సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పేరుతో ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం (టీఎస్) పేరుతో మార్చుకోవాలని వాహనదారులను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు సోమవారం మూసివేసింది. ఈ వ్యవహారంలో ప్రజల నుంచి, పిటిషనర్ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞాపన మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నెంబర్ ప్లేట్ల మార్పిడిపై ప్రభుత్వం జూన్ 17న జారీ చేసిన జీవో నంబర్ 3ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జె.రామ్మోహన్ చౌదరి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం సోమవారం మరో అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచింది. తాము జారీ చేసింది ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమేనని, ప్రజల నుంచి, పిటిషనర్ నుంచి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం వివరించింది.
అంతేకాక నంబర్‌తో నిమిత్తం లేకుండా ఏపీ స్థానంలో టీఎస్ మార్చుకునేలా ఉత్తర్వులు జారీ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని తెలిపింది. దీంతో ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని, దీనిని మూసివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. తుది నోటిఫికేషన్‌పై అభ్యంతరాలుంటే పిటిషనర్ తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
నంబర్ ప్లేట్ల మార్పిడి పిల్ మూసివేత
Published Tue, Dec 2 2014 3:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement