T Sarkar
-
మండలానికో ‘కేజీ టు పీజీ’
విధివిధానాలపై సమీక్షలో సీఎం 27న విద్యావేత్తలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాలను మండలానికొకటి ఏర్పాటు చేయాలని టీ సర్కార్ యోచిస్తోంది. తొలుత నియోజకవర్గానికొకటి ఏర్పాటుచేయాలనుకున్నా, మండలానికొకటిచొప్పున నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేజీ టు పీజీ విద్య విధివిధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 27న విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలతో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయాలని సూచించారు. మండలానికొకటి చొప్పున కేజీ టు పీజీ విద్యాలయాలు 2016-17 విద్యా సంవత్సరంలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో వివరించినట్లు సమాచారం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలల్లో ప్రవేశం పొందే వీలు కల్పించేందుకు 3 వేల నుంచి 4 వేల సీట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హాస్టల్ వసతి ఉన్న గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామస్థాయిలో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఈ ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తేవాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలలు, జిల్లా, మండల పరిషత్తు పేర్లతో ఉన్న స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలనే అంశంపైనా సీఎం ఆలోచించినట్లు సమాచారం. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రానికి చెప్పి వాటా వాడుకుందాం
రబీకి కృష్ణా జలాల వినియోగంపై టీ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను ప్రస్తుత రబీ అవసరాలకు వినియోగించుకునే విషయంలో వాస్తవ పరిస్థితులను కేంద్రానికి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిం ది. కేంద్రానికి లేఖ ద్వారా లేదా స్వయంగా అన్ని విషయాలు వివరించాకే నీటి వినియోగం మొదలుపెట్టాలని భావిస్తోం ది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖకు స్పష్టమైన సూచనలు చేశారు. కేరళ పర్యటన నుంచి వచ్చిన కేసీఆర్.. ఆదివారం నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మూడు గంటలపాటు కృష్ణా జలాల వివాదం, ఏపీ చేస్తున్న వాదనలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే వాటా మేరకు నీటిని వినియోగించుకున్న ఏపీ ప్రస్తుతం మిగిలిన నీటిలోనూ వాటా కోరుతోందని, ఇందుకు అంగీకరించకపోవడంతో బోర్డుకు పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అధికారులు వివరించినట్లుగా తెలిసింది. ఈ దృష్ట్యా తాము సైతం రబీ అవసరాలకు నీటిని వినియోగించుకునే అంశమై బోర్డుకు లేఖ రాశామని, వారి నుంచి పెద్దగా స్పందన లేదని తెలిపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, అన్ని అంశాలను కేంద్ర జలవనరులశాఖకు తెలుపుతూ లేఖ రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అవసరమైతే త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ఉమా భారతిని కలసి సమస్యను వివరించి పరిష్కారం కోరతానని సీఎం వెల్లడించినట్లుగా తెలిసింది. కేంద్రానికి అన్ని వివరాలు తెలిపాకే రబీకి నీటి వినియోగం ప్రారంభిద్దామని ఆయన సూచించినట్లుగా సమాచారం. ఇక, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రబీ అవసరాలను కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం చేయాలనే దిశగా సమాలోచనలు చేసినట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిపి 4.20 లక్షల ఎకరాల మేరకు నీటి అవసరాలు ఉన్నా, నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాల మేరకే నీటిని ఇవ్వగలిగే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు సీఎంకు తెలియజేసినట్లుగా సమాచారం. ఖమ్మం జిల్లాను సైతం కలిపితే పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ దృష్ట్యా రబీ నుంచి ఖమ్మం ఆయకట్టును పక్కనబెట్టడమే ఉత్తమమని వారు సూచించినట్లుగా తెలిసింది. అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న 1.20 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు అవసరాలకు నీటిని మాత్రం యథాతథంగా విడుదల చేస్తామని వారు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. -
పుష్కరాలకు నిధుల కొరత!
కలెక్టర్లు అడిగింది రూ. 632 కోట్లు సర్కార్ ఇచ్చింది రూ. వందకోట్లు 39 ఘాట్లు కొత్తగా నిర్మించాలి ప్రతిపాదనలు పునఃపరిశీలించాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్లకు నిధుల కొరత ఏర్పడిందంటున్నారు అధికారులు. పుష్కర ఏర్పాట్ల కోసం గోదావరి తీరం వెంట ఉన్న ఐదు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలకు, ప్రభుత్వం కేటాయించిన నిధులకు పొంతన కుదరడం లేదు. పుష్కరాలకు 4 కోట్లమంది వస్తారని అంచనా వేసిన టీ సర్కార్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 67 పుష్కరఘాట్లు మెరుగుపరచాలని నిర్ణయించింది. నదీతీరాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రస్తుతం 28 పుష్కరఘాట్లుం డగా, మరో 39 ఘాట్లను కొత్తగా నిర్మించాలి. ఇందు కు రూ.632 కోట్లు కావాలని కలెక్టర్లు కోరగా, కేటాయించింది రూ.100 కోట్లే. డబ్బు అవసరమైతే, వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం సూచించింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నిధుల్లేకుండా ఏర్పాట్లెలా చేయా లో తెలియక కలెక్టర్లు అయోమయంలో పడ్డారు. వ్యయాన్ని తగ్గించండి : సీఎస్ రాజీవ్ శర్మ పుష్కర ఏర్పాట్లకు వేసిన అంచనా వ్యయాన్ని వీలైనంతగా తగ్గించేలా ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్ శర్మ సూచించారు. పుష్కరఘాట్లు, పార్కింగ్ స్థలాలు, పారిశుద్ధ్యం సౌకర్యాల కల్పనకు అందిన ప్రతిపాదనలపై రాజీవ్‌శర్మ సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ సలహా దారు కె.వి. రమణాచారితోపాటు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల, దేవాదాయ శాఖల కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్లను 4 విభాగాలకు అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గోదావరీ తీరం వెంట ఉన్న దేవాలయాల ఆధునీకరణ, విద్యుత్ అలంకరణ పనులను దేవాదాయ శాఖకు, ఘాట్లవద్ద బారికేడింగ్, స్నానఘట్టాల నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రోడ్లను మెరుగు పర్చే పనులను ఆర్అండ్బీ శాఖకు, పార్కిం గ్ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల నుంచి ఘాట్లవరకు రోడ్ల బాధ్యతను పంచాయతీరాజ్‌కు అప్పగించారు. ఘనంగా నిర్వహిస్తాం: రమణాచారి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సల హాదారు రమణాచారి తెలిపారు. అనవసర వ్యయా న్ని తగ్గించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. క్షేత్రస్థాయి అధికారులు భారీ ప్రతిపాదనలు పంపారన్నారు. పుష్కరాల నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం సాక్షి, హైదరాబాద్: పుష్కరాల నిర్వహణకు టీ సర్కార్ సోమవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్, తుమ్మల నాగేశ్వరరావులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. దేవాదాయ శాఖ కార్యదర్శి సబ్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కామన్ గుడ్‌ఫండ్ కమిటీ ఏర్పాటు హిందూ ధార్మిక సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్‌ఫండ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ విభాగాధిపతితోపాటు వేములవాడ రాజరాజేశర్వర స్వామి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి, మల్దాకల్ స్వయంభూ వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవో లు, యాదగిరిగుట్ట, వరంగల్ కాశీవిశ్వేశ్వరస్వామి, జగిత్యాల గుట్ట రాజేశ్వరస్వామి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. -
నంబర్ ప్లేట్ల మార్పిడి పిల్ మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం (టీఎస్) పేరుతో మార్చుకోవాలని వాహనదారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు సోమవారం మూసివేసింది. ఈ వ్యవహారంలో ప్రజల నుంచి, పిటిషనర్ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞాపన మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నెంబర్ ప్లేట్ల మార్పిడిపై ప్రభుత్వం జూన్ 17న జారీ చేసిన జీవో నంబర్ 3ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె.రామ్మోహన్ చౌదరి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం సోమవారం మరో అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచింది. తాము జారీ చేసింది ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమేనని, ప్రజల నుంచి, పిటిషనర్ నుంచి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం వివరించింది. అంతేకాక నంబర్‌తో నిమిత్తం లేకుండా ఏపీ స్థానంలో టీఎస్ మార్చుకునేలా ఉత్తర్వులు జారీ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలిపింది. దీంతో ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని, దీనిని మూసివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. తుది నోటిఫికేషన్‌పై అభ్యంతరాలుంటే పిటిషనర్ తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.