సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ఎట్టకేలకు పూర్తయింది. గత నాలుగు రోజులుగా అదిగో.. ఇదిగో అంటున్న విభజన నోటిఫికేషన్ వెలువడింది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ దానిని గెజిట్‌లో ప్రచురించింది. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరి స్తారు. అలాగే తెలంగాణకు ఆప్షన్ ఇచ్చిన 10 మంది న్యాయమూర్తులు కూడా జనవరి 1, 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా చెలామణి అవుతారు. దీంతో ఉమ్మడి హైకోర్టు అంతర్థానమై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పడినట్లైంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించేది వీరే.
1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.)
2. జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
3. జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి
4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి
5.జస్టిస్ దామా శేషాద్రి నాయుడు (బదిలీపై ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు)
5. జస్టిస్ మంథాట సీతారామమూర్తి
6.జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు
7.జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి
8.జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి
9.జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్
10.జస్టిస్ జవలాకర్ ఉమాదేవి
11.జస్టిస్ నక్కా బాలయోగి
12.జస్టిస్ తేలప్రోలు రజని
13.జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు
14.జస్టిస్ కొంగర విజయలక్ష్మి
15.జస్టిస్ మంతోజు గంగారావు.
ఈ 16 మందిలో జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శేషాద్రి నాయుడు వేరే హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా కొనసాగుతున్నందున మిగిలిన 14 మందే జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు.
ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల విషయానికొస్తే..
1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్
2. జస్టిస్ మామిడన్న సత్యరత్న శ్రీరామచంద్రరావు
3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు
5. జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి
6. జస్టిస్ బులుసు శివశంకర్ రావు
7. జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్
8. జస్టిస్ పోట్లపల్లి కేశవరావు
9. జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి
10. జస్టిస్ తొండుపునూరి అమర్‌నాథ్ గౌడ్ వ్యవహరిస్తారు.
ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారు.
ఆ ముగ్గురు ఎక్కడికి బదిలీ..?
ఇక బయట రాష్ట్రాల నుంచి బదిలీపై ఇక్కడి వచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సింది. అది కూడా జనవరి 1 లోపు జరగాల్సి ఉంది. కొలీజియం నిర్ణయం ఆధారంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకవేళ జనవరి 1లోపు వీరి బదిలీపై నిర్ణయం తీసుకోని పక్షంలో లేదా బయట నుంచి ఎవరైనా సీనియర్ న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలి. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న ఏపీ న్యాయమూర్తుల సీనియారిటీ జాబితా ప్రకారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ఆ పరిస్థితి వస్తుందా? రాదా? అన్న విషయం రెండు మూడు రోజుల్లో తేలనుంది.
పోరాడి సాధించుకున్నాం హైకోర్టు విభజనపై ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనను టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ స్వాగతించారు. హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి, న్యాయశాఖ మంత్రిని కలసి విజ్ఞప్తి చేసిన సంగతిని, పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలు హైకోర్టు విభజనపై కేంద్రాన్ని పలుమార్లు నిలదీసిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కాబోతుండటం సంతోషం. పోరాటం చేయడం ద్వారా ఏర్పాటుకు ఉన్న అవాంతరాలను అధిగమించాం. చాలాసార్లు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడంతోపాటుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు నిర్వహించాం. ఎట్టకేలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పుడే రాష్ట్ర సంపూర్ణ విభజన జరిగినట్టు భావిస్తున్నాం. కొన్నిశక్తులు ఉమ్మడి రాజధాని ఉన్నంతవరకు ఉమ్మడి హైకోర్టు ఉండేలా ప్రయత్నాలు చేయాలనుకున్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండటం ద్వారా తెలంగాణలో సత్వరన్యాయం అందుతుందని ఆశిస్తున్నాం..’అని పేర్కొన్నారు.
ఇది శుభదినం: జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధించుకున్న రోజున సంతోషించినట్టుగానే హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ వెలువడిన ఈరోజు కూడా అంతే సంతోషిస్తున్నామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘అనేకసార్లు లోక్‌సభను స్తంభింపజేశాం. ఎంపీలందరం కలిసి పోరాడాం. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే హైకోర్టులు ఏర్పడ్డా తెలంగాణ విషయంలో అలా జరగలేదు. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుండటం హర్షణీయం. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితోనే హైకోర్టు విభజనకు పోరాడాం. న్యాయమంత్రులుగా ఉన్న సదానంద గౌడ, ఆయన తర్వాత రవిశంకర్ ప్రసాద్‌లకు అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. పార్లమెంటులో కొన్ని రోజులు మౌనంగా పోరాడాం. ..’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment