ఆదేశాల అమలులో అంత నిర్లక్ష్యమెందుకు ?
- ఏపీ, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖపై హైకోర్టు ఆగ్రహం
- వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ముఖ్య కార్యదర్శులకు ఆదేశం
- తదుపరి విచారణ 8కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ముఖ్య కార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
ఇరు రాష్ట్రాల్లో జరిగిన అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ల నియామకం విషయంలో అధికారుల తీరుపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 2008 నాటి నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ జరిగింది. అర్హత సాధించిన అభ్యర్థుల శారీరక దృఢత్వాన్ని పరిశీలించేందుకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల డాక్టర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం పరిశీలన అనంతరం పలువురికి నియామకపు ఉత్తర్వులు అంద జేశారు. డాక్టర్ల బృందం పరిశీలనపై ఆరోపణలు రావడంతో...వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చెందిన వైద్యులతో ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
పరిశీలన జరిపిన ఈ బృందం ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పలువురు అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లకు ఇచ్చిన నియామకపు ఉత్తర్వులను రద్దు చేసింది. నియామకాలు రద్దయిన వారు ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. ఏపీఏటీ వారి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాలను జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రెండో వైద్య బృందం పరిశీలనలో జరిగిన లోపాలను వారు ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం, మూడో వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. మూడో వైద్య బృందం ఏర్పాటు, పరిశీలన ప్రక్రియ ఈ ఏడాది మార్చి 30 కల్లా పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
తాజాగా ఈ కేసు విచారణకు రాగా, ఇప్పటి వరకు మూడో వైద్య బృందాన్ని ఏర్పాటు చేయని విషయాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది గంగయ్యనాయుడు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం.. ఈ నెల 8న స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ ఇరు రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది.