సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోరుకుంటున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ నెలాఖరులో బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సుమారు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ ఈ సమావేశం నిర్వహణ తీరుతెన్నులపై కసరత్తు చేసి కార్యాచరణ సిద్ధం చేశారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్‌తో 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్ చేపట్టే ధర్నాలో కేసీఆర్ పాల్గొనేదీ లేనిదీ ఇంకా తెలియనప్పటికీ 12న సీఎం రాష్ట్రానికి చేరుకుంటారు. ఆ తర్వాత బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నేతలతో భేటీ తేదీ, ఇతర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ నెలాఖరులో జరిగే జాతీయ స్థాయి సమావేశానికి సంబంధించిన ఎజెండాను కూడా బీజేపీయేతర సీఎంలు, ఇతరులతో కేసీఆర్ చర్చించి రూపొందిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌తో సమావేశమైన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించడం తెలిసిందే.
అఖిలేశ్‌తో చర్చల బాధ్యత కవితకు..
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ జనవరిలోనే హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అవగా యూపీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాద్ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ సాధ్యం కాలేదు. దీంతో అఖిలేశ్‌తో సంప్రదింపుల బాధ్యతను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేసీఆర్ తాజాగా అప్పగించారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌తోపాటు వెళ్తున్న కవిత గతంలో ఎంపీగా చేసిన అనుభవంతో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగిన కేసీఆర్ ముంబై, ఢిల్లీ, జార్ఖండ్ పర్యటనల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో జాతీయ మీడియాలో తమ గొంతు వినిపించేందుకు సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించింది. సంజయ్ నియామకం, ఎంపికలో కవిత క్రియాశీలంగా వ్యవహరించినట్లు సమాచారం.
ఢిల్లీ దీక్ష తర్వాత వరి పోరు కార్యాచరణ
యాసంగి ధాన్యం కొనుగోలుపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసన గళం వినిపిస్తున్న టీఆర్‌ఎస్ ఈ నెల 11 తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణపైనా కేసీఆర్ దృష్టి సారించారు. 12న మంత్రివర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిరసనలు కొనసాగించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. యాసంగి వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఇప్పటికే సీఎం స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఢిల్లీ టూర్ తర్వాత మళ్లీ టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!
Published Sun, Apr 10 2022 1:49 AM | Last Updated on Sun, Apr 10 2022 1:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment