మండలానికో ‘కేజీ టు పీజీ’ | Mandalani 'KG to PG' | Sakshi
Sakshi News home page

మండలానికో ‘కేజీ టు పీజీ’

Published Sat, Jan 17 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

Mandalani 'KG to PG'

  • విధివిధానాలపై సమీక్షలో సీఎం
  • 27న విద్యావేత్తలతో సమావేశం
  • సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాలను మండలానికొకటి ఏర్పాటు చేయాలని టీ సర్కార్ యోచిస్తోంది. తొలుత నియోజకవర్గానికొకటి ఏర్పాటుచేయాలనుకున్నా, మండలానికొకటిచొప్పున నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 27న విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

    తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని సూచించారు. మండలానికొకటి చొప్పున కేజీ టు పీజీ విద్యాలయాలు 2016-17 విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించినట్లు సమాచారం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ప్రవేశం పొందే వీలు కల్పించేందుకు 3 వేల నుంచి 4 వేల సీట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతి ఉన్న గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చించారు.

    గ్రామస్థాయిలో ఎల్‌కేజీ నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఈ ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తేవాలనుకుంటున్నారు.  ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్తు పేర్లతో ఉన్న స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలనే అంశంపైనా సీఎం ఆలోచించినట్లు సమాచారం. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement