సాక్షి, హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, జి.రంజిత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సీఎస్ సోమేశ్ కుమార్, తదితరులున్నారు.
కాగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజులపాటు ఉండే అవకాశం ఉంది. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్ కోసం సీఎం కార్యాలయ వర్గాలు ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం. వచ్చేనెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుకుండగా, పోటీలో ఉన్న మార్గరెట్ ఆల్వాకు టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక అంశమై తమ పార్టీ ఎంపీలతో పాటు భావ సారూప్య పార్టీల ఎంపీలతోనూ సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
వివిధ జాతీయ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జాతీయ మీడియాతోను సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కాగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కేసీఆర్, వాటిని దేశవ్యాప్తంగా సదస్సులు, సభల ద్వారా వివరించాలని భావిస్తున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించేందుకు సీఎం రోడ్‌మ్యాప్‌నూ ఇటీవల రూపొందించారు.
రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్‌తో పాటు పలువురు రైతు సంఘాల నేతలతోనూ ఈ సభల నిర్వహణపై చర్చించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఈ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆదివారం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment