ఒకే అంశం.. రెండు కోర్టులు.. విచారణ రేపు
ఒకే అంశంపై ఇరు పక్షాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై అటు సర్వోన్నత న్యాయస్థానం, ఇటు ఢిల్లీ హైకోర్టుల్లో విచారణ జరగనున్న అరుదైన సందర్భమిది. లెఫ్టినెంట్ గవర్నర్ కు విశేషాధికారాలను కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన నోలిఫికేషన్ ను సవాలు చేస్తూ గురువారం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయంలో తాము జారీచేసిన నోటిఫికేషన్ ను అనుమానాస్పదంగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన గత ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ రెండు పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి మరిన్ని అధికారాలు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్.. దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంలో భాగమని మోదీ సర్కారుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంతో సుదీర్ఘ పోరుకు సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాది (ఎస్పీ), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తమకుందని, ఈ అంశంపై ఆయా పార్టీలు పార్లమెంటులో కేంద్రంపై పోరు కొనసాగిస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.