విద్యారంగానికి పెద్దపీట
ఇమాంపేట(సూర్యాపేటరూరల్) :తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామపంచాయతీ పరిధిలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధానరహదారి పక్కన రూ.9.60 కోట్లతో చేపట్టనున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట ఆర్డీఓ వి.నాగన్న, సూర్యాపేట తహసీల్దార్ తిరందాసు వెంకటేషం, ఎంపీడీఓ డీయస్వీశర్మ, ఎంఈఓ శంకరాచారి పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి ఇతర పార్టీలను వదిలిరండి
భానుపురి : ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి టీఆర్‌ఎస్‌లో చేరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గాంధీపార్కులో పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇంటి పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వివిధ పార్టీల నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపే విధంగా సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడంలో కొంత స్వార్థముందన్నారు. ఆప్రాం తంలో సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని అందుకోసం సీఎం చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా ఉండేందుకు కుట్ర పన్ని ఆర్డినెన్స్ తె ప్పించారని విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఛత్తీస్‌ఘడ్ నుంచి 350 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు తమ అధినేత , సీఎం కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. అందులో భాగంగానే దళితులకు మూడు ఎకరాల భూ మిని అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని తెలిపారు.
ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్‌ఎంపై చర్యలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకిపురం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావుకు మెమో జారీ చేసిన ఆ పాఠశాల హెచ్‌ఎం సీహెచ్. శ్రీనివాస్‌రావుపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఖమ్మం డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రార్థన సమయంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు జై తెలంగాణ నినాదాలు చేయించారని, అందుకు అతడిని బాధ్యుడినిచేస్తూ ప్రధానోపాధ్యాయుడు మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని టీఆర్‌టీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి రాధాక్రిష్ణ మంత్రికి వివరించారు. దీంతో ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసిన హెచ్‌ఎంను విధుల నుంచి తొలగించాలని ఖమ్మం డీఈఓకు ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చారు.