సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకే అప్పులు తెచ్చినట్లు మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పుల్లోనూ సగానికిపైగా తీర్చేశామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కింద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సైతం స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు అరకొరగా అందుతున్న విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని... అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వలేమని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుందా లేక అప్పుల సాకుతో కోతలు పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఆస్తుల విలువ పెంచాం...
2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉండగా అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ. 81,016 కోట్లకు పెరగ్గా ఆస్తుల విలువ రూ. 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని చెప్పారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ , క్యాండిల్స్ కొనుక్కురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోరుబావుల్లో నీళ్లు లేకపోతే ఇంట్లో ఎసరు పెట్టే పరిస్థితి లేదని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు.
బండెడ్లు అమ్ముకునే స్థితి నుంచి...
బండెడ్లు అమ్మడం నుంచి పుస్తెలు అమ్ముకునే దాకా... ఏ బోరు వేశారో ఆ భూమి అమ్ముకొనే దాకా పరిస్థితి అప్పట్లో ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రైతులు దేశమంతా వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్ ద్వారా విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. 133 కేవీ, 220 కేవీ, 400 కేవీ అందుబాటులో లేక, బ్యాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి
ఉండేదన్నారు.
విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదు..
జెన్‌కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్...
తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే విద్యుదుత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రిడ్‌ను అనుసంధానించి విద్యుత్ సరఫ రా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవ స్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు తెలిపారు.
ఒక సంవత్సరంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తరువాత 9 గంటల కరెంటు ఇవ్వగలిగామని, రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment