- రబీకి కృష్ణా జలాల వినియోగంపై టీ సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను ప్రస్తుత రబీ అవసరాలకు వినియోగించుకునే విషయంలో వాస్తవ పరిస్థితులను కేంద్రానికి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిం ది. కేంద్రానికి లేఖ ద్వారా లేదా స్వయంగా అన్ని విషయాలు వివరించాకే నీటి వినియోగం మొదలుపెట్టాలని భావిస్తోం ది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖకు స్పష్టమైన సూచనలు చేశారు.
కేరళ పర్యటన నుంచి వచ్చిన కేసీఆర్.. ఆదివారం నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మూడు గంటలపాటు కృష్ణా జలాల వివాదం, ఏపీ చేస్తున్న వాదనలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే వాటా మేరకు నీటిని వినియోగించుకున్న ఏపీ ప్రస్తుతం మిగిలిన నీటిలోనూ వాటా కోరుతోందని, ఇందుకు అంగీకరించకపోవడంతో బోర్డుకు పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అధికారులు వివరించినట్లుగా తెలిసింది.
ఈ దృష్ట్యా తాము సైతం రబీ అవసరాలకు నీటిని వినియోగించుకునే అంశమై బోర్డుకు లేఖ రాశామని, వారి నుంచి పెద్దగా స్పందన లేదని తెలిపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, అన్ని అంశాలను కేంద్ర జలవనరులశాఖకు తెలుపుతూ లేఖ రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అవసరమైతే త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ఉమా భారతిని కలసి సమస్యను వివరించి పరిష్కారం కోరతానని సీఎం వెల్లడించినట్లుగా తెలిసింది.
కేంద్రానికి అన్ని వివరాలు తెలిపాకే రబీకి నీటి వినియోగం ప్రారంభిద్దామని ఆయన సూచించినట్లుగా సమాచారం. ఇక, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రబీ అవసరాలను కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం చేయాలనే దిశగా సమాలోచనలు చేసినట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిపి 4.20 లక్షల ఎకరాల మేరకు నీటి అవసరాలు ఉన్నా, నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాల మేరకే నీటిని ఇవ్వగలిగే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు సీఎంకు తెలియజేసినట్లుగా సమాచారం.
ఖమ్మం జిల్లాను సైతం కలిపితే పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ దృష్ట్యా రబీ నుంచి ఖమ్మం ఆయకట్టును పక్కనబెట్టడమే ఉత్తమమని వారు సూచించినట్లుగా తెలిసింది. అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న 1.20 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు అవసరాలకు నీటిని మాత్రం యథాతథంగా విడుదల చేస్తామని వారు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.