పుష్కరాలకు నిధుల కొరత!
- కలెక్టర్లు అడిగింది రూ. 632 కోట్లు
- సర్కార్ ఇచ్చింది రూ. వందకోట్లు
- 39 ఘాట్లు కొత్తగా నిర్మించాలి
- ప్రతిపాదనలు పునఃపరిశీలించాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్లకు నిధుల కొరత ఏర్పడిందంటున్నారు అధికారులు. పుష్కర ఏర్పాట్ల కోసం గోదావరి తీరం వెంట ఉన్న ఐదు జిల్లాల కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలకు, ప్రభుత్వం కేటాయించిన నిధులకు పొంతన కుదరడం లేదు. పుష్కరాలకు 4 కోట్లమంది వస్తారని అంచనా వేసిన టీ సర్కార్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 67 పుష్కరఘాట్లు మెరుగుపరచాలని నిర్ణయించింది. నదీతీరాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రస్తుతం 28 పుష్కరఘాట్లుం డగా, మరో 39 ఘాట్లను కొత్తగా నిర్మించాలి.
ఇందు కు రూ.632 కోట్లు కావాలని కలెక్టర్లు కోరగా, కేటాయించింది రూ.100 కోట్లే. డబ్బు అవసరమైతే, వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం సూచించింది. అయితే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. నిధుల్లేకుండా ఏర్పాట్లెలా చేయా లో తెలియక కలెక్టర్లు అయోమయంలో పడ్డారు.
వ్యయాన్ని తగ్గించండి : సీఎస్ రాజీవ్ శర్మ
పుష్కర ఏర్పాట్లకు వేసిన అంచనా వ్యయాన్ని వీలైనంతగా తగ్గించేలా ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ రాజీవ్ శర్మ సూచించారు. పుష్కరఘాట్‌లు, పార్కింగ్ స్థలాలు, పారిశుద్ధ్యం సౌకర్యాల కల్పనకు అందిన ప్రతిపాదనలపై రాజీవ్‌శర్మ సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ సలహా దారు కె.వి. రమణాచారితోపాటు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, దేవాదాయ శాఖల కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
పుష్కర ఏర్పాట్లను 4 విభాగాలకు అప్పగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. గోదావరీ తీరం వెంట ఉన్న దేవాలయాల ఆధునీకరణ, విద్యుత్ అలంకరణ పనులను దేవాదాయ శాఖకు, ఘాట్లవద్ద బారికేడింగ్, స్నానఘట్టాల నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రోడ్లను మెరుగు పర్చే పనులను ఆర్‌అండ్‌బీ శాఖకు, పార్కిం గ్ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల నుంచి ఘాట్లవరకు రోడ్ల బాధ్యతను పంచాయతీరాజ్‌కు అప్పగించారు.
ఘనంగా నిర్వహిస్తాం: రమణాచారి
పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వ సల హాదారు రమణాచారి తెలిపారు. అనవసర వ్యయా న్ని తగ్గించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. క్షేత్రస్థాయి అధికారులు భారీ ప్రతిపాదనలు పంపారన్నారు.
పుష్కరాల నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల నిర్వహణకు టీ సర్కార్ సోమవారం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్, తుమ్మల నాగేశ్వరరావులను ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. దేవాదాయ శాఖ కార్యదర్శి సబ్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
కామన్ గుడ్‌ఫండ్ కమిటీ ఏర్పాటు
హిందూ ధార్మిక సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్‌ఫండ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ విభాగాధిపతితోపాటు వేములవాడ రాజరాజేశర్వర స్వామి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి, మల్దాకల్ స్వయంభూ వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవో లు, యాదగిరిగుట్ట, వరంగల్ కాశీవిశ్వేశ్వరస్వామి, జగిత్యాల గుట్ట రాజేశ్వరస్వామి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌లు కమిటీలో సభ్యులుగా ఉంటారు.