖ రాసిందని చెప్పా రు. దానికి స్పందనగా 300 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాస్తే... మళ్లీ విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తం గా వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అవాంతరాలు, పునరుద్ధరణ చర్యలపై బుధవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలుత రూ.5.30కు యూనిట్ చొప్పున కృష్ణపట్నం విద్యుత్ విక్రయిస్తామంటూ ఏపీ ప్రభుత్వం టెండర్లలో పాల్గొన్నదన్నారు. కానీ రూ.4.63 చొప్పున కొనేందుకు తాము ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దీంతో ఆ ధర కన్నా పైసా తక్కువ ధరతో రూ.4.62 చొప్పున కృష్ణపట్నం విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని... తర్వాత మళ్లీ వెనుకడుగు వేసిందని మండిపడ్డారు. 20 వేల ఫిర్యాదులు:ఈ నెల 6న గాలివాన బీభత్సంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయని జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి సంబంధించి ప్రజల నుంచి 20వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టి 12 గంటల వ్యవధిలోనే 90శాతం ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఇందుకు విద్యుత్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గాలివానలు, విద్యుత్ అంతరాయాలతో డిమాండ్ ఒక్కసారిగా 6,000 మెగావాట్ల నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయిందని చెప్పారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం తప్పిందని మంత్రి తెలిపారు. రైతులు కోరితే పగలే విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని 8,900 మెగావాట్ల నుంచి 12,500 మెగావాట్లకు పెంచామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రైతులు కోరితే వ్యవసాయానికి పగలే 9 గంటలు సరఫరా చేస్తామన్నారు. -
సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన
కీసర మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సబ్ స్టేషన్లకు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 33/11 సబ్స్టేషన్ల ద్వారా నాగారం, రాంపల్లి, అంకిరెడ్డి గ్రామాలకు విద్యుత్ అందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల టీచర్ల సమస్యలపై త్వరలో భేటీ
ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకుల విద్యా సంస్థల టీచర్ల సమస్యలు, ఇతరత్రా అంశాలపై త్వరలోనే సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్సీ అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్టాఫ్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో మంత్రిని వివిధ సంఘాల నాయకులు కొల్లు వెంకటరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, ఏ.వి.రంగారెడ్డి, బి.సక్రు కలసి వినతిపత్రం సమర్పించారు. గురుకుల విద్యా డెరైక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్సీ 2015లో వేతన సవరణ చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచ ర్లు) చేయాలని, రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 2,800 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
రూ.7.12 కోట్లతో యాదాద్రి భవన్
నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి భవన్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. రూ.7.12 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి నిధులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులను సిరికో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. భవనంలో యాదాద్రి సమాచార కేంద్రంతో పాటు పెళ్లి మండపం, వేడుకలు నిర్వహించుకోవడానికి 500 మంది సరిపోయేలా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం(యాదగిరిగుట్ట), నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2016 సంవత్సరం క్యాలెండర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ఎన్.శివశంకర్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, సిరికో ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెలకూ 24 గంటల విద్యుత్
ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్: జగదీశ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో 6,800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా జెన్కో పని చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం 24 గంటల విద్యుత్‌సరఫరా చేయాలని కృతనిశ్చయంతో వున్నామన్నారు. నిరంతర విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన ‘అందరికీవిద్యుత్’ పథకం కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం గువాహటి (అస్సాం)లో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 9 గంటలకు పెంచే యోచనలో వున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏటా 10.67 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయింపులు ఉన్నప్పటికీ 2019-20 నాటికి బొగ్గు అవసరాలు 46.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని, ఈ మేరకు అదనపు బొగ్గును కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2,965 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేటు రంగంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
అధికారపక్షం బాధ్యతతో మెలగాలి
‘సాక్షి’తో ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎదురుదాడి సరికాదు.. జగదీశ్‌రెడ్డి భాషతో మనస్తాపం కలిగింది పద్దులపై చర్చలు సంతృప్తికరం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగే విధంగా బాధ్యత వహించాల్సింది అధికారపక్షమేనని కాంగ్రెస్ శాసనసభ్యులు జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన అనంతరం గురువారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దూకుడుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహజమన్నారు. అధికారపక్షం బాధ్యతాయుతంగా, సహనంతో సభను జరపాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షమే ఎదురుదాడికి దిగడం సరైంది కాదని చెప్పారు. ‘మంత్రి జగదీశ్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు బాగాలేదు. ఆయన వాడిన పదజాలం, భాష తీరు నాకు తీవ్ర మనస్తాపాన్ని కలి గించింది. జగదీశ్‌రెడ్డిని ఉద్యమంలో పాల్గొనలేదని నా అభిప్రాయం కాదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నాను’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాను చేసిన కృషి గురించి తెలియకుండా మంత్రి జగదీశ్ మాట్లాడటం సరికాదన్నారు. 2004లో మంత్రి పదవిని ఇవ్వాలని స్వయంగా సోనియాగాంధీ సూచించినా.. మూడేళ్ల తర్వాత పదవి వచ్చిందని, దీనికి కారణం ఏమిటో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. గత అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే కాంగ్రెస్ పనితీరు చాలా వరకు మెరుగుపడిందన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. కాంగ్రెస్‌లో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పద్దులపై ఈ బడ్జెట్ భేటీల్లో చర్చ జరిగిన తీరు బాగుందన్నారు. ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ ఇదీ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆచరణ సాధ్యంకాని, మేడిపండు బడ్జెట్ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది లక్షకోట్ల బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్లో కేవలం 65 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. దీనివల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులేవీ ఖర్చుచేయలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 79 మంది మాత్రమే అని అబద్దాలను చెబుతున్నదని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైనారని స్వయంగా చెప్పినా కేసీఆర్.. ఎక్స్‌గ్రేషియాను మాత్రం 530 మందికే ఇచ్చారని అన్నారు. కేజీ టు పీజీ విద్య విషయంలోనూ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. రైతాంగానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు విషయంలోనూ ఆచరణ సాధ్యంకాని మాటలతోనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా కేవలం కాగితాల మీదనే కేటాయింపులు చేసి ఖర్చుచేయకుండా మోసం చేసే ప్రయత్నమని చిన్నారెడ్డి విమర్శించారు. -
నేడు లండన్‌కు విద్యామంత్రి, డీఎస్ఈ
సాక్షి, హైదరాబాద్: లండన్‌లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ప్రపంచ విద్యా సదస్సుకు (ఎడ్యుకేషన్ వరల్డ్ సమ్మిట్) హాజరయ్యేందుకు నేడు (శనివారం) తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పాఠశాల విద్యా డెరైక్టర్ (డీఎస్ఈ) చిరంజీవులు లండన్‌కు బయలుదేరి వెళ్తున్నారు. తిరిగి ఈ నెల 23న హైదరాబాద్‌కు రానున్నారు. సదస్సులో పాల్గొనడంతోపాటు అక్కడి విద్యా విధానాలను వారు పరిశీలించనున్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ అమలుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దీన్ని అమలు చేసేందుకు అనుకూలమైన విధానాలపై అధ్యయనం చేయనున్నారు. -
మండలానికో ‘కేజీ టు పీజీ’
విధివిధానాలపై సమీక్షలో సీఎం 27న విద్యావేత్తలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాలను మండలానికొకటి ఏర్పాటు చేయాలని టీ సర్కార్ యోచిస్తోంది. తొలుత నియోజకవర్గానికొకటి ఏర్పాటుచేయాలనుకున్నా, మండలానికొకటిచొప్పున నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 27న విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని సూచించారు. మండలానికొకటి చొప్పున కేజీ టు పీజీ విద్యాలయాలు 2016-17 విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించినట్లు సమాచారం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ప్రవేశం పొందే వీలు కల్పించేందుకు 3 వేల నుంచి 4 వేల సీట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతి ఉన్న గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామస్థాయిలో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఈ ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తేవాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్తు పేర్లతో ఉన్న స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలనే అంశంపైనా సీఎం ఆలోచించినట్లు సమాచారం. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం
ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కారు కసరత్తు యూనివ ర్సిటీల వారీగా వివరాల సేకరణ వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీ చేయాలన్న యూజీసీ వర్సిటీలను బలోపేతం చేస్తాం.. వీసీలను నియమిస్తాం: జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు మళ్లీ పూర్వవైభవం రానుంది. బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న యూనివర్సిటీలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరాదరణకు గురైన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా కసరత్తు ప్రారంభించింది. సివిల్స్ విద్యార్థులకు ఉపయోగపడేలా ఇప్పటికే డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టగా.. సిబ్బందిని నియమిం చడం ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేయాలని సర్కారు యోచిస్తోంది. మరోవైపు అన్ని వర్సిటీలకు పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్లను(వీసీ) నియమించేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఈ నెలాఖరుకల్లా వీసీల నియామక ప్రక్రియను చేపట్టాలని తొలుత భావించినా.. వచ్చే నెలలో అన్ని వర్సిటీలకు వీసీలను నియమించాలని విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్ణయించారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలనూ భర్తీ చేయాలని ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీల వారీగా ఖాళీల వివరాలను సేకరించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలంటేనే చిన్నచూపు.. విద్యా రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెంచేందుకు, ఉన్నత విద్యను విస్తరింపజేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008 నుంచి 2009 మధ్య కాలంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయన మరణానంతరం విశ్వవిద్యాలయాలను పట్టించుకున్న నాథుడే లేడు. గడిచిన ఐదేళ్లలో విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేశారు. దీంతో ప్రతి యూనివర్సిటీలో అరకొర సిబ్బందే మిగిలారు. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. తెలంగాణలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తెలంగాణలోని ఏడు రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలకు 2,202 మంజూరైన పోస్టులు ఉంటే.. ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. కొత్త పోస్టులను అసలు మంజూరే చేయలేదు. పాలమూరు విశ్వవిద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. కేవలం ఎనిమిది మంది పూర్తిస్థాయి అధ్యాపకులతో వర్సిటీని నడపాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వర్సిటీల్లో పనిచేస్తున్న సగం మందికి, రిటైర్ అయిన వారికి అవసరమైన వేతనాల బడ్జెట్లోనూ కోతలు విధించారు. రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్లో పాత విధానంలో కేటాయింపులు చేసినా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అదనంగా నిధులను మంజూరు చేసింది. బోధన సిబ్బంది నియామకం ద్వారా వర్సిటీలను బలోపేతం చే సేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బోధనేతర సిబ్బందీ అరకొరే.. అన్ని యూనివర్సిటీల్లో బోధన సిబ్బందే కాదు.. బోధనేతర సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరైనవి ఉంటే 21 మందే పని చేస్తున్నారు. ఉస్మానియాలో 1,175 వరకు మంజూరైన పోస్టులుంటే 400 మంది పని చేస్తున్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో 14 మందికిగాను నలుగురే పని చేస్తున్నారు. మిగతా వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
జగదీష్...హల్చల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పట్టు సాధించేదిశగా కీలక అడుగు పడబోతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన 15 మంది జెడ్పీటీసీలు, 15మంది ఎంపీపీలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరంతా రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరనున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా క్రియాశీలకంగా జరుగుతున్న రాజకీయ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ పరిణామం వాస్తవమైతే అటు టీఆర్ఎస్తోపాటు ఇటు జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాజకీయంగా సరికొత్త బలాన్ని చేకూర్చనుంది. జెడ్పీచైర్మన్తోపాటు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో చేరేందుకు తీసుకున్న నిర్ణయం మంత్రి జగదీష్‌రెడ్డికి జిల్లా రాజకీయవర్గాలపై పూర్తిస్థాయిలో పట్టు తెచ్చిపెడుతుందని రాజకీయ పరిశీలకులంటున్నారు. అధికారం... ఆందోళన వాస్తవానికి జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం చాలారోజుల నుంచి జరుగుతోంది. అయితే, ఆయన మాత్రం అటు పార్టీ మారాలా, లేక కాంగ్రెస్‌లోనే ఉండాలా అనే అంశంపై చాలా రోజులుగా తర్జనభర్జనలు పడుతున్నారు. అటు పూర్తిగా తన చేరికను ఖండిస్తూనే, ఇటు పార్టీ మార్పు అంశాన్ని సజీవంగా ఉంచుతూ ఆయన జాగ్రత్త తీసుకున్నారు. బాలు పార్టీ మారేందుకు కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు కారణమని, వారి వైఖరి వల్లనే ఆయన పార్టీ మారుతున్నారని బాలునాయక్ వర్గీయులంటున్నారు. తన నియోజకవర్గంలో ఓ ముఖ్య నేత జోక్యం చేసుకుంటున్నారని, తన వర్గీయులను కూడా దూరం చేస్తున్నారనే ఆందోళనలో బాలునాయక్ ఉన్నారు. అదే విధంగా ఇటీవలి కాలంలో మరో రాష్ట్రస్థాయి నేత కూడా తనను దూరం పెడుతున్నారని బాలునాయక్ భావిస్తున్నారు. కొద్ది రోజులుగా మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి తన చేరికకు అంగీకరించి వచ్చారని సమాచారం. తన చేరిక కార్యక్రమం ఉండడంతో తాను చైర్మన్‌గా ఉన్న జెడ్పీ పనులు, ఆర్థిక రంగాలకు చెందిన స్థాయీసంఘాల సమావేశాలు సోమవారం జరగాల్సి ఉన్నా వాటిని వాయిదా వేసి మరీ మంగళవారం జరగనున్న కార్యక్రమాలపై బాలునాయక్ దృష్టి పెట్టడం గమనార్హం. మరోవైపు అధికార పార్టీలో ఉండడం ద్వారా అభివృద్ధికి అవకాశం ఉంటుందనే యోచనతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా అధికార పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగదీష్...హల్చల్ జిల్లా రాజకీయాలపై తన ముద్ర వేసుకునేందుకు మంత్రి జగదీష్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా ప్రజాప్రతినిధులు (వార్డుమెంబర్ల నుంచి ఎమ్మెల్సీల వరకు) టీఆర్ఎస్లో చేరారంటేనే జగదీష్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు పట్టున్న జిల్లాగా పేరుగడించిన నల్లగొండ జిల్లాను గులాబీ కోటగా మార్చడంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సహకారంతో జగదీష్‌రెడ్డి సఫలీకృతమవుతున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
నెలాఖరులోగా ఎంసెట్‌పై తుది నిర్ణయం
సొంతంగా నిర్వహణకు తెలంగాణ కసరత్తు ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ పరీక్ష ఇతర సెట్స్‌ను నిర్వహించేదీ తెలంగాణ రాష్ట్రమే న్యాయశాఖకు ఫైలు పంపించిన అధికారులు తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదంటున్న ఏపీ ఏపీ కౌన్సిల్ నేతృత్వంలోనే ఉమ్మడి ఎంసెట్ అంటున్న ఏపీ మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, తదితర ఉమ్మ డి ప్రవేశ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుం డా సొంతగానే ఎంసెట్ నిర్వహించేందుకు సిద్ధం చేసిన ఫైలును న్యాయశాఖ పరిశీలనకు పంపిన ప్రభుత్వం, మరోవైపు ఏపీ కోరితే తెలంగాణతో కలిపి ఏపీ కి పరీక్ష నిర్వహించి, ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమంటోంది. ఇదే అంశాన్ని ఏపీ అధికారులకు సూచించి నట్టు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు మాత్రం తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్ధత లేదని, ఏపీ ఉన్నత విద్యా మండలికే చట్టబద్ధత ఉందని చెబుతున్నారు. ఎంసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఏపీ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే జరుగుతాయంటున్నారు. అయితే, తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు రెండు ప్రత్యామ్నాయలపై తెలంగాణ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అదీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోని హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్షను నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఏపీ కలసి రాకపోతే తెలంగాణకే సొంతగా పరీక్ష నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి ఎలాంటి వివక్ష లేకుండా సేవ లు అందించేందుకు సిద్ధమని, పదేళ్లపాటు 15 శాతం ఓపెన్ కోటాలో ప్రతిభ ఆధారంగా ఏపీ విద్యార్థులకు సీట్లు కేటాయించేందుకు తాము సిద్ధమని గతంలో తెలంగాణ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్ తదితర సెట్స్ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వ సేవలను అడిగేందుకు ఏపీ సిద్ధ పడుతుందా? లేదా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. -
ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జంబ్లింగ్ లేకుండానే నిర్వహణ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశం సోమవారం బోర్డు కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్‌గా జగదీశ్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మార్చి 9 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్‌పరీక్షల ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్షించారు. నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇన్విజిలేటర్లుగా ఇతర శాఖల నుంచి ఉద్యోగులను కూడా తీసుకునే అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రాక్టికల్స్ కోసం 1,356 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాత పరీక్షలకు 1,250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,67,329 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,99,287 మంది విద్యార్థులు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన ట్లు మంత్రి తెలిపారు. కాగా, ఎంసెట్ నిర్వహణ విషయంలో విభజనచట్టం ప్రకారమే ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్, కన్సల్టెంట్ వీరభద్రయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పరీక్షలు సొంతంగానే..
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంకాంట్రాక్టు పద్ధతిన లీగల్ కన్సల్టెంట్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకం అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశం బోర్డు కార్యదర్శిగా శైలజా రామయ్యార్ ఏపీ ముందుకు రానందునే బోర్డు ఏర్పాటు విద్యార్థులు గందరగోళంలో పడకూడదనే ఈ నిర్ణయం: మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా సొంతంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ వద్ద బుధవారం జరిగిన సమావేశం అనంతరం.. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలన్నింటినీ ఏకకాలంలో చేపట్టింది. బోర్డులో అవసరమైన అధికారులను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. పరీక్షలకు అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వరుసగా నాలుగు ఉత్తర్వులను (జీవోలు 25, 26, 27, 28) గురువారం రాత్రి జారీ చేసింది. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజారామయ్యార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మరో ఉత్తర్వు (జీవో నం. 1253) జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదీ బోర్డు స్వరూపం.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఏర్పాటు ఉత్తర్వులు వెంటనే (4వ తేదీ నుంచే) అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971 నుంచి అన్వయించుకున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971 ప్రకారం తెలంగాణ విద్యా శాఖ మంత్రి బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డు కార్యదర్శిగా (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) శైలజా రామయ్యార్‌ను నియమించారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఇంటర్ విద్య కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్, ఇంటర్ విద్య కమిషనర్, సాంకేతిక విద్య కమిషనర్, పాఠశాల విద్య కమిషనర్, మెడికల్ సర్వీసెస్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, తెలుగు అకాడమీ డెరైక్టర్లు, బోర్డు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వ విద్యాలయాల వీసీలు నామినేటెడ్ సభ్యులుగా కొనసాగుతారు. వారితోపాటు ప్రభుత్వం నామినేట్ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు, ఇతర విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీల ప్రిన్సిపాల్లు ఆరుగురు, ఆదిలాబాద్‌లోని బొమ్‌కార్, హైదరాబాద్‌లోని భాగ్యనగర్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లతోపాటు మరో నలుగురిని బోర్డు నామినేటెడ్ సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుంది. మరో ముగ్గురికి మించకుండా విషయ నిపుణులు కో-ఆప్టెడ్ సభ్యులు ఉంటారు. ఈ ఉత్తర్వులు వారు నియమితులైన తేదీ నుంచి వర్తిస్తాయి. బోర్డు లీగల్ కన్సల్టెంట్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యను, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా ముక్తధర్‌ను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశించింది. ఏపీ వెనక్కి తగ్గినందునే.. ఉమ్మడి పరీక్షల నిర్వహణపై తాము చేసిన ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని... పైగా బోర్డు చట్టంలో లేని వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో తామే ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. చట్టం ప్రకారం ప్రస్తుత బోర్డుపై అధికారం తెలంగాణకే ఉన్నప్పటికీ ఇక గొడవలు వద్దని... విద్యార్థులు గందరగోళం పడకుండా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తాము బోర్డును ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అయితే బోర్డు ఏర్పాటు చేయకముందు జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూల్లోని ఇంటర్ బోర్డుపై అధికారం తెలంగాణదేనని... ఏపీ ప్రభుత్వం దీనికి అంగీకరించి, తెలంగాణకు అప్పగిస్తే ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. లేదంటే తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసుకుంటామన్నారు. అనంతరం కొద్దిసేపటికే అధికారులతో మంత్రి మరోసారి చర్చించారు. తర్వాత కొన్ని గంటలకే తెలంగాణ ఇంటర్‌బోర్డును ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే తెలంగాణలో పరీక్షల నిర్వహణ కోసం చర్యలు చేపట్టిన నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల నిర్వహణ అంశం గందరగోళంలో పడింది. ఇక రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే పరీక్ష జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పొడిచేడుకు శ్రీకాంతాచారి పేరు
విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ మోత్కూరు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి స్వగ్రామమైన పొడిచేడుకు శ్రీకాంతాచారి గ్రామంగా నామకరణం చేసేందుకు కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాంతాచారి ఐదవ వర్ధంతి సభ బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాంతాచారి ప్రాణత్యాగం, కీర్తి దేశానికే గర్వకారణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాత్రికి రాత్రే కరెంట్ తేలేం
మంత్రి జగదీష్‌రెడ్డి కోదాడ: అరవై ఏళ్ల ఆంధ్రా పాలకుల అసమర్ధపాలనే నేడు తెలంగాణలో కరెంట్ సమస్యకు కారణమని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ వస్తువు లాగా రాత్రికి రాత్రే కరెంట్‌ను కొనుక్కురాలేమని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకురాకుం డా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కరెంటులైన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల వేశాడన్నారు. మహారాష్ట్ర నుంచి యూనిట్‌కు రూ.8 నుంచి 10 వరకు ఖర్చు చేసైనా కోనుగోలు చేసి వ్యవసాయానికి అందిస్తు న్నామని చెప్పారు. పంటలెండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
వంశ మూలాలే ఆధారం!
‘స్థానికత’పై విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి డాక్యుమెంటరీ ఆధారాలున్నా ఓకే తల్లిదండ్రులను కోల్పోయిన వారి విషయంలో ప్రత్యేక నిబంధనలు ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చాకే కౌన్సెలింగ్‌పై యోచన ఉమ్మడి అడ్మిషన్లకు సిద్ధమే హైదరాబాద్: ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం(ఫాస్ట్)’ పథకం అమల్లో స్థానికత ధ్రువీకరణకు వంశ మూలాలను ప్రధాన ఆధారంగా తీసుకుంటామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఫాస్ట్’ పరిధిలోకి వచ్చేవారు ఎక్కువ శాతం నిరుపేదలే అయినందున అందరికీ డాక్యుమెంటరీ ఆధారాలు ఉండకపోవచ్చని... అయితే వారి తాత, తండ్రి వివరాలు గ్రామాల్లో ఎవరో ఒకరికి కచ్చితంగా తెలుస్తాయని ఆయన వివరించారు. ఈ అంశాన్నే ‘ఫాస్ట్’లో ప్రధాన ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారని.. డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్న వారికి మాత్రం ఈ అవసరం ఉండదని మంత్రి చెప్పారు. స్థానికత గుర్తింపులో సమస్యలు వస్తాయని పేర్కొనడం అర్థరహితమని, మార్గదర్శకాల్లో అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం, ఫాస్ట్ పథకం, విద్యాశాఖకు సంబంధించిన వివిధ అంశాలను వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయమే అంతిమం.. ఉన్నత విద్యా మండలి అనేది సలహా మండలి మాత్రమేనని, ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాకే సర్టిఫికెట్ల పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఏకపక్షంగా జారీ చేసింది. తెలంగాణలో ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జారీ కాలేదు. తప్పనిసరిగా అవసరమైన స్థానికత, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇక్కడి విద్యార్థులకు లేవు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చాకే రెవెన్యూ శాఖ ఆ పత్రాలను జారీ చేస్తుంది. మరి ఈలోగా నోటిఫికేషన్ ఇచ్చిన మండలి ఏ సర్టిఫికెట్లను పరిశీలిస్తుంది? కాలేజీలకు అనుమతులే రాకుండా సీట్లు ఎక్కడ కేటాయిస్తారు. రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. ఉమ్మడి కౌన్సెలింగ్‌కు మేం సిద్ధమే. వారే గిల్లికజ్జాలతో ఏపీ విద్యార్థులకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇంకా దోచుకుంటారా? తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు 58 శాతం ఫీజులు చెల్లిస్తామన్న చంద్రబాబు ప్రతిపాదన పట్ల మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘అది పనికిమాలిన, అర్థరహితమైన ప్రతిపాదన. ఊరుకుంటే రుణమాఫీలో అదే అమలు చేద్దామంటారు? 60 ఏళ్లుగా ఫేర్ షేర్ పేరుతోనే దోచుకున్నారు. ఇంకా వారి మోసాలను ఒప్పుకుంటామా?..’’ అని వ్యాఖ్యానించారు. 19న చేసే సర్వేకు, ‘ఫాస్ట్’కు సంబంధం లేదు.. ఈ నెల 19న నిర్వహించనున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’కు ఫాస్ట్ పథకానికి సంబంధం లేదని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ‘‘ఫాస్ట్ మార్గదర్శకాల ఆధారంగా స్థానికత, ఆదాయం సర్టిఫికెట్లను జారీ చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు ఇబ్బందేం ఉండదు. ఎవరైనా తల్లిదండ్రులు లేని వారున్నా, వివరాలు లభించని వా రున్నా.. వారికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే అంశాలు మార్గదర్శకాల్లో ఉంటాయి’’ అని చె ప్పారు. టి.ఉన్నత విద్యా మండలికి త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్‌ను ప్రకటిస్తామని తెలిపారు. కాలేజీల తనిఖీలు ఆపేది లేదు.. కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు తని ఖీలు చేయాల్సిందేనని, వాటిని ఆపే దిలేదని మంత్రి జగదీశ్ స్పష్టం చేశా రు. ‘‘ఫీజు బకాయిలు తెలంగాణ విద్యార్థులవే చెల్లిస్తాం. స్థాని కత ఆధారంగా తెలంగాణవారు కాదని తేలిన వారి ఫీజులను చెల్లించం..’’ అని పేర్కొన్నారు.బకాయిలు ఇవ్వకపోతే కాలేజీలు మాసేస్తామంటున్నారని విలేకరులు పేర్కొనగా... ‘మూసేసుకుంటే వారిష్టం. వ్యాపారాలు చేసుకుంటారు..’ అని పేర్కొన్నారు. ఇంకా ప్రవేశాలే ప్రారంభం కానప్పుడు యాజమాన్యాలతో మాట్లాడేందుకు తొందరేం వచ్చిందని పేర్కొన్నారు. ఇంటర్లో పారా మెడికల్ కోర్సుల పునరుద్ధరణ ఇంటర్మీడియెట్ వొకేషనల్‌లో పారా మెడికల్ కోర్సులను పునరుద్ధరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చించారు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాల్సి ఉన్నందున గతంలో రద్దు చేసిన ఆ కోర్సులను మళ్లీ ప్రవేశ పెడతామని చెప్పారు. ఇక పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల నోటిఫికేషన్ ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. నియామకాల సందర్భంగా కాంట్రాక్టు సీనియర్ అధ్యాపకులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకు..
గడువు పొడిగించాలని కోరనున్న తెలంగాణ సర్కార్ మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటి నాటికి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ముగించడం సాధ్యం కాదని రాష్ర్ట ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టంలో పాలనకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి అధికార యంత్రాంగం లేని పరిస్థితుల్లో ఎంసెట్ ప్రక్రియను హడావుడిగా ముగించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్లకు అక్టోబర్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని తిరిగి సుప్రీంకోర్టునకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, విద్యాశాఖ కార్యదర్శి నాగిరెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ అధికారులు అజయ్‌మిశ్రా, స్మితా సబర్వాల్లతో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేశారు. ఎంసెట్ అడ్మిషన్లకు సంబంధించిన చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అధికారులు సీఎంకు తేల్చిచెప్పారు. తెలంగాణలో 320 మంది సివిల్ సర్వీసు అధికారులు ఉండాల్సి ఉండగా, 70 మంది మాత్రమే ఉన్నారని, వీరితో అన్ని పనులు సకాలంలో చేయడం సాధ్యం కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను సుప్రీంకోర్టుకు నివేదించి గడువు పెంపు కోరాలని ముఖ్యమంత్రితో సహా అందరూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో కౌన్సెలింగ్ గడువు పెంపు కోసం అప్పీలు చేయనున్నారు. సుప్రీం ఉత్తర్వులనే అమలు చేయాలి ఎంసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘భూదాన్’ బోర్డు రద్దు సాక్షి, హైదరాబాద్: ‘భూదాన్’ భూములపై వస్తున్న ఆరోపణల నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమాలు జరిగితే ఉపేక్షించేదిలేదని, రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతం అయిన భూముల వివరాలను నాలుగైదు రోజుల్లో నివేదికల రూపంలో తన ముందుంచాలని ఆజ్ఞాపించారు. మొదటి చర్యగా భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులతో కదిలిన సర్కార్.. రంగారెడ్డి జిల్లాల్లో భూదాన్ చట్టాలను ఉల్లంఘించి హయత్‌నగర్ మండల పరిధిలోని బీబీనగర్‌లో పెద్ద ఎత్తున భూములను వాణిజ్య సంస్థలు, కార్పోరేట్ కళాశాలలకు కేటాయించారని వీటిపై విచారణ జరిపించాలని రెండు రోజుల కిందటే మాజీ మంత్రి శంకర్రావ్, మరికొందరు రంగారెడ్డి జిల్లా నేతలు ముఖ్యమంత్రికి రాతపూర్వకంగా విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించి ఆ వివరాలు తెలుసుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రికార్డులను వెంటనే బోర్డు కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అధికారులు వెంటనే నాంపల్లిలోని భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయం నుంచి కీలక రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. త్వరలో ఉన్నతస్థాయి కమిటీ..: ఆరోపణల నిగ్గుతేల్చేందుకు త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సీఎంతో రెవెన్యూ అధికారుల భేటీ ముగిసిన కొద్దిసేపటికే భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోర్డును పునరుద్ధరించే వరకు దాని బాధ్యతలను ముఖ్య కార్యదర్శి చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నగరంలోని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కేసీఆర్ ఆదేశించారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్ సమీపంలోని రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
విద్యారంగానికి పెద్దపీట
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) :తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామపంచాయతీ పరిధిలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధానరహదారి పక్కన రూ.9.60 కోట్లతో చేపట్టనున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న, సూర్యాపేట తహసీల్దార్ తిరందాసు వెంకటేషం, ఎంపీడీఓ డీయస్వీశర్మ, ఎంఈఓ శంకరాచారి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఇతర పార్టీలను వదిలిరండి భానుపురి : ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్లో చేరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గాంధీపార్కులో పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపే విధంగా సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడంలో కొంత స్వార్థముందన్నారు. ఆప్రాం తంలో సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని అందుకోసం సీఎం చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా ఉండేందుకు కుట్ర పన్ని ఆర్డినెన్స్ తె ప్పించారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఛత్తీస్‌ఘడ్ నుంచి 350 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు తమ అధినేత , సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. అందులో భాగంగానే దళితులకు మూడు ఎకరాల భూ మిని అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్ఎంపై చర్యలు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకిపురం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావుకు మెమో జారీ చేసిన ఆ పాఠశాల హెచ్ఎం సీహెచ్. శ్రీనివాస్‌రావుపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఖమ్మం డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రార్థన సమయంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు జై తెలంగాణ నినాదాలు చేయించారని, అందుకు అతడిని బాధ్యుడినిచేస్తూ ప్రధానోపాధ్యాయుడు మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని టీఆర్టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి రాధాక్రిష్ణ మంత్రికి వివరించారు. దీంతో ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్ఎంను విధుల నుంచి తొలగించాలని ఖమ్మం డీఈఓకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చారు.